కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకుడు, ఎంపీ రాహుల్‌గాంధీ (Rahul Gandhi)పై అనర్హత వేటు వేయడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ (Congress )శ్రేణులు దేశ వ్యాప్తంగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్(Hyderabad) గాంధీ భవన్‌లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, సీనియర్ నాయకులు ప్రజాస్వామ్య పరిరక్షణ దీక్ష చేపట్టారు. టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈకార్యక్రమంలో పార్టీ సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు పాల్గొన్నారు. ఈసందర్భంగా బీజేపీ(BJP) ప్రభుత్వం రాహుల్‌గాంధీని ఎదుర్కొనే సత్తా లేకనే కుట్ర పూరితంగా అనర్హత వేటు వేసిందని విమర్శలు చేశారు. ఇవాళ అనర్హుడిగా ముద్రవేసిన వ్యక్తే రేపు కాబోయే ప్రధాని అంటూ స్లోగన్స్‌తో కూడిన నినాదాలు చేశారు. రాహుల్‌గాంధీకి సంపూర్ణ మద్దతిస్తూ తాము కూడా రాజీనామాలు చేయడానికి వెనుకాడబోమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు స్పష్టం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ఆదేశిస్తే తమ పదవులకు రాజీనామాలు రాహుల్‌గాంధీకి కొండంత అండగా ఉంటామని ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అందరి అభ్యున్నతి కోసం పని చేస్తుంది..ఐకమత్యంతో అందరం ఒకటిగా పోరాడతామని స్పష్టం చేశారు.
రాజీనామాలకు రెడీ..
రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని కాంగ్రెస్ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇదంతా బీజేపీ సర్కారు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా చేస్తున్న చర్యలుగా అభివర్ణించారు. దేశ స్వాతంత్రం కోసం రాహుల్‌గాంధీ తాత జైలుకు వెళ్లారని ..రాహుల్‌గాంధీ అనర్హతవేటును నిరసిస్తూ చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రకటిస్తామని రేవంత్‌రెడ్డి తెలిపారు. గాంధీభవన్‌లో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణ ధర్నాలో పాల్గొన్న నేతలతో పాటు అందరూ బీజేపీ ప్రభుత్వాన్ని పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ ప్రశ్నిస్తున్నారనే అక్కసుతోనే అనర్హత వేటు వేశారని..ఆయన్ని ఎదుర్కొనే దమ్ము లేదని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ప్రధాని అయ్యే అర్హతలున్న వ్యక్తి..
మరో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడం కంటతడి పెట్టించిందన్నారు. దేశానికి ప్రధాని కావాల్సిన అర్హతలున్న వ్యక్తిని పార్లమెంట్ సభ్యుడిగా అనర్హత వేటు వేయడం జరిగిందన్నారు. ఆయనపై విధించిన అనర్హత వేటు ఎత్తివేసే వరకూ ఎంపీలంతా రాజీనామాలు చేసి పోరాటం చేస్తామన్నారు. ఈదీక్షలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డితో పాటు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే పాల్గొన్నారు.
ఎదుర్కొనే సత్తాలేకే వేటు..
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి రాహుల్‌గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని, సూరత్ కోర్టు ద్వారా శిక్షపడేలా చేయడం చూస్తుంటే గాంధీ కుటుంబం మీద మోదీ ఎంత కక్ష పెంచుకున్నారో అర్ధమవుతుందన్నారు. ఇంతటి చిల్లర వ్యవహారం ఏ పార్టీ చేయలేదన్నారు. పార్లమెంట్‌లో రాహుల్‌గాంధీ మాటలను బీజేపీ తట్టుకోలేక..సమాధానం చెప్పలేకే ఇంతటి చర్యలకు పూనుకుందన్నారు. పార్లమెంట్‌లో ఉన్నా..బయట ఉన్నా గాంధీ ఫ్యామిలీకి విలువ ఉందన్నారు. రాజకీయ విలువలున్న అద్వానీని ప్రధాని కాకుండా మోదీ అడ్డుకున్నారని ఆరోపణలు చేశారు జగ్గారెడ్డి. రాహుల్‌గాంధీకి తామంతా అండగా నిలబడతామని స్పష్టం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Rahul Gandhi, Telangana Politics, TS Congress