TS POLITICS TELANGANA PCC CHIEF REVANTH REDDY TWEETED THAT KCR AND NARENDRA MODI ARE DARK FRIENDS SNR
Tcong | Bjp : మోదీ, కేసీఆర్ చీకటి స్నేహితులు .. అందుకే సభలో ప్రధాని ఆయన పేరు ప్రస్తావించలేదు : రేవంత్‌రెడ్డి
(Photo Credit:Twitter)
Tcong | Bjp : ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభలో టీఆర్ఎస్, కేసీఆర్ పేరు ప్రస్తావించకపోవడాన్ని తెలంగాణ కాంగ్రెస్ విమర్శిస్తోంది. కేసీఆర్, మోదీ చీకటి మిత్రులే అంటూ రేవంత్‌రెడ్డి ట్వీట్ చేయడాన్ని బీజేపీ శ్రేణులు తప్పుపడుతున్నారు. ప్రధాని కేసీఆర్, టీఆర్ఎస్ పేరే కాదు కాంగ్రెస్ పేరు కూడా ప్రస్తావించలేదు ఆ విషయం మర్చిపోకండి అంటూ చురకలంటిస్తున్నారు.
తెలంగాణలో బీజేపీ(BJP) బలపడుతోందన్న ఆశతో ఆ పార్టీ అధినాయకత్వం జాతీయ కార్యవర్గ సమావేశాలను హైదరాబాద్(Hyderabad)లో నిర్వహించింది. కమలనాథుల సమావేశాల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన విజయ సంకల్ప సభ వేదికపై ప్రధాని మోదీ(MODI) ప్రసంగానికి ప్రజల నుంచి వచ్చిన స్పందన ఆ పార్టీ శ్రేణుల్లో అమితానందాన్ని నింపింది. కాని మిగిలిన పార్టీలకు మాత్రం మింగుడు పడటం లేదని విమర్శిస్తున్నారు బీజేపీ నాయకులు. అందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్(Congress) నేతలు చేసిన ట్వీట్(Tweet)లను ఉదాహరణగా చూస్తున్నారు. సభావేదికపై ప్రసంగించిన మోదీ ఎక్కడా తెలంగాణ(Telangana)సీఎం కేసీఆర్ ఊసెత్తకపోవడాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి తప్పు పట్టారు.
టీపీసీసీ చీఫ్ కామెంట్స్ ..
తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రధాని నరేంద్రమోదీకి చీకటి మిత్రుడని ట్వీట్ ద్వారా ఆరోపించారు రేవంత్‌రెడ్డి. కేసీఆర్ పేరు ప్రస్తావించకుండా ఆయన కుటుంబ పాలన అవినీతి ఊసెత్తకుండా మోదీగారు పాటించిన మిత్రధర్మం చూశారుగా అంటూ సెటైర్ వేస్తూ ట్వీట్‌ని పోస్ట్ చేశారు. ఈ ట్వీట్‌తో పాటు మోదీ బీజేపీ, టీఆర్ఎస్ భాయి భాయి అంటూ హ్యాష్ ట్యాగ్‌ని పెట్టారు రేవంత్‌రెడ్డి. అంతే కాదు కేసీఆర్‌కు అధిష్టానం నరేంద్ర మోదీ అంటూ మోదీ ముఖాన్ని కేసీఆర్ ఫేస్ మాస్క్‌తో కవర్ చేస్తున్నట్లుగా ఉన్న ఫోటోని ట్యాగ్ చేశారు రేవంత్‌రెడ్డి.
రెండు పార్టీల పేర్లు ఊసెత్తలేదుగా..
ప్రధాని మోదీ కేసీఆర్ పేరును ప్రస్తావించకపోవడాన్ని ...ఆయన వేసిన ప్రశ్నలకు బదులివ్వకపోవడంపై టీఆర్ఎస్ కూడా ట్విట్టర్ ద్వారానే తమ వ్యతిరేకతను వ్యక్తం చేసింది. బీజేపీ నేతలు తమకు జవాబుదారీ తనం లేదని మరోసారి నిరూపించుకున్నారంటూ మంత్రి హరీష్‌రావు ట్వీట్లో పేర్కొన్నారు. ప్రధాని మోదీ ప్రసంగంలో రాజకీయాలకు తావులేకుండా మాట్లాడటం ... బీజేపీకి అధికారం కట్టబెడితే అన్నీ వర్గాల ప్రజలకు మేలు చేస్తామని చెప్పారు. మోదీ ప్రసంగంలో అధికార పార్టీ టీఆర్ఎస్, సీఎం కేసీఆర్ ప్రస్తావనే కాదు కాంగ్రెస్ పేరును కూడా ఉచ్చరించలేదని ఈవిషయాన్ని టీపీసీసీ చీఫ్ గమనించాలని బీజేపీ శ్రేణులు చురకలంటిస్తున్నారు.
ఓటమి భయం మొదలు..
ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా గెలిచేది బీజేపీనే అనే విషయం తెలంగాణ ప్రజలను చూస్తే అర్ధమవుతోందని ప్రధాని మోదీతో పాటు హోంమంత్రి అమిత్‌షా, నడ్డా వంటి అగ్రశ్రేణి నాయకులంతా ఒక్కమాటగా చెప్పారు.బీజేపీ నాయకులకు కలుగుతున్న కాన్ఫిడెన్స్ చూసి తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు గుబులు పుట్టిస్తుంటే ..ఇటు ప్రతిపక్ష కాంగ్రెస్‌లో కూడా అదే కలవరం మొదలైనట్లుగా ఉందంటున్నారు బీజేపీ శ్రేణులు. బీజేపీ ఒక్క బహిరంగసభకు ప్రజల నుంచి వచ్చిన రెస్పాన్స్ చూసే మిగిలిన పార్టీలకు ఒకరకమైన అభద్రతాభావం ఏర్పడిందంటున్నారు బీజేపీ నాయకులు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.