రాజకీయాల్లో అధికారం వస్తుంది పోతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు అవుతారని, దిగిపోతారని వ్యాఖ్యానించారు. తమకు అధికారం పెద్ద లెక్క కాదని అన్నారు. బీజేపీపై ఆయన మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగిన సెస్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ ఘన విజయం సాధించిన సందర్భంగా వినియోగదారులు, రైతులతో ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభలో మంత్రి కేటీఆర్(KTR) పాల్గొన్నారు. సెస్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) డబ్బులు పంచారని ఆరోపించారు. గుజరాత్ పైసలు ఎన్ని వచ్చినా.. కేసీఆర్‌నే ముఖ్యమంత్రిని చేయాలని రాజన్న సిరిసిల్ల (Siricilla) జిల్లా స్పష్టం చేసిందని అన్నారు. ఇక్కడ సెస్‌లో గెలువలేనోడు రాష్ట్రంలో గెలుస్తారా ? అంటూ వ్యాఖ్యానించారు. సెస్ ఎన్నికలు ట్రైలరే అని.. 2023లో అసలు సినిమా చూపిస్తామని అన్నారు.
తెలంగాణలో బీజేపీని నడిపేవాళ్లు మూర్ఖులని కేసీఆర్ ధ్వజమెత్తారు. వారికి మెదడు ఎక్కడుందని ఎద్దేవా చేశారు. దమ్ముంటే తమకంటే ఎక్కువగా మంచి పనులు చేసి ప్రజల మనసులను గెలవాలని హితవు పలికారు. రాజన్న సిరిసిల్ల జిల్ల అభివృద్ధిలో దేశం మొత్తంలోనే ఆదర్శంగా నిలిచిందని కేటీఆర్ అన్నారు. పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యుత్‌ను సరఫరా చేయాలని, సిరిసిల్ల జిల్లా సెస్ పరిధిలో ప్రత్యేక విద్యుత్ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీపై మరోసారి తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎవరికి దేవుడని ప్రశ్నించారు. పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచినోడని, నల్లచట్టాలు తెచ్చి రైతులను చంపినోడు దేవుడు ఎలా అవుతారని అన్నారు.
డీజిల్, పెట్రోల్ ధరలు పెంచుతూ.. ఆర్టీసీ ధరలు పెంచొద్దంటారని విమర్శించారు. అదే జరిగితే బస్సులు ఎలా నడుపమంటారని ప్రశ్నించారు. కేంద్ర ధరలు పెంచడంలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయని స్పష్టం చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు గొడవ నడుస్తుందన్న కేటీఆర్.. ఆ రెండు రాష్ట్రాల్లో ఉన్నది బీజేపీ ప్రభుత్వాలే అని అన్నారు. రాష్ట్రాల మధ్య గొడవ పరిష్కరించని నరేంద్ర మోదీ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఆపారా ? అని ఎద్దేవా చేశారు. 14 మంది ప్రధానులు చేసిన అప్పు.. మోదీ ఒక్కరే చేశారని విమర్శించారు. కిషన్‌రెడ్డి కరోనా సమయంలో కుర్‌కురే ప్యాకెట్లు పంచారని ఆరోపించారు.
ఫ్లాష్..ఫ్లాష్: తెలంగాణ సీఎస్ పై రేవంత్ రెడ్డి సంచలన కామెంట్స్..వీడియో
PM Modi: తెలంగాణలో ప్రధాని మోదీ పోటీ.. ఆ నియోజకవర్గం ఇదేనా..?
రాష్ట్రం నుంచి కేంద్రానికి రూ.1.68లక్షల కోట్లు వెళ్లాయని, కేంద్రం తెలంగాణకు రూ.2లక్షల కోట్లు ఇచ్చిందని మరోసారి స్పష్టం చేశారు. తాను చెప్పింది తప్పని నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. గుజరాత్ వాళ్లు వస్తే చెప్పులు మోయడానికి పని చేస్తారని, నాలుగేళ్లలో కరీంనగర్‌కు ఎంపీగా ఉండి బండి సంజయ్ ఏం చేశాడో చెప్పాలని డిమాండ్ చేశారు. ట్రిపుల్ ఐటీ, నవోదయ పాఠశాలలు తీసుకొచ్చారా ? అని ప్రశ్నించారు. వేములవాడ రాజన్న ఆలయానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారని నిలదీశారు. ఈ సారి కరీంనగర్ పార్లమెంట్‌పై గులాబీ జెండాను ఎగురవేద్దామని కేటీఆర్ పిలుపునిచ్చారు. సిరిసిల్ల నుంచి విజయయాత్ర ప్రారంభించి కరీంనగర్‌లో గులాబీ జెండా ఎగురవేద్దామని సూచించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.