గవర్నర్ తమిళిసై లేఖపై స్పందించిన తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy) స్పందించారు. గవర్నర్ నుంచి ప్రభుత్వానికి లేఖ వచ్చిందని తెలిపారు. గవర్నర్‌ను కలవాలని ప్రభుత్వం తనను ఆదేశించిందని చెప్పారు. గవర్నర్‌ను కలిసి లేఖపై సందేహాలు నివృత్తి చేస్తామని అన్నారు. గవర్నర్ అపాయింట్మెంట్ కోరామని... అయితే అది ఇంకా ఖరారు కాలేదని తెలిపారు. గవర్నర్ తమిళిసై అపాయింట్మెంట్ ఇస్తే కలుస్తానని మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. మరోవైపు ఈ రోజు ఈ సాయంత్రం తెలంగాణ గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) మీడియా ముందుకు రాబోతున్నారు. అయితే ఆమె ఏం చెప్పబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది.
తెలంగాణ గవర్నర్‌కు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య విభేదాలు మరోసారి తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. యూనివర్సిటీల్లో ఖాళీల నియామకానికి ఉమ్మడి బోర్డును ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన బిల్లుపై గవర్నర్ తమిళిసై ఇటీవలే అభ్యంతరం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాత తెలంగాణ ప్రభుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఈ బిల్లుపై ఉన్న అభ్యంతరాలపై తనతో చర్చించాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు ఆమె వెల్లడించారు. రాజ్‌భవన్‌కు రావాలంటూ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించినట్లు వివరించారు. ఈ సమయంలో ప్రభుత్వ తీరుపై ఆమె ఆసహనం వ్యక్తం చేశారు. ఇదే అంశంపై యూనివర్సిటీల విద్యార్థీ జేఏసీ రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చింది. ఇటు ప్రధాని మోడీ తెలంగాణ పర్యటనను కూడా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ప్రెస్‌మీట్ ఏర్పాటు చేయడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా తన దగ్గరున్న పెండింగ్ బిల్లులు, కామన్ రిక్రూట్ మెంట్ బోర్డు బిల్లుపై కూడా ఆమె స్పష్టత ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
PM Modi| Telangana: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన.. మరోసారి టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ .. రచ్చ జరుగుతుందా ?
KCR-BJP: బీజేపీకి భిన్నమైన కేసీఆర్ ప్లాన్.. 2023 ఎన్నికల్లోనూ ఇదే వ్యూహమా ?
ప్రస్తుతం తెలంగాణలోని ఉభయ సభలు ఆమోదించిన అనేక బిల్లులు గవర్నర్ దగ్గర ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నాయి. వాటిలో తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు, ములుగులోని అటవీకళాశాల, పరిశోధానా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా అప్‌గ్రేడ్ చేసే బిల్లు, తెలంగాణ జీఎస్టీ సవరణ బిల్లు, ఆజమాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టెర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజెస్) సవరణ బిల్లు, తెలంగాణ మున్సిపల్ చట్టాల సవరణ బిల్లు, తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ (రెగ్యులేషన్ ఆఫ్ ఏజ్ ఆఫ్ సూపర్‌యాన్యూయేషన్) అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ మోటర్ వెహికల్స్ ట్యాక్సేషన్ అమెండ్మెంట్ బిల్లు, తెలంగాణ ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ బిల్లు ఉన్నాయి. ఇందులోని తెలంగాణ విశ్వవిద్యాలయాలకు ఉమ్మడి రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు అంశంపై చర్చించేందుకు విద్యాశాఖ మంత్రి రాజ్ భవన్‌కు రావాలని గవర్నర్ తెలంగాణ ప్రభుత్వానికి రాసిన లేఖలో సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Sabitha Indra Reddy, Telangana