తెలంగాణ రాజకీయాలు.. అందులోనూ టీఆర్ఎస్ రాజకీయాల్లో ప్రకాశ్ రాజ్ పేరు కొంతకాలంగా బాగా వినిపిస్తోంది. ఆ మధ్య సీఎం కేసీఆర్ కలిసి ప్రకాశ్ రాజ్ మహారాష్ట్రకు వెళ్లడం.. ఆ తరువాత ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్,(CM KCR) ప్రశాంత్ కిశోర్‌తో కలిసి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అప్పటి నుంచి టీఆర్ఎస్‌లో ప్రకాశ్ రాజ్‌కు మంచి ప్రాధాన్యత ఉండే స్థానం దక్కబోతోందని.. బాహుశా అది రాజ్యసభ సభ్యత్వమే కావొచ్చనే చర్చ జరుగుతూ వచ్చింది. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న కేసీఆర్.. ఇందుకోసం ఇతర రాష్ట్రాల నేతలతో పరిచయాలు ఉన్న ప్రకాశ్ రాజ్ తనతో ఎంతో ముఖ్యమని భావిస్తున్నారని.. అందుకే ఆయనను టీఆర్ఎస్ తరపున రాజ్యసభకు పంపించేందుకు సిద్ధమవుతున్నారని ఊహాగానాలు జోరుగా వినిపించాయి.
అయితే దీనిపై ప్రకాశ్ రాజ్ మాత్రం పెద్దగా స్పందించలేదు. ఇటీవల రెండు మూడు రోజుల నుంచి టీఆర్ఎస్ రాజ్యసభ (Rajya Sabha) సభ్యుల ఎంపిక కసరత్తు సందర్భంగానూ ఇదే రకమైన చర్చ జరిగింది. ప్రకాశ్ రాజ్‌ను(Prakash Raj) రాజ్యసభకు పంపించే విషయంలో సీఎం కేసీఆర్ కూడా సీరియస్‌గానే ఆలోచిస్తున్నారనే వార్తలు వచ్చాయి. కానీ టీఆర్ఎస్ ప్రకటించిన పేర్లలో మాత్రం ప్రకాశ్ రాజ్ పేరు కనిపించలేదు. పార్టీ తరపున హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారిథిరెడ్డి, నమస్తే తెలంగాణ ఎంపీ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్ర(గాయిత్రి రవి) పేర్లను ఖరారు చేశారు సీఎం కేసీఆర్. వీరిలో బండ ప్రకాశ్ రాజీనామాతో ఖాళీ అయిన స్థానానికి వద్దిరాజు రవిచంద్ర నామినేషన్ వేయబోతున్నారు.
రాజ్యసభ సభ్యుడిగా ఈయన పదవీకాలం రెండేళ్లు మాత్రమే ఉండనుంది. ఈ స్థానానికి ప్రకాశ్ రాజ్‌ను ఎంపిక చేస్తారని అనుకున్నా.. చివరకు వద్దిరాజు రవిచంద్రకు ఛాన్స్ ఇచ్చారు. నిజానికి టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల రేసులో వద్దిరాజు రవిచంద్ర పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ అనూహ్యంగా ఆయనకు రాజ్యసభ ఛాన్స్ ఇచ్చారు సీఎం కేసీఆర్.
TRS Rajya Sabha Candidates: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. అనూహ్యంగా ఆ నేతకు అవకాశం
మరోవైపు ప్రకాశ్ రాజ్‌ను రాజ్యసభకు ఎంపిక చేయకపోవడంతో.. ఇక ఆయన టీఆర్ఎస్ రాజకీయాల్లో పెద్దగా కనిపించే ఛాన్స్ లేదనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే ప్రకాశ్ రాజ్ విషయంలో సీఎం కేసీఆర్ ఏ రకమైన ఆలోచనతో ఉన్నారనే విషయం మరోసారి వారిద్దరి భేటీ జరిగిన తరువాతే క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పలువురు చర్చించుకుంటున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక పూర్తికావడంతో.. ప్రకాశ్ రాజ్ రాజకీయ పరిస్థితి ఏమిటన్నది ఆసక్తిరకంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Prakash Raj