రాజకీయాల్లో రిస్క్ చేయడం తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు కొత్తేమీ కాదు. రాజకీయాల్లో అనేకసార్లు రిస్క్ చేసిన కేసీఆర్.. ఎవరితో పొత్తు పెట్టుకోకుండా టీఆర్ఎస్‌ను సొంతంగా అధికారంలోకి తీసుకురావడంలో సక్సెస్ అయ్యారు. అంతకుముందు తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కేసీఆర్ ఇలాంటి రిస్క్ రాజకీయాలు ఎన్నో చేశారు. అందులో కొన్నిసార్లు సక్సెస్ అయ్యారు. మరికొన్నిసార్లు ఆయన వ్యూహాలు ఫలించలేదు. తాజాగా జాతీయ పార్టీ విషయంలోనూ సీఎం కేసీఆర్ మరో పెద్ద రిస్క్ చేస్తున్నారా ? అనే చర్చ జరుగుతోంది. నిజానికి సీఎం కేసీఆర్ జాతీయస్థాయిలో పార్టీ ఏర్పాటు చేస్తామని గతంలోనే ప్రకటించారు. భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పేరుతో ఆ పార్టీ ఉంటుందని అప్పట్లో ఊహాగానాలు వచ్చాయి. కానీ ఈ విషయంలో ఆయన కొంత సమయం తీసుకున్నారు.
తాజాగా దసరాలోపు బీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి కేసీఆర్ వచ్చినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. పలువురు టీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు కూడా ఇందుకు ఊతమిస్తున్నాయి. జాతీయస్థాయిలో ఓ పార్టీని ఏర్పాటు చేయడం అంతే నిజంగా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారమే. అయితే మునుగోడు ఉప ఎన్నిక ముందు ఉండగానే కేసీఆర్ ఇలాంటి చర్యలకు పూనకుంటే అది డబుల్ రిస్క్ అవుతుందనే అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నిక దసరాలోపు ఉండే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే ఈలోపు కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటించి ఆ దిశగా ముందుకు సాగిన తరువాత మునుగోడు ఉప ఎన్నికలు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కేసీఆర్ జాతీయ పార్టీపై ప్రకటన చేసిన తరువాత మునుగోడు ఉప ఎన్నిక వచ్చి.. అక్కడ ఫలితం ప్రతికూలంగా వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో అనే చర్చ కూడా తెలంగాణ రాజకీయవర్గాల్లో జరుగుతోంది. సొంత రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లోనే బీజేపీని ఓడించలేని కేసీఆర్.. జాతీయస్థాయిలో బీజేపీని ఏ రకంగా ఓడిస్తారనే విమర్శలు కమలనాథుల నుంచి రావడం ఖాయం.
నిజంగా అలాంటి పరిస్థితి వస్తే.. కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నిక ఫలితాలు ఊహించి జాతీయ రాజకీయాలు అంటూ కొత్త నాటకం మొదలుపెట్టారనే ప్రచారం కూడా బీజేపీ మొదలుపెట్టే అవకాశం లేకపోలేదు. అయితే రాజకీయాల్లో ఆరితేరిన నేతగా గుర్తింపు తెచ్చుకున్న సీఎం కేసీఆర్.. ఇలాంటి లెక్కలన్నీ పక్కాగా వేసుకుని ముందుకు సాగుతారని టీఆర్ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తానికి మునుగోడు ఉప ఎన్నిక ముందు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయ పార్టీని ప్రకటిస్తే.. ఆయన డబుల్ రిస్క్ చేసినట్టే అవుతుందనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.