తెలంగాణ ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యాసంగిలో రైతులు పండించిన పంటను పూర్తిస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని కేబినెట్ భేటీ అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ (Cm Kcr) తెలిపారు. దీని వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మేరకు నష్టం వస్తుంది ? ప్రభుత్వం ఎంత నష్టం భరించాల్సి ఉంటుందనే దానిపై నలుగురు నిపుణులతో కమిటీ కూడా వేయబోతున్నట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో ఈ కమిటీ వేశామని తెలిపారు. తక్కువ నష్టంతో ధాన్యం(Paddy Procurement) కొనుగోలుతో పాటు దాన్ని డిస్పోజ్ చేసేందుకు ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే దానిపై కమిటీ నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఎంత దిగుబడి వచ్చినా మొత్తం ధాన్యం కొనుగోలు చేస్తామని వెల్లడించారు. క్వింటాల్ ధాన్యానికి రూ.1960 చొప్పున కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రతి ఊరిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
రైతులు(Farmers) తక్కువ ధరకు ధాన్యం అమ్ముకోవద్దని సూచించారు. ధాన్యం డబ్బులను రైతుల ఖాతాల్లో నేరుగా జమ చేయనున్నట్లు తెలిపారు. రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ధాన్యం కొనుగోలుతో పాటు తెలంగాణ కేబినెట్ పలు ఇతర నిర్ణయాలు కూడా తీసుకుంది.
మే 20 నుండి జూన్ 5 వరకు పట్టణ ప్రగతి,పల్లె ప్రగతి కార్యక్రమం నిర్వహించనున్నారు. 6 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.ఫార్మా యూనివర్సిటీ అత్యవసరంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీలలో నియామకాలకు ఒక కామన్ బోర్డు ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. పారదర్శకంగా నియామకాలు చేపట్టేందుకు ఈ బోర్డు పని చేస్తుందని సీఎం కేసీఆర్ తెలిపారు.
ఇది ధాన్యం కొనుగోలు పంచాయతీ: కేసీఆర్
ఇక ప్రస్తుతం ధాన్యం కొనుగోలు అంశంపై కొనసాగుతున్న రగడపై సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. మాములు సమయంలో వంద కిలోల వడ్లకు 67 కిలోల బియ్యం వస్తుందని ఆయన తెలిపారు. అయితే యాసంగి సమయంలో వాతావరణంలో వేడి ఎక్కువ ఉంటుంది కాబట్టి అందులో సగం మాత్రమే బియ్యం వస్తుందని.. మిగతాది నూకలుగా వస్తుందని అన్నారు. అలా వచ్చిన 37 కిలోల నూకల డబ్బు కేంద్ర ప్రభుత్వం భరించాలని అన్నారు. అయితే అందుకు కేంద్రం నిరాకరిస్తోందని అన్నారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.