TS POLITICS TPCC PRESIDENT REVANTH REDDY COUNTERS RAJAGOPAL REDDY IN MUNUGODU CONSTITUENCY AK
Revanth Reddy Versus Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి రేవంత్ రెడ్డి కౌంటర్.. వీటికి సమాధానం చెప్పాలంటూ...
రేవంత్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి (ఫైల్ ఫోటో)
Revanth Reddy: 2018 ఎన్నికల తరువాత తెలంగాణలో నాలుగు ఉప ఎన్నికలు జరిగితే.. రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల టీఆర్ఎస్ గెలిచిందని.. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏం మారాయని రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించాలని కోరారు రేవంత్ రెడ్డి. మునుగోడు నియోజకవర్గం చండూరులో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్ రెడ్డి... రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) తనపై చేసిన ఆరోపణలు.. ఉప ఎన్నికల అంశంలో చెబుతున్న అంశాలపై తనదైన శైలిలో ప్రశ్నలకు సంధించారు. అమిత్ షా, బీజేపీ ఇచ్చిన కాంట్రాక్ట్ కోసం కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని రేవంత్ రెడ్డి (Revanth reddy) విమర్శించారు. ఒకవేళ మునుగోడు ఉప ఎన్నిక కోసమే రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఉంటే.. మరోసారి కాంగ్రెస్ గుర్తుపైనే పోటీ చేసినా.. అది జరిగే ఉండేది కదా అని ప్రశ్నించారు.
జైలుకు వెళ్లొచ్చిన తన నాయకత్వంలో పని చేయడం ఇష్టం లేకే పార్టీ మారుతున్నానని రాజగోపాల్ రెడ్డి అనడంపై రేవంత్ రెడ్డి స్పందించారు. తాను 30 రోజుల్లో జైలులో ఉంటే.. అమిత్ షా 90 రోజులు జైలులో ఉన్నాడని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరి అలాంటి అమిత్ షా సారథ్యంలోని పార్టీలో ఏ రకంగా పని చేస్తారని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఓడినా పోయేదేమీ లేదని రేవంత్ రెడ్డి అన్నారు.
2018 ఎన్నికల తరువాత తెలంగాణలో నాలుగు ఉప ఎన్నికలు జరిగితే.. రెండు చోట్ల బీజేపీ, రెండు చోట్ల టీఆర్ఎస్ గెలిచిందని.. ఇప్పుడు అక్కడ పరిస్థితులు ఏం మారాయని రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. సాధారణ పరిస్థితుల్లో రాజగోపాల్ రెడ్డి పార్టీ మారి ఉంటే ఎవరూ పట్టించుకునేవాళ్లు కాదని.. కానీ తెలంగాణ తల్లి లాంటి సోనియాగాంధీని ఈడీ విచారణ పేరుతో హింసిస్తున్న బీజేపీ నేతల దగ్గర కాంట్రాక్ట్ తీసుకుని వారికి పంచన చేరడం అత్యంత దారుణమని విమర్శించారు.
మునుగోడు లాంటి గడ్డమీద కూడా ఇలాంటి వాళ్లు మళ్లీ గెలిస్తే ప్రజాస్వామ్యానికి అర్థం ఉండదని.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలు, యువకుల మీద ఉందని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే రోజుల్లో తాను ఇక్కడికి వచ్చి ప్రతి గ్రామంలో తిరుగుతానని రేవంత్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరిని కలుస్తానని.. కాంగ్రెస్కార్యకర్తలకు వేధించే వారికి తగిన బుద్ధి చెబుతామని విమర్శించారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.