మునుగోడు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపులో టీఆర్ఎస్ ఆధిక్యత మెల్లిమెల్లిగా పెరుగుతోంది. 9వ రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి 3925 ఓట్ల మెజార్టీతో దూసుకుపోతోంది. 9వ రౌండ్లో టీఆర్ఎస్ ఆధిక్యతకు చెక్ పడుతుందని.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి మెజార్టీ వస్తుందని బీజేపీ అంచనాలు వేసుకుంది. కానీ బీజేపీ(BJP) అంచనాలు తారుమారైనట్టు.. వాస్తవ ఫలితాలను బట్టి అర్థమవుతోంది. నిజానికి మునుగోడు నియోజకవర్గంలో చౌటుప్పల్ తరువాత బీజేపీ నేతలు తమకు ఎక్కువ ఓట్లు చండూరులోనే వస్తాయని లెక్కలు వేసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) సైతం ఎక్కువగా చండూరుపైనే ఫోకస్ పెట్టడం.. అక్కడే ఆయన నివాసం కూడా ఏర్పరుచుకోవడంతో.. చండూరులో బీజేపీకి కొంత ఎడ్జ్ ఉంటుందని చాలామంది భావించారు. చౌటుప్పల్ తరువాత మునుగోడు(Munugodu) నియోజకవర్గంలో చండూరు కొంత అర్బన్ ప్రాంతం కూడా కావడంతో.. ఇక్కడ బీజేపీ ఓటింగ్ పెరుగుతుందని భావించారు. కానీ వాస్తవ ఫలితాలు మాత్రం అందుకు భిన్నంగా వచ్చాయి. చండూరులోనూ బీజేపీ కంటే టీఆర్ఎస్ ఎక్కువ ఓట్లు సాధించింది.
ఇక చండూరు ఓట్ల లెక్కింపు పూర్తయిన తరువాత గట్టుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల లెక్కింపు మొదలుకానుండటంతో.. అక్కడ తమకే ఓట్లు పడతాయని టీఆర్ఎస్ లెక్కలు వేసుకుంటోంది. గట్టుప్పల్ ప్రజల చిరకాల డిమాండ్ అయిన గట్టుప్పల్ మండలాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడంతో.. ఇక్కడ ప్రజలు టీఆర్ఎస్ వైపే సానుకూలంగా ఉంటారని టీఆర్ఎస్ భావిస్తుంటే.. రాజగోపాల్ రెడ్డి రాజీనామా వల్లే గట్టుప్పల్ మండలం ఏర్పాటైందని అక్కడి ప్రజలు భావిస్తున్నారని.. ఆ లెక్కన గట్టుప్పల్‌లో తమకు ఎక్కువ ఓట్లు వస్తాయని బీజేపీ భావిస్తోంది.
మునుగోడు ఉప ఎన్నికల్లో మొత్తం 2,41,805 మంది ఓటర్లకుగాను 2,25,192 మంది ఓటు వేశారు. పోస్టల్‌బ్యాలెట్ ఓట్లు కలుపుకొని 93.41 శాతం నమోదైంది. చౌటుప్పల్‌లో 59,433 ఓట్లు ఉండగా 55,678 ఓట్లు, సంస్థాన్ నారాయణపురంలో 36,430 ఓట్లు ఉండగా 34,157 ఓట్లు, మునుగోడు 35,780 ఓట్లు ఉండగా 33,455 ఓట్లు, చండూరులో 33,509 ఓట్లు ఉండగా 31,333 ఓట్లు, గట్టుప్పల్‌లో 14,525 ఓట్లు ఉండగా 13,452 ఓట్లు, మర్రిగూడలో 28,309 ఓట్లు ఉండగా 25,877 ఓట్లు, నాంపల్లిలో 33,819 ఓట్లు ఉండగా 31,240 ఓట్లు పోలయ్యాయి.
Munugode Bypoll Result: బీజేపీ, టీఆర్ఎస్ హోరాహోరీ.. ఐదో రౌండ్ అత్యంత కీలకం.. ఎందుకంటే..
పోలింగ్ ప్రక్రియలో భాగంగా చౌటుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 1, 2, 3, 4 రౌండ్లు, సంస్థాన్ నారాయణపురం మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 4, 5, 6 రౌండ్లు, మునుగోడు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 6, 7, 8 రౌండ్లు, చండూరు మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 8, 9, 10 రౌండ్లు, గట్టుప్పల్ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 10, 11 రౌండ్లు, మర్రిగూడ మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 11, 12, 13 రౌండ్లు, నాంపల్లి మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్ 13, 14, 15 రౌండ్లలో జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugode Bypoll, Telangana