జాతీయ రాజకీయాల్లో పెను సంచలనం రాబోతోందని చెప్పిన తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (Telangana CM KCR) .. దేశవ్యాప్త పర్యటనకు మరోసారి బ్రేక్ ఇచ్చారు. ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంవో) గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం కేసీఆర్ ఇప్పటికే మహారాష్ట్ర వెళ్లాల్సి ఉన్నా, ఆ పర్యటన రద్దయింది. ఈ నెలాఖరులోనే పశ్చిమబెంగాల్, బీహార్ పోవాల్సి ఉన్నా ప్రస్తుతం ఆ పర్యటన సైతం సందిగ్ధంలో పడింది.
సుదీర్ఘ విరామం తర్వాత ఫామ్ హౌజ్ నుంచి బయటికొచ్చిన కేసీఆర్ 8రోజుల వ్యవధిలోనే మూడోసారి ఎర్రవల్లి వెళ్లిపోయారు. ఆయన తిరిగి ప్రగతి భవన్ వచ్చాకగానీ తదుపరి కార్యక్రమాల ప్రకటన ఉండబోదని తెలుస్తోంది. కాగా, దసరా నుంచి కేసీఆర్ రాజకీయం మామూలుగా ఉండదని, ఆయన ప్రధాని కాబోతున్నారని టీఆర్ఎస్ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు. వివరాలివి..
గత కొద్ది రోజులుగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెంచిన తెలంగాణ సీఎం కేసీఆర్.. దేశవ్యాప్త పర్యటనలకు బ్రేకిస్తూ మళ్లీ ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్‌కు వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి ప్రగతి భవన్‌లోనే ఉన్న ముఖ్యమంత్రి సాయంత్రం ఫామ్‌హౌస్ కు బయలుదేరి వెళ్లారు. గురువారం ఉదయం బెంగళూరు పర్యటనకు వెళ్లిన కేసీఆర్.. రాత్రి తిరిగి వచ్చిన తర్వాత రెండు వివాహాలకు హాజరయ్యారు. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయాన్నే మహారాష్ట్రలోని రాలేగావ్ సిద్ధికి కేసీఆర్ వెళ్లాల్సి ఉంది. ప్రముఖ సామాజిక ఉద్యమకారుడు అన్నా హజారేను కలిసి, అటు నుంచి అటే షిర్డీకి వెళ్లి సాయిబాబా దర్శనం చేసుకోవాల్సి ఉండగా.. ఆ పర్యటన రద్దయింది. వచ్చే నెల 2 లేదా 3న రాలేగావ్ సిద్ధికి కేసీఆర్ వెళ్లే అవకాశమున్నట్లు తెలిసింది.
కాగా, 29 లేదా 30న పశ్చిమబెంగాల్, బిహార్ రాష్ట్రాల పర్యటనకు కేసీఆర్ వెళతారని గతంలోనే సీఎంవో ప్రకటించింది. అయితే, శుక్రవారం నాటి పర్యటన రద్దు కావడం, సీఎం కేసీఆర్ ఫామ్‌హౌ్‌సకు వెళ్లిన నేపథ్యంలో బెంగాల్, బిహార్ పర్యటనపై సందిగ్దం నెలకొంది. దీనిపై సీఎంవో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేసీఆర్ ఫామ్‌హౌస్ నుంచి తిరిగి వస్తే తప్ప.. పర్యటన గురించి ఏమీ చెప్పలేమని సీఎంవో వర్గాలు అంటున్నాయి. గత నెల 30న ఎర్రవల్లిలోని ఫామ్‌హౌస్ కు వెళ్లిన కేసీఆర్ ఏకంగా 16 రోజుల పాటు అక్కడే ఉండి ఈ నెల 16నే ప్రగతి భవన్‌కు తిరిగి వచ్చారు. ఈ నెల 20న ఢిల్లీ, చంఢీగఢ్ పర్యటనకు వెళ్లి 22న తిరిగి వచ్చారు. 23న ప్రగతి భవన్‌లోనే ఉండి, 24న మళ్లీ ఫామ్‌హౌ్‌సకు వెళ్లారు. 25న ప్రగతి భవన్‌కు వచ్చి, 26న ఉదయం బెంగళూరు పర్యటనకు వెళ్లారు. తాజాగా శుక్రవారం సాయంత్రం మళ్లీ ఫామ్‌హౌ్‌సకు వెళ్లడంతో నెల రోజుల్లోనే మూడోసారి వెళ్లినట్లయింది. ఇదిలా ఉంటే,
దేశ రాజకీయాల్లో అతి త్వరలోనే సంచలనం చూడబోతున్నారంటూ కేసీఆర్ ఢిల్లీ, బెంగళూరు పర్యటనల్లో మీడియాతో అన్నారు. జాతీయస్థాయిలో మార్పు రాబోతోంది.. దాన్ని ఎవరూ ఆపలేరు.. 2-3 నెలల తర్వాత మీకు సంచలన వార్త అందుతుంది.. అని కేసీఆర్ ఉద్ఘాటించారు. ఆ సంచలనం ఏమిటోనని రాజకీయ పండితులు, విశ్లేషకులు తలలు బద్దలుకొట్టుకుంటుండగా, టీఆర్ఎస్ మంత్రి మల్లా రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా తర్వాత సీఎం కేసీఆర్ రాజకీయం మామూలుగా ఉండదని, ఆయన దేశ ప్రధాని అవుతారని మల్లారెడ్డి అన్నారు.
దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చూడబోతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న వేళ మంత్రి మల్లారెడ్డి వరంగల్ పర్యటనలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కాబోయే ప్రధాని కేసీఆరే అని, విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, పూర్తిగా దేశ రాజకీయాలపైనే ఫోకస్ పెడతారని మంత్రి మల్లారెడ్డి తెలిపారు. కేసీఆర్ ప్రధాని కావాలని భద్రకాళి అమ్మవారికి మొక్కినట్లు మంత్రి చెప్పారు. కేసీఆర్ దసరా ముహుర్తంపై రకరకాల వాదనలు వినిపిస్తున్నాయి. ప్లీనరీలో ప్రస్తావించినట్లు భారత రాష్ట్ర సమితి ఏర్పాటు చేసి కేసీఆర్ జాతీయరాజకీయాల్లోకి వెళితే, తెలంగాణకు ముఖ్యమంత్రిగా ఆయన కొడుకు కేటీఆర్ ను నియమిస్తారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Malla Reddy, Telangana, Trs