తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఇటీవల రాహుల్ గాంధీ సమావేశమైన సంగతి తెలిసిందే. నేతలు విభేదాలను పక్కనపెట్టి ఐక్యంగా ముందుకు సాగాలని ఆ సమావేశంలో నేతలకు రాహుల్ గాంధీ సూచించారు. ఇక తెలంగాణలోని కాంగ్రెస్(Telangana Congress) నేతలు పరస్పరం విభేదాలు సృష్టించుకుని పార్టీకి నష్టం కలిగిస్తే ఏ మాత్రం సహించబోనని వార్నింగ్ ఇచ్చారు. ఈ సమావేశంలో దాదాపు 40 నేతలు పాల్గొనగా.. కొందరు నేతలు మాత్రం రాహుల్ గాంధీతో విడిగా సమావేశం కావాలని భావించారు. ఇందుకోసం చాలా ప్రయత్నించారు. కానీ రాహుల్ గాంధీకి వాళ్లెవరికీ ఆ ఛాన్స్ ఇవ్వలేదు. అయితే రాహుల్ గాంధీతో సమావేశం అయ్యేందుకు రెండు రోజుల నుంచి ఢిల్లీలోనే ఉన్న జగ్గారెడ్డి.. ఎట్టకేలకు కాంగ్రెస్ ముఖ్యనేతతో సమావేశం అయ్యారు. కుటుంబసభ్యులతో కలిసి రాహుల్ గాంధీని(Rahul Gandhi) ప్రత్యేకంగా కలుసుకున్నారు జగ్గారెడ్డి.
తెలంగాణ కాంగ్రెస్‌లో తన పట్ల జరుగుతున్న ప్రచారాన్ని రాహుల్ గాంధీకి జగ్గారెడ్డి (Jagga reddy) వివరించబోతున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్‌లోని కొందరు నాయకులు తనను సోషల్ మీడియాలో వేదికగా అప్రతిష్టపాలు చేస్తున్నారని.. తనను టీఆర్ఎస్కు కోవర్టు అని ప్రచారం చేస్తున్నారని జగ్గారెడ్డి చాలాకాలం నుంచి ఆరోపిస్తున్నారు. రేవంత్ రెడ్డి అనుచరులు, అభిమానులే ఈ పనికి పాల్పడుతున్నట్టు ఆయన బహిరంగంగా కూడా వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డితోనే తనకు ఇబ్బంది అని.. కాంగ్రెస్ పార్టీతో, పార్టీ నాయకత్వంతో తనకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీతో జరిగిన భేటీలోనే జగ్గారెడ్డి ఈ విషయాన్నే ఆయనకు వివరించబోతున్నట్టు తెలుస్తోంది. గతంలో జగ్గారెడ్డికి తెలంగాణ కాంగ్రెస్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవితో పాటు పలు ఇతర బాధ్యతలు కూడా ఉండేవి. అయితే ఇటీవల చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో.. టీపీసీసీ ఆయనను ఈ పదవి, బాధ్యతల నుంచి తొలగించింది. తాజాగా ఆయన మరోసారి తనకు ఆ పదవులు ఇవ్వాలని రాహుల్ గాంధీని కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
అలా జరిగితే.. మళ్లీ తాను పార్టీలో కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంటుందని రాహుల్ గాంధీకి చెప్పొచ్చని తెలుస్తోంది. అయితే సంగారెడ్డిలో భారీ సభ ఏర్పాటు చేసి రాహుల్ గాంధీని ఆహ్వానించే యోచనలో జగ్గారెడ్డి ఉన్నారని.. రాహుల్‌ను జగ్గారెడ్డి కలవడం వెనుక ఇది కూడా ఓ కారణమనే చర్చ సాగుతోంది. మొత్తానికి తాను అనుకున్నట్టుగానే రాహుల్ గాంధీతో ప్రత్యేకంగా సమావేశమైన జగ్గారెడ్డి.. కాంగ్రెస్ ముఖ్యనేత దృష్టికి ఏయే అంశాలు తీసుకెళతారు ? జగ్గారెడ్డి విజ్ఞప్తికి రాహుల్ గాంధీ సానుకూలంగా స్పందిస్తారా ? అన్నది ఆసక్తికరంగా మారింది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.