శాంతి భద్రతల (Law and Order) విషయంలో తెలంగాణ ప్రభుత్వం రాజీలేని విధానాన్ని అవలంభిస్తోందని హోం మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ (Mahamood Ali) పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనోభావాలను, విశ్వాసాలను దెబ్బతీసేవిధంగా మాట్లాడి తద్వారా అశాంతిని సృష్టించాలనుకునే వారిని తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) సహించదని, చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరిస్తుందని హోం మంత్రి తెలిపారు. మొహ్మద్ ప్రవక్త పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసారని MLA రాజా సింగ్ (MLA Raja Singh) పై హైదరాబాద్ మరియు తెలంగాణ రాష్ట్రంలో పలు పోలీస్ స్టేషన్స్ లో ఫిర్యాదులు వచ్చాయని హోం మంత్రి అన్నారు. ఇట్టి ఫిర్యాదులపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. చట్టానికి, జాతి, మత, కుల, వర్గ ఇతర భేదాలు ఉండవని... చట్టానికి ఎవ్వరూ అతీతులు కారని, చట్టం తన పని తాను చేస్తుందని, హోం మంత్రి పేర్కొన్నారు. రాజా సింగ్ ను పోలీసులు మంగళవారం నాడు అరెస్ట్ చేశారని మహమ్మద్ మహమూద్ అలీ గుర్తు చేశారు.
ప్రజలు వారి వారి మతాలకు, కులాలకు, ఆచారాలకు, సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా జీవించే హక్కు ఉందన్నారు. ఎవరూ తమ మతానికి వ్యతిరేకంగా ఎలాంటి అవాస్తవాలను, తక్కువ చేసి మాట్లాడడం వంటివి సహించరన్నారు. ఇతర మత విశ్వాసాలను మరియు ఆయా మత గురువులను ఉద్దేశించి కించపరచే లేదా తక్కువ చేసే విధంగా ఏమతం వారు అయినా మాట్లాడరాదన్నారు. వారి మనోభావాలను కించపరచే విధంగా మెలగరాదని, హోం మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. చట్టం నుంచి ఎంతటి వారైనా తప్పించుకోలేరన్నారు. తెలంగాణ ప్రజలు గంగా-జమున తెహజీబ్ (సంస్కృతికి) ప్రతీకగా ఉన్నారని....ఎవ్వరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని, ప్రజలు అందరూ సంయమనంతో, సోదరభావంతో ఉండాలని హోం మంత్రి విజ్ఞప్తి చేశారు.
Telangana| BJP: రాజాసింగ్ పదవి దక్కేది ఎవరికి ? బీజేపీలో కొత్త చర్చ.. ఆ నేతకు ఛాన్స్ ఇస్తారా ?
ఇదిలా ఉంటే.. ఈ నెల 31 నుండి సెప్టెంబరు 9 వ తేదీ వరకు నిర్వహించే గణేష్ నవరాత్రి వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లను చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. బుధవారం ఖైరతాబాద్ వినాయక మండపం వద్ద వివిధ శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎంతో ప్రసిద్ధి చెందిన ఇక్కడ ప్రతిష్టించే గణనాధుడిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి లక్షలాది మంది వస్తారని అన్నారు. దానిని దృష్టిలో ఉంచుకొని పటిష్టమైన భారీకేడ్ లను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.
వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పారు. నవరాత్రులు ముగిసే వరకు వాహనాల రాకపోకలను నిలిపివేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. విద్యుత్ సరఫరా లో అంతరాయం ఏర్పడకుండా జనరేటర్ లను అందుబాటులో ఉంచనున్నట్లు చెప్పారు. తాత్కాలిక టాయిలెట్స్ లను కూడా అందుబాటులో ఏర్పాటు చేయాలని GHMC అధికారులను ఆదేశించారు. ఈ పరిసర ప్రాంత ప్రజల ఇబ్బందుల దృష్ట్యా మండపం వెనుక రోడ్డులో వారం రోజులలో నూతన రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.