మునుగోడులో టీఆర్ఎస్(TRS) దూకుడు కొనసాగుతోంది. మెల్లిమెల్లిగా తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్న గులాబీ పార్టీ.. 11వ రౌండ్ ముగిసే సరికి తన మెజార్టీని 5 వేల దాటేసింది. 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్ ఆధిక్యత 5774కు చేరుకుంది. మరో నాలుగు రౌండ్ల ఓటింగ్ లెక్కింపు మాత్రమే ఉండటం.. ఓట్ల లెక్కింపు జరగాల్సిన మండలాల్లో తమకే మెజార్టీ వచ్చే అవకాశం ఉండటంతో.. తమ గెలుపు ఖాయమని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ శ్రేణులు అప్పుడే తెలంగాణ భవన్లో డప్పులు మోగిస్తూ, బాణాసంచా కాల్చూతూ సంబరాలు చేసుకోవడం మొదలుపెట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కాగానే మొదటగా టీఆర్ఎస్ ఆధిక్యత సాధించింది.పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో స్వల్ప ఆధిక్యత సాధించిన టీఆర్ఎస్.. ఓట్ల లెక్కింపు మొదలైన తరువాత మొదటి రౌండ్లో వెయ్యికి పైగా ఓట్ల మెజార్టీ సాధించింది.
అయితే ఆ తరువాత 2,3 రౌండ్ల బీజేపీ(BJP) ఆధిక్యత సాధించడంతో సీన్ మారిపోతుందేమో అని చాలామంది భావించారు. కానీ ఆ తరువాత 4వ రౌండ్ నుంచి 11వ రౌండ్ టీఆర్ఎస్ ఆధిక్యత కొనసాగుతూ వచ్చింది. క్రమక్రమంగా టీఆర్ఎస్ తన ఆధిక్యతను పెంచుకుంటూ పోయింది. 11వ రౌండ్లో టీఆర్ఎస్కు 7,235, బీజేపీకి 5,877 ఓట్లు వచ్చాయి. 15వ రౌండ్ ముగిసే సమాయానికి టీఆర్ఎస్ మెజార్టీ మరింతగా పెరుగుతుందని గులాబీ పార్టీ కార్యకర్తలు లెక్కలు వేసుకుంటున్నారు.
మునుగోడు(Munugodu) ఉప ఎన్నికల్లో మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లిలో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి.
Munugodu By Poll: మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఆలస్యం.. ఎన్నికల ప్రధానాధికారి ఏమన్నారంటే..
పోలింగ్ ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 1, 2, 3, 4 రౌండ్లు, సంస్థాన్ నారాయణపురం మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 4, 5, 6 రౌండ్లు, మునుగోడు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 6, 7, 8 రౌండ్లు, చండూరు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 8, 9, 10 రౌండ్లు, గట్టుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 10, 11 రౌండ్లు, మర్రిగూడ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 11, 12, 13 రౌండ్లు, నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 13, 14, 15 రౌండ్లలో జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu By Election, Telangana