రాజకీయ నేతలకు సమయం, సందర్భం అనేది చాలా ముఖ్యం. చాలామంది నాయకులు అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు. తమకు అవకాశం వచ్చినప్పుడు ఏ రకంగా రాజకీయాలు చేయాలి ? ఎలా ప్రజల దృష్టిని ఆకర్షించాలి ? అనే అంశంపై ఫోకస్ చేస్తుంటారు. అయితే ఇలాంటి అవకాశాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ (CM Kcr) వదులుకున్నారేమో అనే చర్చ రాజకీయవర్గాల్లో సాగుతోంది. విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేయడం కోసం మమత బెనర్జీ, శరద్ పవార్ వంటి నేతలు ముందుకొచ్చి ఆ పార్టీలతో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి తెలంగాణ సీఎం కేసీఆర్ దూరంగా ఉండిపోయారు. మొదట ఈ సమావేశానికి ప్రతినిధిని కూడా పంపని కేసీఆర్.. ఆయన తరువాత విపక్షాల రాజ్యసభ అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా(Yashwanth Sinha) పేరును ఖరారు చేసిన తరువాత ఆయనకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించారు.
శరద్ పవార్ ఫోన్ చేసి చర్చలు జరపడంతో.. ఇందుకు ఓకే చెప్పారు కేసీఆర్. అయితే దేశంలో ఎలాంటి రాజకీయ సందర్భం లేనప్పుడు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అక్కడి నేతలను కలిసి వచ్చిన కేసీఆర్ (KCR).. కీలకమైన రాష్ట్రపతి ఎన్నికల సమయంలో మాత్రం హైదరాబాద్‌కే(Hyderabad) పరిమితం కావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ ఈ అవకాశాన్ని వినియోగించుకుని విపక్షాల ఐక్యత కోసం కృషి చేసి ఉంటే బాగుండేదని కొందరు చర్చించుకుంటున్నారు.
అయితే ఈ విపక్షాల్లో కాంగ్రెస్ కూడా ఉండటం వల్లే కేసీఆర్ ఈ సమావేశాలకు దూరంగా ఉండిపోయారనే చర్చ కూడా సాగుతోంది. కొంతకాలం క్రితం తెలంగాణకు వచ్చిన రాహుల్ గాంధీ.. టీఆర్ఎస్, కేసీఆర్‌ను ఎక్కువగా టార్గెట్ చేశారు. టీఆర్ఎస్‌పైనే తమ పోరాటం ఉంటుందని.. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి అనుమానాలు లేవని అన్నారు. తాము టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటామని ఎవరూ అనుకోవద్దని కుండబద్ధలు కొట్టారు. రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యల కారణంగానే కాంగ్రెస్ ఉన్న విపక్షాల కూటమికి కేసీఆర్ దూరంగా ఉండిపోయారనే వాదన కూడా వినిపిస్తోంది.
CM KCR : సీఎం కేసీఆర్‌కు భారీ షాక్ -TRS పార్టీకి భూముల కేటాయింపులపై హైకోర్టు నోటీసులు
Karimnagar: ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మరోసారి పదవుల పంట.. గులాబీ బాస్ నిర్ణయంతో జిల్లాలో ఉత్సాహం..
కాంగ్రెస్‌తో కలిసి వేదిక పంచుకుంటే.. తెలంగాణలో బీజేపీకి సరికొత్త ఆయుధాన్ని ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ భావించి ఉండొచ్చని.. అందుకే ఆయన ఈ రకమైన నిర్ణయం తీసుకున్నారనే చర్చ కూడా సాగుతోంది. అయితే తన రాజకీయ వ్యూహ చతురతతో కేసీఆర్ విపక్షాలకు నాయకత్వం వహించి ఉంటే.. ఆయనకు పొలిటికల్ మైలేజీ పెరిగి ఉండేదని.. కనీసం మమత, పవార్ వంటి వాళ్లతో కలిసి ముందుకు సాగినా.. కేసీఆర్ బీజేపీతో బలంగా పోరాడేందుకు సిద్ధమవుతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లేవని పలువురు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, President Elections 2022, Telangana