కొన్నేళ్ల నుంచి టీఆర్ఎస్ నాయకత్వంతో దూరంగా ఉంటూ వస్తున్న ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్.. మళ్లీ తిరిగి సొంత గూటికి చేరుకోనున్నారు. నేడు ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీతో డీఎస్ సమావేశమయ్యారు. రేపు ఏఐసీసీ కార్యాలయంలో డీఎస్ కాంగ్రెస్‌లో చేరనున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీకి రావాలని తెలంగాణ సిఎల్పీ నేత భట్టి విక్రమార్కకు ఫోన్ చేసినట్టు తెలుస్తోంది. భట్టి విక్రమార్కతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా రెండుసార్లు పని చేసిన డీఎస్.. దివంగత నేత వైఎస్ఆర్‌తో కలిసి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు తన వంతు కృషి చేశారు. ఇక కాంగ్రెస్ హైకమాండ్‌కు అత్యంత సన్నిహితుడిగా కొనసాగారు.
సోనియాగాంధీతో సమావేశమయ్యేందుకు ముఖ్యనేతలంతా ఎన్నో రోజులు నిరీక్షించిన తరుణంలోనూ.. డీఎస్ కొన్ని గంటల వ్యవధిలోనే ఆమెతో సమావేశమైన సందర్భాలు చాలా ఉన్నాయి. అయితే ఎమ్మెల్సీ సీటు విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ తనను పట్టించుకోలేదని అలిగిన డీఎస్.. కొన్నేళ్ల క్రితం కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. ఆయనను టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజ్యసభకు పంపించారు. అయితే ఆ తరువాత నిజామాబాద్ జిల్లాలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని టీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
బీజేపీలో ఉన్న తన కుమారుడు అరవింద్‌ను ప్రొత్సహిస్తున్నారని కొందరు టీఆర్ఎస్ నేతలు టీఆర్ఎస్ హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నిజామాబాద్ ఎంపీ పోటీ చేసిన డీఎస్ రెండో కుమారుడు అరవింద్.. కేసీఆర్ కూతురు కవితపై విజయం సాధించడం సంచలనం సృష్టించింది. అప్పటి నుంచి డీఎస్‌ను టీఆర్ఎస్ పూర్తిగా పక్కనపెట్టింది. ఆయన ఎంపీగా కొనసాగుతున్నప్పటికీ.. ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. కుమారుడు ధర్మపురి అరవింద్ బీజేపీ ఎంపీగా ఉండటంతో.. డీఎస్ కూడా బీజేపీలోకి వెళతారని వార్తలు వచ్చాయి. కానీ ఆయన మాత్రం ఆయన చేయలేదు.
BJP ఎఫెక్ట్.. నేతలకు పదవులు ఇచ్చే యోచనలో KCR.. వాళ్లకే మొదటి ప్రాధాన్యత
Telangana Congress: కాంగ్రెస్ పార్టీలో ఆ పార్టీ విలీనం.. ఫలించిన Revanth Reddy ప్లాన్..
రాజ్యసభ సభ్యుడిగా తన పదవీకాలం పూర్తయిన తరువాతే దీనిపై ఓ నిర్ణయం తీసుకోవాలని భావించిన డీఎస్.. మరికొన్ని నెలల్లోనే ఎంపీ తన పదవీకాలం పూర్తికానున్న నేపథ్యంలో.. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తరువాతే ఆయన కాంగ్రెస్‌లో చేరతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై డి.శ్రీనివాస్ సోనియాగాంధీతో చర్చించినట్టు సమాచారం. డీఎస్‌తో పాటు ఆయన పెద్ద కుమారుడు సంజయ్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: D Srinivas, Sonia Gandhi, Telangana