మునుగోడు ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్కు ఊహించని బిగ్ షాక్ తగిలింది. టీఆర్ఎస్కు చెందిన భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ (Bura Narsaiah Goud) బీజేపీలో చేరబోతున్నారు. నిన్న బండి సంజయ్, తరుణ్ చుగ్‌తో సమావేశమైన బూర నర్సయ్య గౌడ్.. ఢిల్లీలో ఆ పార్టీ బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాను కూడా కలిశారని తెలుస్తోంది. ఈ రోజే ఆయన బీజేపీ ముఖ్యనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను(Amit Shah) కలిసి.. ఆయన సమక్షంలోనే కాషాయ కండువా కప్పుకుంటారని బీజేపీ(BJP) వర్గాలు చెబుతున్నాయి. మునుగోడులో ఉప ఎన్నిక ఖాయమైన తరువాత టీఆర్ఎస్(TRS) తరపున టికెట్ ఆశించారు బూర నర్సయ్య. ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్ రెడ్డిపై తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు.
అయితే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ప్రకటించిన తరువాత బూర నర్సయ్య గౌడ్ సైలెంట్‌గా ఉండటంతో.. ఆయన కూల్ అయ్యారని అంతా అనుకున్నారు. కానీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేసిన వెంటనే ఆయన బీజేపీ నేతలతో సమావేశం కావడం.. ఆ మరుసటి రోజే బీజేపీ కండువా కప్పుకోవాలని నిర్ణయించుకోవడం టీఆర్ఎస్ వర్గాలకు షాక్ ఇస్తోంది. మునుగోడు నియోజకవర్గంలో గౌడ సామాజికవర్గం ఓట్లు ఎక్కువగానే ఉన్నాయి. ఈ క్రమంలోనే కీలక సమయంలో బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్కు హ్యాండ్ ఇవ్వడం ఆ పార్టీకి మైనస్ అవుతుందని.. ఇది బీజేపీకి సరికొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని ఆ కమలం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
బూర నర్సయ్య గౌడ్ తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించారు. డాక్టర్స్ జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించారు. కేసీఆర్ ఆమరణ దీక్ష చేసిన సమయంలో ఆయన వెంటే ఉన్నారు బూర నర్సయ్య గౌడ్. ఈ కారణంగానే కేసీఆర్ ఆయనకు 2014లో భువనగిరి ఎంపీ టికెట్ ఇచ్చారని చెబుతుంటారు. 2014లో టీఆర్ఎస్ తరపున భువనగిరి ఎంపీగా విజయం సాధించిన బూర నర్సయ్య గౌడ్.. 2019లో మాత్రం కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు.
Komatireddy Venkat Reddy Job Mela: ఎంపీ కోమటిరెడ్డి ఆధ్వర్యంలో రేపు, ఎల్లుండి భారీ జాబ్ మేళా.. 250 కంపెనీల్లో 20 వేల జాబ్స్ .. పూర్తి వివరాలివే
Munugodu: మంత్రి మల్లారెడ్డిపై మళ్లీ విమర్శలు .. మునుగోడు ప్రచారంలో ఆ విధంగా ప్రవర్తించడం తగునా..
అయితే ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డితో బూర నర్సయ్య గౌడ్‌కు చాలాకాలంగా విభేదాలు ఉన్నాయనే టాక్ ఉంది. జగదీశ్ రెడ్డి కారణంగానే తనకు మునుగోడు సీటు రాలేదనే భావనలో ఉన్న బూర నర్సయ్య గౌడ్‌తో బీజేపీ నేతలు టచ్‌లో రావడం.. ఆయన కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం చకచకా జరిగిపోయాయని తెలుస్తోంది. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నికకు ముందు టీఆర్ఎస్కు మింగుడపడని ఈ పరిణామం.. ఆ పార్టీపై ఏ రకమైన ప్రభావం చూపుతుందన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Munugodu By Election, Trs