ఇతర పార్టీలతో పోల్చితే కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు చాలా ఎక్కువ. ఎవరికీ వాళ్లు పార్టీలో తమ ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికి ప్రయత్నాలు చేస్తుండటం, తమ వర్గీయులకు టికెట్లు ఇప్పించుకోవాలనే ప్రయత్నాలు చేయడమే ఇందుకు ప్రధాన కారణం. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy) కూడా తన సన్నిహితులకు టికెట్లు ఇప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారనే వాదన ఉంది. ఈ కారణంగానే అనేక మంది సీనియర్ నేతలు.. ఇతర నేతలు ఆయనపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారనే చర్చ జరుగుతోంది. ఇలా రేవంత్ రెడ్డి కారణంగా తన సీటు కోల్పోతామనే భావనలో ఉన్న నాయకుల జాబితాలో మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి కూడా ఉన్నారనే వాదన చాలాకాలంగా ఉంది. సూర్యాపేట(Suryapeta) నుంచి గతంలో గెలిచిన దామోదర్ రెడ్డి(Ramreddy Damodar Reddy).. గత రెండు పర్యాయాలు అక్కడి నుంచి ఓటమి పాలయ్యారు.
అయితే రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్లో చేరిన పటేల్ రమేశ్ రెడ్డి.. ఈసారి సూర్యాపేట నుంచి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయనకు రేవంత్ రెడ్డ సపోర్ట్ గట్టిగా ఉండటంతో.. మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డికి ఈసారి టికెట్ దక్కడం కష్టమే అనే పుకార్లు షికారు చేశాయి. అయితే మునుగోడు ఉప ఎన్నికల హడావిడి మొదలైన తరువాత రాంరెడ్డి దామోదర్ రెడ్డి రేవంత్ రెడ్డికి సన్నిహితంగా మారిపోయారు. మునుగోడు ఉప ఎన్నికల్లో ఇంఛార్జ్ బాధ్యతలు కూడా ఆయనకు అప్పగించారు.
దీంతో రేవంత్ రెడ్డి, రాంరెడ్డి దామోదర్ రెడ్డి మధ్య సఖ్యత, సయోధ్య కుదిరిందని.. ఈ కారణంగానే దామోదర్ రెడ్డి రేవంత్ రెడ్డికి దగ్గరయ్యారా ? అనే చర్చ జరుగుతోంది. ఒకవేళ నిజంగానే దామోదర్ రెడ్డికి మరోసారి సూర్యాపేట నుంచి పోటీ చేసే అవకాశం లభిస్తే.. తన సన్నిహితుడైన పటేల్ రమేశ్ రెడ్డికి ఆయన ఏ రకంగా న్యాయం చేస్తారనే దానిపై కూడా అనేక రకాలుగా చర్చ జరుగుతోంది. అయితే సీనియర్లతో సఖ్యత ఉండరనే అంశంపై అనేక విమర్శలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి.. దామోదర్ రెడ్డితో స్నేహం పెంచుకుని తనకు సీనియర్ల మద్దతు కూడా ఉందని చాటి చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారేమో అనే టాక్ కూడా వినిపిస్తోంది.
MLA Raja Singh: సుప్రీంకోర్టు గడప తొక్కిన BJP ఎమ్మెల్యే రాజాసింగ్.. పూర్తి వివరాలివే
By elections: మునుగోడు ఉప ఎన్నికతో పాటు ఆ నియోజకవర్గానికీ ఉపఎన్నిక రానుందా..?
మరోవైపు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సీనియర్ నాయకులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జానారెడ్డి, దామోదర్ రెడ్డిలో ఉత్తమ్, కోమటిరెడ్డితో రేవంత్ రెడ్డికి మొదటి నుంచి పెద్దగా సఖ్యత లేదనే చర్చ నడుస్తోంది. జానారెడ్డి మద్దతు పూర్తిగా ఉన్నప్పటికీ మరో సీనియర్ నాయకుడి మద్దతు కూడా తనకు అవసరమని భావించిన రేవంత్ రెడ్డి.. ఈ క్రమంలోనే రాంరెడ్డి దామోదర్ రెడ్డితో సఖ్యత పెంచుకున్నారనే టాక్ కూడా ఉంది. ఏదేమైనా.. రేవంత్ రెడ్డి, దామోదర్ రెడ్డి మధ్య చిగురించిన సరికొత్త స్నేహానికి.. సూర్యాపేట సీటుకు ఏమైనా సంబంధం ఉందా ? అనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana