హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC Strike | కేసీఆర్‌కు షాక్... కార్మికులతో చర్చలు జరపాల్సిందే.. హైకోర్టు ఆదేశం

TSRTC Strike | కేసీఆర్‌కు షాక్... కార్మికులతో చర్చలు జరపాల్సిందే.. హైకోర్టు ఆదేశం

    14 రోజులుగా సమ్మె చేస్తున్న ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ కార్పొరేషన్‌ను ఆదేశించింది. తెలంగాణ సమ్మె మీద హైకోర్టులో వాదనలు జరిగాయి. అయితే, ప్రభుత్వం వైఖరిని కోర్టు తప్పుపట్టింది. శనివారం ఉదయం 10.30 గంటలకు ఆర్టీసీ యూనియన్లతో చర్చలు జరపాలని ఆర్టీసీ యాజమాన్యాన్ని కోర్టు ఆదేశించింది. ఆర్టీసీ యాజమాన్యంతో తాము చర్చలకు సిద్ధమేనని యూనియన్లు కోర్టుకు తెలిపాయి. దీంతో వారితో చర్చలు జరపాల్సిందేనని యాజమాన్యానికి కోర్టు స్పష్టం చేసింది. మూడు రోజుల్లోగా చర్చలు పూర్తి చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని సీఎం కేసీఆర్ భీష్మించారు. ఈ నేపథ్యంలో కచ్చితంగా చర్చలు జరపాల్సిందే అని హైకోర్టు ఆదేశించడం ప్రభుత్వానికి ఇబ్బందే. అయితే, ప్రభుత్వం తరఫున ఎవరు ప్రతినిధిగా వెళతారనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఆర్టీసీకి ఎండీ లేరు. ఎండీ ఉంటే కార్పొరేషన్ తరఫున ప్రతినిధిగా ఎండీ మాట్లాడేవారు. అయితే, ఇప్పుడు ఎండీ ఎవరూ లేకపోవడంతో రవాణా శాఖ కార్యదర్శి సునీల్ శర్మ ఆర్టీసీ బాధ్యతలను కూడా నిర్వహిస్తున్నారు. దీంతో సునీల్ శర్మనే ప్రభుత్వం ఆర్టీసీ యాజమాన్యం తరఫున కార్మికులతో చర్చలకు పంపుతుందా? లేకపోతే ఎవరినైనా కొత్త ఎండీని నియమించి వారిని చర్చలకు పంపుతుందా? రేపు ఉదయం 10.30గంటలకు కార్మికులతో చర్చించేది ఎవరనే ప్రశ్న ఆసక్తికరంగా మారింది.

    First published:

    Tags: CM KCR, Rtc jac, Telangana, Telangana High Court, Tsrtc, TSRTC Strike

    ఉత్తమ కథలు