జాతీయ రాజకీయాల్లో సంచలనం సృష్టించబోతున్నట్లు ప్రకటించిన తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR).. సొంత రాష్ట్రంలోనూ పార్టీ పరంగా అంతకంటే సంచలన నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీ (BJP)ని ఇరుకున పెట్టేలా, తెలంగాణలో కారు స్టీరింగ్ ను తర్వాతి తరానికి అందించేలా కేసీఆర్ అనూహ్య అడుగులు వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటు జాతీయ ప్రణాళిక, ఇటు వారసత్వ ఉద్ధరణ ఒకేసారి సాధ్యమయ్యేలా కేసీఆర్ తదుపరి ఎన్నికల్లో గజ్వేల్ ను వీడి ఢిల్లీ బాటపట్టబోతున్నట్లు సమాచారం. తద్వారా మారనున్న పరిణామాల్లో కేసీఆర్ కొడుకు, మంత్రి కేటీఆర్ కు జాక్ పాట్ తగలొచ్చనే చర్చ కూడా నడుస్తోంది. వివరాలివే..
తెలంగాణలో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడంలేదని, కచ్చితంగా నియోజకవర్గం మారవచ్చని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నది. కేసీఆర్ ఈసారి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి బరిలోకి దిగుతారనే లీకులు వచ్చాయి. అయుతే తాజాగా ఆయన మెదక్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా బరిలోకి దిగుతారనే అభిప్రాయం వినిపిస్తోంది. జాతీయ స్థాయిలో బీజేపీని నిలువరించేలా కేసీఆర్ పక్కా వ్యూహాలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించే ప్రయత్నాల్లో ఉన్న కేసీఆర్.. దేశాన్ని గాడిలో పెట్టేలా ప్రజలు తనను ఆశీర్వదించాలంటూ పదే పదే కోరుతున్న విషయం తెలిసిందే. పైగా ప్రస్తుతం మెదక్ నుంచి టీఆర్‌ఎస్ ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి ఈసారి లోక్‌సభకు కాకుండా.. దుబ్బాక నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తారన్న ప్రచారం కూడా కేసీఆర్ పార్లమెంటుకు వెళతారన్న అభిప్రాయాలకు బలం చేకూరుస్తోంది. వాస్తవానికి శాసనసభలో అడుగు పెట్టాలని కొత్త ప్రభాకర్‌రెడ్డికి ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ గజ్వేల్ అసెంబ్లీతో పాటు మెదక్ పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. అనంతరం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి.. ఎంపీ పదవికి సభ్యత్వానికి రాజీనామా చేశారు. దీంతో అదే ఏడాది మెదక్ లోక్‌సభ స్థానానికి వచ్చిన ఉప ఎన్నికలో కొత్త ప్రభాకర్‌రెడ్డికి టికెట్ ఇచ్చారు. తిరిగి 2019లోనూ ఆయనకే ఇచ్చారు. రానున్న ఎన్నికల్లో కొత్త ప్రభాకర్ రెడ్డిని దుబ్బాక నుంచి బరిలోకి దించాలని పార్టీ సూత్రపాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ విషయమై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మంత్రి హరీశ్‌రావు ఇప్పటికే ప్రభాకర్‌రెడ్డికి సూచన చేసినట్టు సమాచారం.
కేసీఆర్ మెదక్ లోక్ సభకు పోటీచేయాలని భావిస్తుండటంతో ఉమ్మడి జిల్లాలోని పలు సీట్లలో మార్పులు జరుగనున్నాయి. ఈసారి గజ్వేల్ నుంచి తాను పోటీ చేయనని, వంటేరు ప్రతా్‌పరెడ్డిని సిద్ధంగా ఉండాలని కేసీఆర్ చెప్పినట్టు ఆయన వర్గీయులు అంటున్నారు. మెదక్ అసెంబ్లీ టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభా్‌షరెడ్డి మధ్య పోటీ ఉంది. ఇక నర్సాపూర్ నియోజకవర్గంలోనూ సిటింగ్ ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, కాంగ్రెస్ నుంచి టీఆర్‌ఎ్‌సలో చేరి మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా ఉన్న మాజీ మంత్రి వి.సునితారెడ్డి వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. ఇక్కడ కూడా ఒకరిని అసెంబ్లీకి, మరొకరిని పార్లమెంట్‌కు పోటీ చేయించే ఆలోచనలో పార్టీ నాయకత్వం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఎవరు, ఎక్కడ పోటీ చేస్తారోనని ఇప్పటినుంచే ఆసక్తి మొదలైంది. ఇదిలా ఉంటే,
జాతీయ అజెండా అమలులో భాగంగా కేసీఆర్ లోక్ సభకు పోటీ చేస్తే, తెలంగాణ ముఖ్యమంత్రి బాధ్యతలను కొడుకు కేటీఆర్ కు కట్టబెడతారనే ప్రచారం జరుగుతోంది. అయితే, తెలంగాణలో ముందుగా శాసనసభ ఎన్నికలు, ఆ తర్వాతే లోక్ సభ ఎన్నికలు జరుగుతాయి. కేసీఆర్ గనుక పోటీ నుంచి దూరంగా ఉంటే ప్రత్యర్థులు ఈ విషయాన్ని ప్రచారాస్త్రంగా మార్చుకునే అవకాశాలు లేకపోలేవు. కాబట్టి, పార్టీకి మరింత ప్రయోజనం చేకూరేలా వేరే నియోజకవర్గం నుంచి అసెంబ్లీ బరిలోకి దిగి, ఆ తర్వాత ఆరు నెలలకే సీఎం పదవిని కొడుకుకు అప్పగించి కేసీఆర్ లోక్ సభలోకి అడుగుపెట్టొచ్చని తెలుస్తోంది. ఈ విషయాలేవీ ఇప్పటిదాకా అధికారికంగా నిర్ధారణ కాలేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.