చంద్రబాబు నిర్దేశం ప్రకారం ఒకప్పుడు సమైక్యవాదానికి కట్టుబడి, దానినే బలంగా వినిపించిన తెలంగాణ టీడీపీ నేతలు చాలా మంది చాలా కాలం కిందటే గులాబీ దళంలోకి చేరిపోయి తెలంగాణవాదులుగా మారినా, టీడీపీ క్యాడర్ ఊళ్లకు ఊళ్లే టీఆర్ఎస్ గా రూపాంతరం చెందినా.. పోయింది నేతలు మాత్రమేనని, వాళ్లను తయారు చేసిన కార్యకర్తలు ఇప్పటికీ తెలుగుదేశాన్నే నమ్ముకొని ఉన్నారని అధినేత చంద్రబాబు విశ్వసిస్తున్నారు. అంతేకాదు, తెలంగాణలో టీడీపీ ఓటు బ్యాంకును కాపాడుకునే దిశగా అధికార టీఆర్ఎస్ పై అలుపెరుగని పోరాటం చేద్దామంటూ టీటీడీపీ నేతలకు ఆయన ధైర్యం నూరిపోస్తున్నారు. ఈ క్రమంలో తన శిశ్యుుడని చెప్పుకునే తెలంగాణ సీఎం కేసీఆర్ రాజకీయ భవితవ్యంపైనా గురువు చంద్రబాబు కీలక అంచనాలను నేతలతో పంచుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ సర్కారుపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న చంద్రబాబు ‘బాదుడే బాదుడు’పేరుతో జిల్లాల యాత్ర చేపట్టిన సంగతి తెలిసిందే. ఏపీలో విడతలవారీగా జిల్లాల యాత్రలు చేయనున్న చంద్రబాబు ఏమాత్రం గ్యాప్ దొరికినా హైదరాబాద్ లో వాలిపోయి టీటీడీపీ నేతలతో భేటీ అవుతున్నారు. గత 20 రోజుల వ్యవధిలో రెండోసారి చంద్రబాబు నేతృత్వంలో తెలంగాణ టీడీపీ ముఖ్యనేతల సమావేశం జరిగింది. శనివారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ లో టీటీడీపీ నేతలతో బాబు సమీక్ష జరిపారు. ఇంకా చెక్కుచెదరకుండా ఉన్న క్యాడర్ ను కాపాడుకోవాలని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ది పనులను ప్రజలకు వివరించాలని నేతలకు సూచించిన చంద్రబాబు.. అధికార పార్టీ పతనావస్థపైనా మాట్లాడారు.
అధికారంలో ఉన్న పార్టీలు డబ్బులు ఉంటే అంతా చేసేయొచ్చనే భ్రమలో ఉంటారని, నిజానికి డబ్బులుంటేనే రాజకీయం సాగుతుందనుకోవడం తెలివితక్కువ తనమని, ప్రజల్లో గనుక ఒక్కసారి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తే ఎంత డబ్బులున్నా పనిచేయవని చంద్రబాబు అన్నారు. ఏపీని ఎన్నో రకాలుగా అభివృద్ది చేసినా ప్రజల్లో వ్యతిరేకత కారణంగానే ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చిందని, తెలంగాణలోనూ అలాంటి పరిస్థితులు కాదనలేమని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం టీడీపీనే కావాలని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డబ్బులు ఉన్నంత మాత్రాన ప్రతిసారి ఎన్నికల్లో గెలవలేరన్న చంద్రబాబు వ్యాఖ్యలు సీఎం కేసీఆర్ ను ఉద్దేశించిన అంచనాలేనా? అని టీటీడీపీ నేతలు చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది.
టీడీపీకి బలమైన నాయకత్వాన్ని ఇచ్చిన ప్రాంతం తెలంగాణ అని, ఇక్కడ కార్యకర్తలు బలమైనవాళ్లు కాబట్టే నాయకత్వం బలోపేతమైందని చంద్రబాబు అన్నారు. కొందరు నాయకులు పార్టీని వదిలివెళ్లినా ఆ ఇబ్బందులు తాత్కాలికమేనని, తెలంగాణలో ఓటు బ్యాంకును కాపాడుకోవాలని, టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఉండాలని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. యువతకు ఉపాధి కల్పించాలన్నదే తన తపన అని, రైతు సాధికారత, మహిళా సాధికారత కోసమే ఆరాటపడ్డానని, ప్రజల్లో తనకున్న విశ్వనీయత అదేనని ఈ సందర్భంగా చంద్రబాబు గుర్తుచేశారు. అభివృద్ధి చేసి ప్రజాదరణ పొందడమే తన రాజకీయమని ఆయన స్పష్టం చేశారు.
ఏపీ మాదిరిగానే తెలంగాణలోనూ అన్ని నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు ముమ్మరంగా సాగాలని చంద్రబాబు ఆదేశించారు. మే 9,10 తేదీల్లో ప్రతి నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున రాష్ట్ర పార్టీ కార్యాలయంలో శిక్షణ ఇస్తామని, పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షులతో 10న సమావేశం ఉంటుందని, సభ్యత్వ నమోదు, స్థానిక పరిస్థితులపై నివేదికలు రూపొందించి.. రాష్ట్ర పార్టీకి పంపాలని టీడీపీ చీఫ్ కోరారు. ఈ ఏడాది టీడీపీ మహానాడును ఒంగోలులో రెండు రోజులు ఘనంగా నిర్వహిస్తున్నామని, తొలిరోజు సర్వసభ్య సమావేశం, రెండోరోజు బహిరంగ సభ ఉంటాయని చంద్రబాబు తెలిపారు. బాబుతో సమావేశంలో టీటీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహులు, పొలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి, అరవింద్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
‘ఒకప్పుడు నా శిశ్యుడే.. నేను తీర్చిదిద్దితేనే కేసీఆర్ ఇంత పెద్దవాడయ్యాడు..’అంటూ తెలంగాణ సీఎంను ఉద్దేశించి ఏపీ మాజీ సీఎం, టీడీపీపీ చీఫ్ చంద్రబాబు చాలా సార్లు చెబుతారు. యూత్ కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన కేసీఆర్.. ఎన్టీఆర్ పిలుపుమేరకు టీడీపీలోకి వచ్చినా, వెన్నుపోటు సందర్భంలో చంద్రబాబు వెన్నంటే ఉండటంతో మంత్రి దక్కడం, చంద్రబాబు రెండోసారి సీఎం అయ్యాక కేసీఆర్ కు మంత్రి పదవి కాకుండా డిప్యూటీ స్పీకర్ పోస్టు ఇవ్వడం, అదే సమయంలో తెలంగాణ వాదంతో కేసీఆర్ టీఆర్ఎస్ స్థాపించడం తెలిసిందే.
తెలంగాణ ఏర్పడేంత వరకూ టీడీపీతో టీఆర్ఎస్ దోస్తీ కొనసాగించడం, ఉద్యమకారులతోపాటు టీడీపీ నేతలు, క్యాడర్ అంతా గులాబీ దండులో చేరిపోవడం, రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ముఖ్యమంత్రుల హోదాలో కేసీఆర్-చంద్రబాబు కొన్నాళ్లు సఖ్యతతో ఉండటం, ఓటుకు నోటు ఉదంతం తర్వాత గురుశిష్యుల మధ్య దూరం పెరగడం, తర్వాతి కాలంలో జగన్ కోసం చంద్రబాబు ఓటమికి ప్రయత్నిస్తామనీ కేసీఆర్ వ్యాఖ్యానించడం లాంటి పరిణామాలు తెలిసిందే.
తెలంగాణ వ్యతిరేకిగా చంద్రబాబును విలన్ గా నిలబెట్టడంలో శిష్యుడు కేసీఆర్ విజయవంతం కావడం, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు పెట్టుకోవడం వల్ల టీఆర్ఎస్ అనూహ్యంగా లాభపడటం లాంటివి తర్వాతికాలంలో జరిగాయి. కొంతకాలంగా టీటీడీపీపై ఫోకస్ పెట్టి చంద్రబాబు నేతలతో వరుస సమావేశాలు జరుపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.