ధాన్యం కొనుగోలు (Grain buy) అంశం రోజురోజుకీ జఠిలమవుతోందే తప్ప ఓ కొలిక్కి రావడం లేదు. కొనాలని టీఆర్ఎస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తుంటే కొనబోమని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ (TRS) రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నూకలు తినాలని తెలంగాణ ప్రజలను అవమానించిన పార్టీ తోకలు కత్తిరించాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రజలను కోరారు. ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేయాలని కోరుతూ ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద TRS ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించారు. సిరిసిల్లలో శుక్రవారం నిర్వహించిన ధర్నాలో కేటీఆర్ ( KTR )పాల్గొన్నారు.
తెలంగాణ ప్రజలను ఉద్దేశించి కేంద్ర మంత్రులు వెటకారం చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ఉప్పుడు బియ్యం ఎందుకు కొనరని ఆయన కేంద్రాన్ని ప్రశ్నించారు. విదేశాలకు బాయిల్డ్ రైస్ ను కేంద్రం ఎగుమతి చేస్తుందని తెలిపారు. ఈ విషయమై రాజ్యసభ (Rajyasabha )ను కూడా కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తప్పుదోవ పట్టించారని మండిపడ్డారు. ఈ విషయమై తమ పార్టీ ఎంపీలు ప్రివిలేజ్ మోషన్ నోటీసులు ఇచ్చారని కేటీఆర్ గుర్తు చేశారు.
కేంద్రంతో చెప్పి కొనుగోలు చేయిస్తామని..
రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు (Paddy Procurement) చేయవద్దని ప్రభుత్వం రైతులను కోరిందని మంత్రి కేటీఆర్ అన్నారు. కానీ బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ( Bandi Sanjay) మాత్రం వరి ధాన్యాన్ని కేంద్రంతో చెప్పి కొనుగోలు చేయిస్తామని రైతులను రెచ్చగొట్టి వరి ధాన్యం పండించేలా చేశారని మండిపడ్డారు మంత్రి. వరి ధాన్యం కేంద్రం కొనుగోలు చేస్తుందని బంండి సంజయ్ మూడు దఫాలు చెప్పాడని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ మేరకు బండి సంజయ్ మాట్లాడిన వీడియో క్లిప్పింగ్ లను కేటీఆర్ ఈ ధర్నాలో చూపారు.
ఆదాయం రెట్టింపు చేస్తామని..
తెలంగాణలో రైతులు రోడ్డెక్కడానికి కారణం ఎవరని కేటీఆర్ ప్రశ్నించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. రైతుల ఆదాయం రెట్టింపు అయిందా అని ఆయన రైతులను అడిగారు.
మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వీడియో..
కేంద్రం వరి ధాన్యం కొనుగోలు చేసే వరకు వెనక్కి తగ్గేదిలేదని మంత్రి కేటీఆర్ అన్నారు. రా రైస్, బాయిల్డ్ రైస్ కొంటామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పిన వీడియో క్లిప్పింగ్ లను కూడా మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా చూపారు. రాజ్యసభలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్పింగ్ ను కూడా ఈ సభలో కేటీఆర్ చూపించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Minister ktr, PADDY PROCUREMENT, Siricilla, Trs