బండి సంజయ్ (Bandi sanjay) రెండో విడత ప్రజా సంగ్రామ యాత్ర (Praja sangrama Yatra) ముగింపు సందర్భంగా.. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగే బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా (Union Minister Amit Shah) పాల్గొననున్నారు. అయితే తెలంగాణ పర్యటనకు వస్తున అమిత్ షాకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి (TPCC President Revanth Reddy) బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో 9 ప్రశ్నలను సంధించారు. కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనక రహస్యమేమిటని ఈ లేఖలో రేవంత్ రెడ్డి.. అమిత్ షాను ప్రశ్నించారు. పంట కొనుగోలు (Crop buying) చేయకుండా ఆడిన రాజకీయ డ్రామాలో.. ధాన్యం రైతుల మరణాలకు భాద్యులెవరో సమాధానం చెప్పండని ప్రశ్నించారు రేవంత్.
2018 అసెంబ్లీ ఎన్నికల తర్వాత మూడోసారి తెలంగాణకు వస్తున్న మీకు తెలంగాణ ప్రజలు, రైతులు, యువత తరఫున కొన్ని ప్రశ్నలు (Few Questions) సంధిస్తున్నా అని లేఖలో పేర్కొన్నారు.
‘‘ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) హయాంలో ప్రారంభించిన ప్రాణహిత-చేవేళ్ల ప్రాజెక్టుకు కాళేశ్వరం అని పేరు మార్చి, రీ డిజైనింగ్ పేరుతో కేసీఆర్ (KCR) కమీషన్లు దండుకుంటున్నారని మేం మొదటి నుండి ఆరోపిస్తున్నాం. ఈ ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఎటీఎంలా మారింది అని... మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా ఇటీవల పదే పదే వ్యాఖ్యానిస్తున్నారు. అవినీతి జరిగిందని అంగీకరిస్తున్న మీరు చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు?
దేశంలో ప్రతిపక్ష నేతలు, మీ సొంత పార్టీలో నిజాలు మాట్లాడే నేతల పై ఈడీ, సీబీఐ ద్వారా కొన్ని గంటల వ్యవధిలోనే దాడులు చేయించే మీరు ఎనిమిదేళ్లుగా కేసీఆర్ కుటుంబ అవినీతిని ఉపేక్షించడం వెనుక రహస్యం ఏమిటో చెబుతారా!?
దక్షిణ అయోధ్యగా ఖ్యాతికెక్కిన భద్రాద్రి రాముడికి (Bhadradri ramudu).. రామాయణం సర్క్యూట్‌లో చోటు ఏదని ప్రశ్నించారు. అయోధ్య రాముడు.. భద్రాద్రి రాముడు మీ దృష్టిలో ఒకటి కాదా?
రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా..
ఇకపై బాయిల్డ్ రైస్ ఇవ్వబోమని అంగీకారం తెలుపుతూ 2021 అక్టోబర్ 4న మీ ఆదేశాల మేరకే FCI కి కేసీఆర్ లేఖ రాశారు. ఆ లేఖపై క్షేత్ర స్థాయిలో "కల్లాల్లోకి కాంగ్రెస్" అని మేం పోరుబాట పట్టడంతో మాటమార్చారు. మీ రెండు పార్టీలు కలిసి ఆడిన రాజకీయ డ్రామా కారణంగా గడచిన వానాకాలం నుండి తెలంగాణ రైతులు తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. పదుల సంఖ్యలో రైతులు వడ్ల కుప్పలపై గుండె పగిలి చనిపోయారు. ఈ మరణాలకు బాధ్యులు మీ రెండు పార్టీలు కాదా!?
గత పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే సందర్భంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ ఏర్పాటు పై చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చి, తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో మీ రాకను తెలంగాణ సమాజం ఎట్లా ఆమోదిస్తుందనుకుంటున్నారు? మా ప్రజలకు ఆత్మగౌరవం, ఆత్మాభిమానం లేదు అని మీరు భావిస్తున్నారా!?
మీ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే నిజామాబాద్ జిల్లాలో పసుపుబోర్డు (Turmeric Board) ఏర్పాటు చేయిస్తామని హామీ ఇచ్చారు. మూడేళ్లవుతున్నా పసుపుబోర్డు ఊసే లేదు. దీనికి మీ సమాధానం ఏమిటి? ఇది ప్రజలను చీట్ చేయడం కాదా!?
ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి..
ఐటీఐఆర్ (ITIR), రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ (Bayyaram Steal factory) లాంటి బృహత్తర పథకాలన్నింటికీ మంగళం పాడారు. మీకు మా ప్రజలు మద్ధతు ఎందుకు ఇవ్వాలి? విభజన చట్టం హామీ ఇచ్చిన గిరిజన యూనివర్సిటీకి మోక్షం ఎప్పుడు?
ఒడిస్సాలోని నైనీ కోల్ మైన్స్ టెండర్ విషయంలో జరిగిన కుంభకోణం వెనుక కేసీఆర్ కుటుంబ పాత్రపై వివరాలు సమర్పించాం. ఇంత వరకు దీనిపై అతీగతీ లేదు. కారణం ఏమిటి? కేసీఆర్ అవినీతి విషయంలో మీరు నిజంగా అంత సీరియస్ గా ఉంటే... అది చేతల్లో ఎందుకు కనిపించడం లేదు?
పొరుగున ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు. తెలంగాణలో రెండు ప్రధాన ప్రాజెక్టుల్లో ఒక్క దానికి కూడా జాతీయ హోదా ఇవ్వాలన్న ఆలోచన మీకు రాలేదు. మీ దుర్మార్గ చట్టాలకు టీఆర్ఎస్ మద్ధతు.. వారి అక్రమాలు అవినీతికి మీ మద్ధతు.. ఇది కాదా ఎనిమిదేళ్లుగా జరిగింది!?
పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని..
ధరల పెరుగుదలతో జన చస్తుంటే మీకు చీమకుట్టినట్టైనా అనిపించడం లేదా? ఈ ధరల్లో 60 శాతం వరకు బీజేపీ - టీఆర్ఎస్ (TRS) ప్రభుత్వాలు బాదుతున్న పన్నులే ఉన్నాయి. మీరు తగ్గించాలని వారు, వారు తగ్గించాలని మీరు డ్రామాలు చేయడం తప్ప... ప్రజలకు ఇద్దరు కలిసి ఇస్తున్న ఉపశమనం శూన్యం. ఇంతలా జనాలను పన్నులు, సెస్సులతో చావగొట్టే మిమ్మల్ని మా తెలంగాణ ప్రజలు ఎందుకు క్షమించాలి?
అమిత్ షా గారూ.. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మీరు తెలంగాణకు ఏ మొఖం పెట్టుకుని వస్తారు? మోసానికి కవల పిల్లలు లాంటి బీజేపీ - టీఆర్ఎస్ జిత్తులు, ఎత్తులు గ్రహించ లేని అమాయకులా తెలంగాణ ప్రజలు? మా ప్రజలకు ఒపిక ఎక్కువ... దానిని అమాయకత్వం అనుకుంటే పొరపాటు. సాయుధ పోరాటం నుండి స్వరాష్ట్ర పోరాటం వరకు ప్రపంచానికే పోరాట పంథాను చూపిన తెగువగల ప్రజలు మా వాళ్లు. సెంటిమెంట్ తో ప్రజల మనోభావాలతో ఆడుకునే ప్రయత్నం చేయాలనుకునే మీ కుతంత్రం ఇక్కడ పని చేయదు’’ అని రేవంత్ లేఖలో పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Bjp, Congress, Revanth Reddy, Tamil nadu Politics