గత కొద్దిరోజులుగా తెలంగాణలో (Telangana politics) బాగా నానుతున్న పేరు మునుగోడు (Munugodu). కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (MLA Raja gopal reddy) రాజీనామా చేసి బీజేపీ (BJP)లో చేరడంతో రాజకీయా రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే రాజీనామాను స్పీకర్ ఆమోదించి కేంద్ర ఎన్నికల కమిషన్కు సమాచారం కూడా అందించారు. దీంతో ఉప ఎన్నిక (Munugodu By elections) అనివార్యం కానుంది. అయితే ఇక్కడ ఆయా పార్టీలు అభ్యర్థుల కోసం వెతుకులాటలు మొదలెడితే కొన్ని పార్టీలు మాత్రం అసలు పోటీ చేయాలా? వద్దా? లేదా అనే సందిగ్ధంలోనే ఉన్నాయి. అందులో మొదటిది సీపీఐ (CPI). మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై జాతీయ పార్టీ అయిన సీపీఐ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పార్టీ మహాసభలు పూర్తైన తర్వాత ఈ ఎన్నికల్లో పోటీ విషయమై నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని సీపీఐ నేతలు చెబుతున్నారు. మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని చండూరులో సీపీఐ నేతలు శుక్రవారం నాడు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పార్టీ మహాసభలతో పాటు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక విషయమై పార్టీ నేతలు చర్చించారు. అయితే ఇప్పటికే స్థానాల్లో ఇలా పరువు కోసం పోటీ పడి డిపాజిట్లు గల్లంతైన సందర్భాలు చాలానే ఉన్నాయి. అంతగా బలం లేని చోట పోటీ చేసి మళ్లీ డిపాజిట్లు పోగొట్టుకోవడం ఎందుకనే ఆలోచనలో సైతం నాయకులు ఉన్నట్లు సమాచారం.
ప్రాబల్యం తగ్గడంతో..
అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో మునుగోడు అసెంబ్లీ స్థానం నుండి సీపీఐ అభ్యర్ధులు పలుమార్లు విజయం సాధించారు. సీపీఐ లేదా కాంగ్రెస్ అభ్యర్ధులే ఈ స్థానం నుండి విజయం సాధించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేయడంతో ఈ స్థానంలో పోటీ విషయమై సీపీఐ నేతలు చర్చిస్తున్నారు. అయితే అప్పటిలా వామపక్షాల ప్రాబల్యం ఇప్పుడు లేదు. దీంతో ప్రజల్లోకి వాళ్లు అంత బలంగా వెళ్లడం లేదు. ఇపుడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే దుందుడుకుగా ఉన్నాయి.
అయితే మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేసే విషయమై సీపీఎంతో కూడా చర్చిస్తామని సీపీఐ నేతలు చెబుతున్నారు.ఈ నియోజకవర్గంలో సీపీఐ, సీపీఎంకు ఓటు బ్యాంకు ఉంది. అయితే ఈ స్థానంలో లెఫ్ట్ పార్టీలు వేర్వేరుగా పోటీ చేస్తాయా లేదా కలిసి పోటీ చేస్తాయా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. ఈ ఉప ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలు పోటీ చేస్తాయా లేదా ఏదైనా పార్టీకి మద్దతును ఇస్తాయా అనే విషయమై కూడా ఆ పార్టీలు నిర్ణయించుకోలేదు. ఈనియోజకవర్గంలో పోటీ చేయాలా వద్దా అనే విషయాన్ని పార్టీ మహాసభల తర్వాత ప్రకటించనున్నట్టుగా సీపీఐ నేత పల్లా వెంకట్ రెడ్డి ప్రకటించారు.
టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా..
మరోవైపు తెలంగాణలో టీడీపీ ఉనికి లేదనే సంగతి తెలిసిందే… సరైన నాయకత్వం లేక టీడీపీకి ఆదరణ లేకుండా పోయింది…ఇలాంటి తరుణంలో తెలంగాణలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకొచ్చేలా చంద్రబాబు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. కానీ ఇది అంత తేలికగా అయ్యే అంశం కాదు…కాకపోతే తమ శక్తి ఏ మేర ఉందో తెలుసుకోవడానికి…మునుగోడులో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టే ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
మునుగోడులో బీసీ వర్గం ఓట్లు ఎక్కువ…ఇప్పటికీ బీసీలకు టీడీపీపై అభిమానం ఉందని అనుకుంటున్నారు…అందుకే అక్కడ పోటీ చేయాలని టీడీపీ నేతలు భావిస్తున్నారట. దీనికి చంద్రబాబు కూడా ఒప్పుకున్నారని సమాచారం. టీడీపీ తరుపున బరిలో దిగేందుకు…టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి..మునుగోడు ఇంచార్జ్ జక్కలి ఐలయ్య యాదవ్ సిద్ధమవుతున్నారట. బీసీ వర్గానికి చెందిన ఐలయ్యకు…నియోజకవర్గంలో కాస్త పట్టు ఉందని తెలుస్తోంది. దీంతో ఆయన పోటీకి రెడీ అవుతున్నారట.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CPI, Munugode Bypoll, Munugodu By Election, Nalgonda, TDP, Telangana Politics