తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ అండతో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy). ఇతర కాంగ్రెస్ నేతల నుంచి సహకారం పెద్దగా లభించకపోయినా.. హైకమాండ్ నుంచి అందుతున్న అండదండలతో ముందుకు సాగుతున్నారు. అయితే ఇటీవల రాజస్థాన్‌లో జరిగిన చింతన్ శివిర్‌లో కాంగ్రెస్ హైకమాండ్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ(Rahul Gandhi) పాదయాత్ర కూడా ఒకటి. అక్టోబర్ 2 నుంచి ఆయన దేశవ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నారు. ప్రతి రాష్ట్రంలోనూ పరిధిని బట్టి 50 నుంచి 100 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేపట్టాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. ఇందుకోసం అన్ని రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నేతలతో ఇప్పటికే రాహుల్ గాంధీ టీమ్ సంప్రదింపులు మొదలుపెట్టిందని... పాదయాత్ర కోసం రోడ్ మ్యాప్ రెడీ చేసి పెట్టుకోవాలని సూచించినట్టు సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ సైతం రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూనే.. తెలంగాణ నుంచి రాహుల్ గాంధీ పాదయాత్ర మొదలుపెట్టాలని తీర్మానం కూడా చేసింది. ఇదిలా ఉంటే రాహుల్ గాంధీ పాదయాత్ర కారణంగా రేవంత్ రెడ్డి నిర్ణయంతో మార్పు వచ్చిందని టాక్ వినిపిస్తోంది. నిజానికి తెలంగాణలోని దాదాపు వంద నియోజకవర్గాల్లో పాదయాత్ర చేపట్టాలని రేవంత్ రెడ్డి చాలాకాలం నుంచి భావిస్తూ వచ్చారు.
కానీ కాంగ్రెస్ పార్టీలో పరిస్థితులు, హైకమాండ్ నుంచి అనుమతి వంటి అంశాల కారణంగా ఈ ప్రతిపాదన కార్యరూపం దాల్చడం లేదు. దీనికి తోడు అనేక మంది నేతలు పాదయాత్ర చేస్తుండటంతో.. ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల కూడా పెద్దగా ప్రయోజనం లేదనే ఆలోచనకు రేవంత్ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. అయితే ఎన్నికల సమయానికి ఎంతో కొంత మేర పాదయాత్ర చేపట్టి ప్రజల్లోకి వెళ్లాలని రేవంత్ రెడ్డి భావించారు.
అయితే తాజాగా రాహుల్ గాంధీ కూడా పాదయాత్ర చేపట్టాలని నిర్ణయం తీసుకోవడంతో.. ఆయనతో పాటు తెలంగాణలో పాదయాత్ర నిర్వహించాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఇక తెలంగాణలో తాను మళ్లీ వేరుగా పాదయాత్ర చేసే అవసరం ఉండకపోవచ్చని.. రాహుల్ గాంధీ పాదయాత్రను విజయవంతం చేయడం ద్వారా తాను కూడా ప్రజల్లోకి వెళ్లినట్టు అవుతుందని రేవంత్ రెడ్డి యోచిస్తున్నట్టు సమాచారం. మొత్తానికి రాహుల్ గాంధీ నిర్ణయం కారణంగా రేవంత్ రెడ్డి పాదయాత్ర ప్లాన్ మారినట్టు అర్థమవుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.