TS POLITICS SUNIL KANUGOLU REPORT ON CONGRESS SITUATION IN TELANGANA TO HIGH COMMAND FOR RAHUL GANDHI AK
Telangana| Congress: తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ప్రజల్లోకి వెళ్లడం లేదా ? హైకమాండ్‌కు కీలక రిపోర్ట్ ?
రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు (ఫైల్ ఫోటో)
Telangana Congress: అనేక మంది నేతలు ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇప్పటికే చురుగ్గా వ్యవహరించడం లేదని.. కేవలం కొందరు నేతలు మాత్రం ఈ విషయంలో యాక్టివ్‌గా ఉంటున్నారని సునీల్ కనుగోలు తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
తెలంగాణలో పార్టీ బలోపేతంపై కాంగ్రెస్ హైకమాండ్(Congress High Command) దృష్టి పెట్టింది. కొద్దినెలల క్రితం ఇదే అంశంపై రాష్ట్ర పార్టీ నేతలతో సమావేశమైన రాహుల్ గాంధీ(Rahul Gandhi).. వారికి అనేక సలహాలు, సూచనలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో పార్టీ అధికారంలోకి రావాల్సిందేనని నేతలకు స్పష్టం చేశారు. నేతలంతా అంతర్గత విభేదాలు మాని ప్రజల్లోకి వెళ్లాలని అన్నారు. ప్రజల్లో ఉండే నేతలకే వచ్చే ఎన్నికల్లో టికెట్లు ఇస్తామని స్పష్టం చేశారు. వరంగల్ (Warangal) సభలో పాల్గొని తెలంగాణ(Telangana) కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. రాహుల్ గాంధీ ఇంత చేసినా.. తెలంగాణ కాంగ్రెస్‌లో పరిస్థితి పెద్దగా మారలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పార్టీ పరిస్థితికి సంబంధించి ప్రతి నెల నివేదికలు తెప్పించుకుంటోంది కాంగ్రెస్ హైకమాండ్.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు.. ఎప్పటికప్పుడు ఈ అంశంలో కాంగ్రెస్ హైకమాండ్‌కు నివేదికలు ఇస్తున్నారు. ఇటీవల ఆయన తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై అధిష్టానానికి ఇచ్చిన రిపోర్ట్‌లో రాష్ట్ర నేతల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో పార్టీ పరిస్థితిని మెరుగుపరచాల్సిన నాయకులు.. మళ్లీ ఎప్పటిలాగే అంతర్గత విభేదాల కారణంగా పరిస్థితిలో మార్పుల లేకుండా చేస్తున్నారని ఆయన తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.
అనేక మంది నేతలు ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇప్పటికే చురుగ్గా వ్యవహరించడం లేదని.. కేవలం కొందరు నేతలు మాత్రం ఈ విషయంలో యాక్టివ్‌గా ఉంటున్నారని సునీల్ కనుగోలు తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం. అనేక ఉమ్మడి జిల్లాల్లో పార్టీ పరిస్థితి ఏ మాత్రం మెరుగుపడలేదని.. కేవలం ఒకటి రెండు జిల్లాల్లో మాత్రమే పార్టీ పరిస్థితి పర్వాలేదనిపించేలా ఉందని కాంగ్రెస్ హైకమాండ్‌కు ఇచ్చిన తాజా నివేదికలో వెల్లడించినట్టు సమాచారం.
ఈ నివేదికపై కాంగ్రెస్ హైకమాండ్ కూడా త్వరలోనే పోస్టుమార్టం నిర్వహించబోతోందని.. టీపీసీసీ చీఫ్ సహా పలువురు ముఖ్యనేతలను ఢిల్లీకి పిలిచి మరోసారి వారితో చర్చించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి విషయంలో కాంగ్రెస్ హైకమాండ్ ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో వాస్తవ పరిస్థితిని తెలుసుకుంటున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.