తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. ఇందుకు ప్రధాన కారణంగా బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలే. తెలంగాణలో తాము బలపడుతున్నట్టుగా స్పష్టమైన సంకేతాలు ఉండటంతో.. కొత్త రాష్ట్రాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ముందస్తుగానే కసరత్తు మొదలుపెట్టింది కమలం పార్టీ. రాష్ట్రంలోని ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి వ్యూహాలు రచిస్తూనే.. తెలంగాణలోని బీజేపీ నేతలకు పదవులు ఇచ్చి ప్రాధాన్యత ఇవ్వాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల తెలంగాణ బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్‌ను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభకు పంపింది బీజేపీ హైకమాండ్. ఈ రకంగా తెలంగాణ బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపింది. లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు రావడంతో.. మిగతా బీజేపీ నేతలకు ఏ రకమైన పదవులు దక్కుతాయో అనే చర్చ బీజేపీ వర్గాల్లో మొదలైంది.
తెలంగాణ బీజేపీలో సీనియర్ నేతగా, పార్టీనే నమ్ముకుని ఉన్న ఇంద్రసేనారెడ్డికి ఏ రకమైన పదవి కట్టబెట్టబోతున్నారనే అంశంపై ఇప్పుడు ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఇంద్రసేనారెడ్డికి త్వరలోనే గవర్నర్ పదవి లభించనుందనే చర్చ బీజేపీ వర్గాల్లో జరుగుతోంది. కొన్ని దశాబ్దాలుగా బీజేపీలోనే కొనసాగుతూ వస్తున్న ఇంద్రసేనారెడ్డి.. క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే పార్టీ వ్యవహారాల్లో మాత్రం ఆయన పాలుపంచుకుంటున్నారు. తెలంగాణ బీజేపీలో చేరిక కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ క్రమంలో ఆయనకు కూడా కీలకమైన పదవి ఇవ్వడం ద్వారా తెలంగాణ బీజేపీ సీనియర్ నేతలకు సముచిత స్థానం కల్పించినట్టు అవుతుందని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే తెలంగాణ బీజేపీ సీనియర్ నేతగా ఉన్న బండారు దత్తాత్రేయను హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌ను చేసింది బీజేపీ హైకమాండ్. రీసెంట్‌గా లక్ష్మణ్‌కు రాజ్యసభ సీటు ఇచ్చింది. వీరి తరువాత పదవి దక్కబోయేది పార్టీలోని మరో సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డినే అనే చర్చ జరుగుతోంది.
నిజానికి తెలంగాణ కోటా నుంచి రాజ్యసభ సీటు దక్కించుకునే విషయంలో లక్ష్మణ్‌తోపాటు ఇంద్రసేనారెడ్డి కూడా పోటీ పడినట్టు వార్తలు వచ్చాయి. అయితే తెలంగాణ నుంచి ఈ పదవిని బీసీ వర్గానికి ఇవ్వాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావించిందని.. అందుకే ఆ సామాజికవర్గానికి చెందిన ఇంద్రసేనారెడ్డిని ఎంపిక చేసిందనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంద్రసేనారెడ్డి గవర్నర్ పదవి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.