తన అనుచరులు కొందరిని బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయడంపై మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లను, వీళ్లను సస్పెండ్ చేయడం కాదని.. దమ్ముంటే తనను సస్పెండ్ చేయాలని ఆయన సవాల్ విసిరారు. తనను కొద్దిరోజుల క్ర్తం వరకు పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించారని ఆయన గుర్తు చేశారు. వారి గెలుపు కోసం నన్ను ప్రాధేయపడ్డారని అన్నారు. తనకు బీఆర్ఎస్ సభ్యత్వం లేదని ఎవరో అంటున్నారట అని వ్యాఖ్యానించిన పొంగులేటి.. అలాంటప్పుడు డిసెంబర్ వరకు పార్టీ కార్యక్రమాల్లో తన ఫోటో ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. తనను నమ్ముకున్న అభిమానుల అభీష్టం మేరకే పార్టీ మార్పు ఉంటుందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్‌లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ, ముఖ్యమంత్రి కేసీఆర్‌పై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరగణంపై ఖమ్మం జిల్లా వైరా ఎమ్మెల్యే రాములు నాయక్ ఆదేశాలతో బహిష్కరణ వేటు వేస్తున్నట్లు ఆ పార్టీ వైరా మండల, పట్టణ అధ్యక్షులు ప్రకటించారు. ఆ మేరకు వైరా మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వర్లు, వైరా పట్టణ అధ్యక్షులు డాక్టర్ రాజశేఖర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్ర మార్క్ ఫెడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్. వైరా మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్తో పాటు మిట్టపల్లి నాగేశ్వరరావు (రైతుబంధు మండల అధ్యక్షులు), గుమ్మా రోశయ్య (మాజీ మార్కెట్ కమిటి చైర్మన్), ఇటికల మురళీ (సర్పంచ్ అష్టగుర్తి) బహిష్కరణకు గురైన వారిలో ఉన్నారు.
పార్టీ నుండి బహిష్కరించడంతో పాటు వారు ప్రస్తుతం అనుభవిస్తున్న నామినేటెడ్ పదవులు రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బహిష్కరణల పర్వం సంచలనంగా మారింది. ఖమ్మం జిల్లాలో బిఆర్ఎస్ పార్టీపైన, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుపై వ్యక్తిగతంగా దూషణలకు పాల్ప డుతూ పార్టీ నియమావళికి వ్యతిరేకంగా వ్యవహ రిస్తున్నందున ఈ చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.
వైరాలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనుచరగణంగా ఎమ్మెల్యే అభ్యర్ధిని విజయాబాయిని ప్రకటించి అందుకు ఏర్పాటుచేసిన మీటింగ్కు పార్టీ అనుమతి లేకుండా బహిష్కృత నేతలు హాజరైనట్లు తెలిపారు. దీనిని తీవ్ర క్రమశిక్షణరాహిత్య చర్యగా భావించి బిఆర్ఎస్ పార్టీ నుండి బహిష్కరించినట్లు పేర్కొన్నారు. దీంతో పొంగులేటి తనను పార్టీ నుంచి బహిష్కరించాలని సవాల్ విసిరారు. మొత్తానికి పొంగులేటి అనుచరగణంపై బీఆర్ఎస్ నేతలు సస్పెన్షన్ వేటు వేస్తున్నట్టు అర్థమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Khammam, Ponguleti srinivas reddy, Telangana