తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు చోట్ల అధికార పార్టీకి వ్యతిరేకంగానే ప్రజలు తీర్పు ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా తెలంగాణలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధిగా బరిలో నిలిచిన ఏవీఎన్ రెడ్డి విజయం సాధించారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్దిగా పోటీ చేసారు ఏవీఎన్ రెడ్డి. ఓట్ల లెక్కింపులో ఆయన ప్రత్యర్ది పీఆర్‌టీయు అభ్యర్ధిపై 1150 ఓట్ల తేడాతో పైచేయి సాధించారు. విజయాన్ని ఖరారు చేశారు అధికారులు. ఇక స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేసి ఒంటేరు ప్రతాప్‌రెడ్డి రెండో స్థానంలో నిలిచారు. తెలంగాణ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధి గెలుపుతో ఆ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో తమ బలం పెరిగిందని..రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సొంతం చేసుకుంటామని ధీమాగా చెబుతున్నారు.
బండి సంజయ్ అభినందనలు..
ఎమ్మెల్సీగా విజయం సాధించిన విద్యావేత్త ఏవీఎన్ రెడ్డిరకి శుభాకాంక్షలు తెలిపారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండిసంజయ్. ఆయన గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు తెలిపారు.రాష్ట్రంలో కొనసాగుతున్న అప్రజాస్వామిక పాలనపై ఉపాధ్యాయ మహాశయులు అద్భుతమైన తీర్పిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.
కేసీఆర్ సర్కారుకు చెంప పెట్టులాంటిది..
కేసీఆర్ సర్కారుకు ఉపాద్యాయులు చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చారని బీజేపీ రాజ్యసభ సభ్యులు , పార్లమెంటరీ బోర్డు సభ్యులు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన AVN రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు లక్ష్మణ్.ఉద్యోగులు, ఉపాధ్యాయుల పట్ల కేసీఆర్ నిరంకుశ వైఖరి విడనాడాలన్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ప్రజా సమస్యల పట్ల బీజేపీ పోరాటానికి మద్దతు లభించింది.
ఈటల హర్షం..
టీచర్ ఎమ్మెల్సీగా గెలిచిన AVN రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు ఈటల రాజేందర్. ఆయన గెలుపుపట్ల హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్‌పై వ్యతిరేకత ఉందనడానికి ఏవీఎన్ రెడ్డి గెలుపే ప్రత్యక్ష నిదర్శనమని ఈటల రాజేందర్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bjp, Mlc elections, Telangana Politics