అటు బీజేపీని..ఇటు బీఆర్‌ఎస్‌ని విమర్శిస్తూ ..ప్రజాక్షేత్రంలో రెండు పార్టీల వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ ప్రజల్లో మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పాదయాత్ర శుక్రవారం జగిత్యాలలో చేపట్టారు.ఇందులో భాగంగానే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాంపై దర్యాప్తు చేస్తున్న ఈడీ అధికారులు ఎలాంటి విషయాల్ని బహిర్గతం చేయకపోవడాన్ని రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియాగాంధీ పట్ల వ్యవహరించినట్లుగా కవితపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. ఈడీ, సీబీఐ బీజేపీ జేబు సంస్థలుగా పని చేస్తున్నాయని ఆరోపించారు టీపీసీసీ చీఫ్.
బీఆర్ఎస్, బీజేపీ కుమ్మక్కయ్యాయి..
ఇక తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అవినీతి ఆరోపణలు వచ్చాయని తాటికొండ రాజయ్యను మంత్రి మండలి నుంచి బర్తరఫ్ చేసిన కేసీఆర్ ..ఇప్పుడు కల్వకుంట్ల కవిత విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. లిక్కర్ స్కాంపై కేసీఆర్ మౌనపాత్ర పోషిస్తుంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కనిపించడం లేదా అని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ అవినీతిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు ఎందుకు విచారణ చేపట్టలేదో చెప్పాలన్నారు. చివరికి ప్రధాని, కేంద్ర మంత్రులు కూడా కేసీఆర్ అవినీతికి పాల్పడినట్లుగా ఆరోపించారు. అయినా విచారణ ఎందుకు జరిపించడం లేదో..మీ మధ్య ఉన్న కుమ్మక్కు రాజకీయాలు ఏమిటో చెప్పాలన్నారు. బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి టీవీల ముందు పేపర్ పులుల్లా రంకలేయడం కాదు వీటన్నింటికి సమాధానం చెప్పాలన్నారు.
గురువిందగింజలా బండి తీరు..
చివరగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు రేవంత్‌రెడ్డి. బీజేపీ చీఫ్ వ్యవహారం చూస్తుంటే గురివిందగింజ సామెతను తలపిస్తోందన్నారు.బండి సంజయ్ వచ్చే ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్ పై పోటీ చేస్తారో లేదో చెప్పాలని ప్రశ్నించారు రేవంత్‌రెడ్డి. గతంలో అక్కడి నుండి పోటీ చేసిన బండి సంజయ్..ఇప్పుడు అక్కడ పోటీ చేయకపోతే...ప్రజలకకు బండి సంజయ్‌కి బీఆర్ఎస్‌కి మధ్య ఉన్న చీకటి ఒప్పందాన్ని ప్రజలు గుర్తిస్తారని మండిపడ్డారు.
ప్రజలే బుద్ది చెబుతారు..
బీజేపీ, బీఆర్ఎస్ రెండు పార్టీలను ప్రజలు నమ్మవద్దని .. రెండు ప్రభుత్వాలు ప్రజల్ని మోసం చేస్తున్నాయని విమర్శలు చేశారు రేవంత్‌రెడ్డి. రాబోయే ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Revanth Reddy, Telangana Politics