తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరి వైపు నిలుస్తారన్నది ఇంకా తేలలేదు. దీనిపై కేసీఆర్ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పేరును ప్రకటించిన విపక్షాలు.. ఆయనకు అనేక విపక్షాల మద్దతు ఉందని తెలిపాయి. తాజాగా యశ్వంత్ సిన్హాకు(Yashwant Sinha) 20కి పైగా పార్టీలు మద్దతు ఇస్తున్నాయన్న శరద్ పవార్.. ఈ అంశంపై తాను తెలంగాణ సీఎం కేసీఆర్‌తో మాట్లాడానని తెలిపారు. కేసీఆర్ రాష్ట్రపతి ఎన్నికల్లో(President Elections) విపక్షాల అభ్యర్థిగా బరిలోకి దిగనున్న యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తానని తనతో చెప్పారని శరద్ పవార్(Sharad Pawar) చెప్పుకొచ్చారు.
బీజేపీకి వ్యతిరేకించే విపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా రాష్ట్రపతి అభ్యర్థిని బరిలోకి దింపాలని భావించాయి. ఇందుకోసం ఆ పార్టీలన్నీ కేంద్ర ఆర్థిక శాఖ మాజీమంత్రి యశ్వంత్ సిన్హాను ఎంపిక చేశాయి. దీనిపై విపక్షాలన్నీ కలిసి అధికారికంగా ప్రకటన చేశాయి. విపక్షాలన్నీ కలిసి రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాను బరిలోకి దింపాలని నిర్ణయించినట్టు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రకటించారు. అంతకుముందు అభ్యర్థి ఎంపిక కోసం జరిగిన సమావేశంలో శరద్ పవార్ సహా పలువురు ఇతర విపక్ష నేతలు పాల్గొన్నారు. అభ్యర్థి ఎంపికపై సుదీర్ఘంగా చర్చించిన విపక్షాలు.. అంతా అనుకున్నట్టుగానే చివరకు యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశాయి. విపక్షాలు ముందుగా తమ రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీమంత్రి శరద్ పవార్‌ను రంగంలోకి దింపాలని భావించాయి.
కానీ ఆయన ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. దీంతో బెంగాల్ మాజీ గవర్నర్ గోపాలకృష్ణ గాంధీని బరిలోకి దింపాలని పార్టీలు యోచించాయి. కానీ ఈ అభ్యర్థి ఎంపికకు ఒక రోజు ముందే ఆయన తాను రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయబోనని ప్రకటించి విపక్షాలకు షాక్ ఇచ్చారు. దీంతో ఈ ఎన్నికల్లో ఎవరిని పోటీలో దింపాలనే దానిపై విపక్షాలల్లో చర్చ మొదలైంది. చివరకు కేంద్ర మాజీమంత్రి యశ్వంత్ సిన్హా పేరు తెరపైకి రావడం.. ఆయన విపక్షాలన్నింటికీ ఆమోదయోగ్యమైన అభ్యర్థి అవుతారని భావించడంతో.. ఆయన అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడంపై ప్రతిపక్షాలు చర్చించాయి. చివరకు రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా బరిలో ఉంటారని ప్రకటించాయి.
సోషలిస్ట్ జనతా పార్టీ అనుభవజ్ఞుడైన జయ ప్రకాష్ నారాయణ్ స్ఫూర్తితో యశ్వంత్ సిన్హా 1984లో రాజకీయాల్లోకి వచ్చారు. అంతకుముందు ఐఏఎస్ అధికారిగా సుదీర్ఘకాలం విధులు నిర్వహించారు. 1988లో రాజ్యసభ ఎన్నికల్లో విజయం సాధించారు. 1989లో జనతాదళ్‌లో చేరి, 1990 నుంచి 1991 వరకు దివంగత ప్రధాని చంద్రశేఖర్ స్వల్పకాల పరిపాలనలో ఆర్థిక మంత్రిగా పనిచేశారు. 1992లో తన రాజకీయ అనుబంధాన్ని బీజేపీకి మార్చుకున్నారు. 1996లో పార్టీ జాతీయ అధికార ప్రతినిధిగా ఎదిగారు. 1998లో జార్ఖండ్‌లోని హజారీబాగ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల్లో విజయవంతంగా పోటీ చేసి విజయం సాధించి వాజ్‌పేయి క్యాబినెట్లో ఆర్థిక మంత్రి అయ్యారు. 2002 నుండి 2004 వరకు విదేశాంగ మంత్రిగా నియమితులయ్యారు.
2004లో తన లోక్‌సభ సీటును కోల్పోయిన యశ్వంత్ సిన్హా.. ఆ ఏడాది చివర్లో రాజ్యసభ సీటును గెలుచుకుని తిరిగి పార్లమెంటులోకి ప్రవేశించారు. 2009లో మరోసారి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. అయితే 2012లో పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఆ తరువాత క్రమంగా బీజేపీకి దూరమవుతూ వచ్చారు. చివరకు 2018లో బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆ తరువాత బెంగాల్‌లోని మమత బెనర్జీ సారథ్యంలోని తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.