టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారింది. అంతేకాదు బీఆర్ఎస్ (BRS) తన కార్యకలాపాలను దేశ వ్యాప్తంగా విస్తృతం చేస్తుంది. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బలమైన రాజకీయ శక్తిగా ఎదుగుతుందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా..తెలంగాణలో పార్టీ బాధ్యతలపై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే టీఆర్ఎస్ లో ఉన్న పదవులన్నీ కూడా బీఆర్ఎస్ కు మారుతాయని ఆ పార్టీ నేతలు చెప్పారు. ఇక మరీ ముఖ్యంగా బీఆర్ఎస్ లో మంత్రి కేటీఆర్ హోదా ఏంటనేది ఇప్పటివరకు సస్పెన్స్ గానే ఉంది. అయితే BRS కార్యక్రమాల్లో కేటీఆర్ పాల్గొన్న సందర్భాలు లేవు. ఈ క్రమంలో ఆయనకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారా? లేక జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగించే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నారా అనే ప్రచారం జరుగుతుంది. ఇక తాజాగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ అకౌంట్ హ్యాండిల్ లో చేసిన మార్పులు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
కేటీఆర్ ట్విట్టర్ లో మార్పులు దేనికి సంకేతం?
టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి చాలా రోజులు అవుతుంది. ఇన్నిరోజులుగా ట్విట్టర్ లో మార్పులు చేయని కేటీఆర్ 4 రోజుల కింద హ్యాండిల్ పేరు సహా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ ను తొలగించారు. దీనితో కేటీఆర్ ట్విట్టర్ కు ఏమైంది? ఆయన ఎందుకు ప్రొఫైల్ మార్చారు? అనే ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి.
అంటీముట్టనట్టుగా కేటీఆర్ తీరు..
ఏ ముహూర్తాన టీఆర్ఎస్ బిఆర్ఎస్ గా మారిందో కానీ అప్పటి నుంచి మంత్రి కేటీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభ మినహా ఎక్కడా కేటీఆర్ కనిపించలేదు. ఢిల్లీ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభం, ఏపీ అధ్యక్షుడిని ప్రకటించిన రోజు, మొన్న ఖమ్మం బహిరంగ సభ రోజు ఇలా బీఆర్ఎస్ కార్యకలాపాల్లో కేటీఆర్ పాల్గొనలేదు. అయితే ట్విట్టర్ లో టీఆర్ఎస్ పేరును తొలగించిన కేటీఆర్ కేవలం కేటీఆర్ బీఆర్ఎస్ అని మాత్రమే వుంచారు. ప్రొఫైల్ లో హోదా గురించి ప్రస్తావించకపోవడం గమనార్హం.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటా? రాష్ట్ర అధ్యక్షుడా?
టీఆర్ఎస్‌కు కేసీఆర్ అధ్యక్షుడిగా ఉండగా... ఆయన కుమారుడు, తెలంగాణ మంత్రి కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వ్యవహరించారు. అయితే టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో.. కేటీఆర్ పార్టీ పదవి సంగతి ఏంటనే అంశంపై చర్చ జరుగుతోంది. టీఆర్ఎస్ తరహాలోనే బీఆర్ఎస్‌కు కూడా కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉంటారా? అన్నది తెలియాల్సి ఉంది. ఒకవేళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు ఇస్తే జాతీయస్థాయి వ్యవహారాలను కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కేటీఆర్ ఆ బాధ్యతలు తీసుకుంటారా..లేక కేవలం తెలంగాణకు మాత్రమే పరిమితమయ్యేలా బీఆర్ఎస్ తెలంగాణ బాధ్యతలను మాత్రమే తీసుకుంటారా? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. అయితే బీఆర్ఎస్‌కు అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ .. బీఆర్ఎస్ తెలంగాణకు కేటీఆర్‌ను అధ్యక్షుడిగా నియమించే అవకాశం లేకపోలేదని టాక్ వినిపిస్తోంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళితే.. కేటీఆర్ తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారని ఆ పార్టీ నేతలు చాలామంది అనేకసార్లు బాహాటంగానే కామెంట్ చేశారు.
అయితే బీఆర్ఎస్ కార్యవర్గంపై కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తేనే.. కేటీఆర్ సహా మిగతా నేతలకు పార్టీ పరంగా ఏయే పదవులు వస్తాయనే దానిపై క్లారిటీ వస్తుందని.. అప్పటివరకు అంతా సస్పెన్సే అని కొందరు చర్చించుకుంటున్నారు. మొత్తానికి బీఆర్ఎస్‌గా మారిన టీఆర్ఎస్‌లో కేటీఆర్ తీసుకోబోయే పదవి ఏంటన్నది తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: BRS, CM KCR, KTR, Minister ktr, Telangana, Telangana Politics, Trs