బీజేపీ భరతం పట్టేడంతోపాటు దేశానికి ప్రత్యామ్నాయ అజెండా సెట్ చేస్తామన్న తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ (Telangana CM KCR) తన ప్రయత్నంలో ఇతర పెద్ద ప్రాంతీయ పార్టీలనూ కలుపుకొని వెళ్లాలని భావిస్తున్నారు. టీఆర్ఎస్ నేతలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయొచ్చనే వార్తల జోరు, పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వంటి కీలక తరుణంలో ఢిల్లీ పర్యటన చేపట్టిన కేసీఆర్ అక్కడ కీలక రాజకీయ చర్చలు జరుపుతున్నారు. వివరాలివే..
తెలంగాణ రాష్ట్రసమితి (టీఆర్ఎస్), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ) జాతీయ స్థాయిలో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నాయి. సీఎం కేసీఆర్, ఎస్పీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఈ మేరకు ఒక అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీ తుగ్లక్ రోడ్‌లోని తన నివాసంలో కేసీఆర్ శుక్రవారం నాడు అఖిలేశ్, ఎస్పీ ఎంపీ రామ్‌గోపాల్ యాదవ్‌లతో లంచ్ విందులో కీలక అంశాలను చర్చించారు.
జాతీయ రాజకీయాలు, ప్రతిపక్షాల పట్ల కేంద్రం వైఖరి, ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకంగా బీజేపీ సర్కారు నిర్ణయాలు తదితర అంశాలు కేసీఆర్-అఖిలేశ్ భేటీలో చర్చకు వచ్చాయి. ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు గంటకు పైనే జరిగాయి. పార్లమెంట్లో టీఆర్ఎస్ ఇతర ప్రతిపక్షాలతో కలిసి పనిచేస్తున్న విషయాన్ని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రతిపక్షాలు కలిసి ఉంటేనే కేంద్రంపై ఒత్తిడి పెంచవచ్చని కేసీఆర్, అఖిలేశ్ భావించారు.
ప్రాంతీయ పార్టీలు ఒక రాష్ట్రానికే పరిమితం కావడంతో కేంద్రంలో అధికారంలో ఉన్నవారు ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్, అఖిలేశ్ అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. నాయకత్వ పటిమ, పొరుగు రాష్ట్రాల్లో రాజకీయ శూన్యతను భర్తీ చేసే శక్తి ఉన్నప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ప్రాంతీయ పార్టీలు రంగప్రవేశం చేయడం సరైన వ్యూహమని, టీఆర్ఎస్, ఎస్పీలను జాతీయ స్థాయికి విస్తరించాలని ఇద్దరు నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం.
అఖిలేశ్‌తో చర్చల అనంతరం కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో మాట్లాడారు. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్, జాతీయ పెన్షన్ పథకం, డిస్కంల నష్టాలపై కేంద్రానికి పంపాల్సిన సమాచారం గురించి ఆయన అధికారులతో చర్చించినట్లు సమాచారం. కాగా, ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే తెలంగాణకు సంబంధించి కీలక క్లారిటీలు వెలువడుతున్నాయి. హైదరాబాద్ లో ఏర్పాటు చేయ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు రద్దు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించడంతో టీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. సమాచారం ఇవ్వని కారణంగా కాళేశ్వరానికి జాతీయ హోదా రాబోదనీ కేంద్రం తెల్చిచెప్పింది. ఈ రెండు అంశాలతోపాటు తెలంగాణకు జరుగుతోన్నఅన్యాయాలపై పార్లమెంటులో గళమెత్తాలని టీఆర్ఎస్ ఎంపీలకు కేసీఆర్ నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhilesh Yadav, CM KCR, Delhi, Samajwadi Party, Telangana, Trs