హోమ్ /వార్తలు /తెలంగాణ /

Munugode Congress: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం.. అందుకే ఆ కీలక నిర్ణయం?

Munugode Congress: మునుగోడులో కాంగ్రెస్ పార్టీ కొత్త వ్యూహం.. అందుకే ఆ కీలక నిర్ణయం?

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ (ఫైల్ ఫోటో)

మునుగోడు ఉప ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ తన వ్యూహాన్ని మార్చింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక మిగిల్చిన పాఠంతో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) మునుగోడు ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఈ ఉప ఎన్నిక (Munugode By Election) చుట్టే తిరుగుతున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ మునుగోడుపైనే ఫుల్ ఫోకస్ పెంచాయి. ఎలాగైనా ఇక్కడ విజయం సాధించి.. వచ్చే ఎన్నికల్లోనూ రాష్ట్రంలో అధికారం తమదేనని నిరూపించుకోవడానికి ఆయా పార్టీలు సర్వశక్తులను ఒడ్డుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాషాయ కండువా కప్పుకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajgopal Reddy) బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడం ఖాయమే. అయితే.. తాజాగా కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతిని ఖరారు చేసింది. ఈ మేరకు ఏఐసీసీ సైతం అధికారంగా ప్రకటన విడుదల చేసింది. అయితే.. రాజగోపాల్ రెడ్డి ఆర్థిక బలాన్ని తట్టుకునేలా వ్యాపారవేత్త చల్లమల కృష్ణారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వనుందన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా సాగింది.

రాజగోపాల్ రెడ్డి రాజీనామా తర్వాత కృష్ణారెడ్డి సైతం నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు. తానే అభ్యర్థి అన్న సంకేతాలను సైతం ఇచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం ఆయనకు ప్రాధాన్యం ఇవ్వడంతో కృష్ణారెడ్డి అభ్యర్థి అంటూ అంతా భావించారు. కృష్ణా రెడ్డితో పాటు బీసీ నేత కైలాష్ సైతం కాంగ్రెస్ నుంచి ఇక్కడ టికెట్ ఆశించారు. అయితే.. ఈ ఊహాగానాలకు తెర దించుతూ కాంగ్రెస్ పార్టీ పాల్వాయి స్రవంతిని తమ అభ్యర్థిగా ప్రకటించింది. దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నికల సీన్ రిపీట్ అవుతుందన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ స్రవంతిని తన అభ్యర్థిగా ప్రకటించినట్లు తెలుస్తోంది.

KCR: కేసీఆర్ నయా ప్లాన్.. పొలిటికల్‌గా డబుల్ రిస్క్ చేస్తున్నారా ?.. అక్కడ తేడా వస్తే..

దుబ్బాక ఉప ఎన్నికల సమయంలోనూ.. అప్పటి వరకు నియోజకవర్గంలో పని చేసిన నేతలను పక్కనబెట్టి ఆఖరి నిమిషంలో టీఆర్ఎస్ నుంచి వచ్చిన చెరుకు శ్రీనివాస్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. దీంతో హోరాహోరీగా జరిగిన దుబ్బాక ఉప ఎన్నిక పోరులో ఆయన మూడో స్థానానికే పరిమితం అయ్యారు. డిపాజిట్ కూడా కోల్పోయి పార్టీకి అప్రదిష్టను మిగిల్చారు. కొత్త అభ్యర్థి కావడంతో ఈ పరిస్థితి తలెత్తిందన్న వాదన అక్కడి శ్రేణుల నుంచి వ్యక్తం అయ్యింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలోనూ విద్యార్థి నేతగా ఉన్న బల్మూర్ వెంకట్ ను బరిలోకి దించింది కాంగ్రెస్ అధిష్టానం.

బీజేపీ , టీఆర్ఎస్ పార్టీ మధ్య నువ్వా-నేనా అంటూ సాగిన ఈ ఉప పోరులో నియోజకవర్గానికి కొత్త, స్థానికంగా పెద్దగా పరిచయాలు లేని బల్మూరి వెంకట్ కేవలం 2 వేల ఓట్లు సాధించి కాంగ్రెస్ కు ఘోర పరాభవాన్ని మిగిల్చారు. ఈ పాఠాలతో కొత్త అభ్యర్థులను పోటీకి దించాలన్న ప్రయోగాన్ని కాంగ్రెస్ పార్టీ పక్కకు పెట్టినట్లు సమాచారం. దీంతో మునుగోడుకు దాదాపు ఐదు సార్లు ప్రాతినిధ్యం వహించిన పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతిని బరిలోకి దించింది.

ఆమె గతంలో పొత్తుల నేపథ్యంలో టికెట్ దక్కకపోవడంతో ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. 2018లో టికెట్ దక్కకున్నా పార్టీ మారకుండా కాంగ్రెస్ లోనే కొనసాగారు. దీంతో కొత్త అభ్యర్థి జోలికి పోకుండా ఆమెకే టికెట్ కేటాయించింది కాంగ్రెస్ హైకమాండ్. స్రవంతి కుటుంబానికి ఉన్న ఇమేజ్ తమకు కలిసి వస్తుందని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. అయితే.. ఈ వ్యూహం కాంగ్రెస్ పార్టీకి ఎంత మేరకు కలిసివస్తుందనేది తెలియాలంటే ఉప ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

First published:

Tags: Congress, Komatireddy rajagopal reddy, Munugode Bypoll

ఉత్తమ కథలు