తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగం ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ తరపున లాయర్ దుష్యంత్ దవే హైకోర్టుకు తెలిపారు. గవర్నర్ ప్రసంగంతోనే సమావేశాలు ప్రారంభమవుతాయని కోర్టుకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో హైకోర్టులో (High Court) లంచ్ మోహన్‌ను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఈ సందర్భంగా గవర్నర్‌ను విమర్శించవద్దనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళతానని హైకోర్టులో ప్రభుత్వం తరపు లాయర్ దుష్యంత్ దవే తెలిపారు. అంతముందు ఈ అంశంపై హైకోర్టు విచారణ వాయిదా వేసిన అనంతరం అడ్వకేట్ జనరల్ ఛాంబర్‌లో ప్రభుత్వం తరపున లాయర్ దుష్యంత్ దవే.. గవర్నర్ తరపున లాయర్ అశోక్ రాంపాల్ సుమారు గంటపాటు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గవర్నర్ విషయంలో పలువురు నేతలు చేసిన విమర్శలు, ప్రభుత్వం వ్యవహరించిన తీరును చర్చించారు. దీంతో ఇకపై అలా జరగదని ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే(Dushyant Dave) తెలిపారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ ప్రసంగం ఉంటుందని కోర్టుకు ప్రభుత్వం అఫిడవిట్ సమర్పించినట్టు తెలుస్తోంది. ఇరువర్గాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు జరపడంతో.. లంచ్ మోషన్ పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రభుత్వం తరపున న్యాయవాది దుష్యంత్ దవే కోర్టుకు వివరించారు.
అంతకుముందు గవర్నర్ చర్యలపై ప్రభుత్వం ఏకంగా హైకోర్టును(High Court) ఆశ్రయించడంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. రాష్ట్ర బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేందుకు గవర్నర్ నుంచి అనుమతి రాకపోవడమే సర్కారు నిర్ణయానికి కారణమైంది. రాష్ట్ర శాసనసభ సమావేశాలు మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానుండగా.. ఫిబ్రవరి 3న బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రాష్ట్ర గవర్నర్ ఆమోదం తెలపాల్సి ఉన్నందున.. అనుమతి కోరుతూ ఈ నెల 21నే గవర్నర్‌కు లేఖ పంపింది. అయితే గవర్నర్ తమిళిసై మాత్రం ఇప్పటికీ అనుమతి తెలపలేదు. గవర్నర్ కార్యాలయం నుంచి ప్రభుత్వానికి ఒక రిటర్న్ కమ్యూనికేషన్ వెళ్లింది.
బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టేముందు గవర్నర్ ప్రసంగం ఉంటుందని, అందుకు సంబంధించిన కాపీ తమకు పంపారా? లేదా? అని గవర్నర్ కార్యాలయం సర్కారును కోరింది. దీనిపై ప్రభుత్వం స్పందించలేదు. దాంతో గవర్నర్ కూడా అనుమతి విషయంలో నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు ఫిబ్రవరి 3 సమీపిస్తుండటంతో సర్కారు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. చివరికి న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు సోమవారం లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీంకోర్టు(Supreme court) సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవేను అందుకోసం రంగంలోకి దించింది.
Telangana Budget : తెలంగాణ బడ్జెట్‌పై హైకోర్టు స్పందన .. ఏమందంటే..
నేడు మనోహరాబాద్‌కు కేటీఆర్ .. ఐటీసీ పరిశ్రమ ప్రారంభించనున్న మంత్రి..!
అయితే ఈ పిటిషన్‌పై విచారణకు ముందు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో గవర్నర్‌కు కోర్టు నోటీసు ఇవ్వవచ్చా ? అని వ్యాఖ్యానించింది. గవర్నర్ విధుల్లో కోర్టులు న్యాయసమీక్ష చేయొచ్చా? అని పేర్కొంది. కోర్టులు మితిమీరి జోక్యం చేసుకుంటున్నాయని గతంలో చాలాసార్లు మీరే అంటారని అడ్వకేట్ జనరల్‌ను ఉద్దేశించి ఉన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. అయితే మధ్యాహ్నం ఇటు ప్రభుత్వం తరపు న్యాయవాది, అటు గవర్నర్ తరపున న్యాయవాది మధ్య చర్చలు జరగడం.. ప్రభుత్వం ఈ విషయంలో కాస్త వెనక్కి తగ్గడంతో వివాదం ముగిసినట్టయ్యింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.