ఖమ్మం (Khammam)లో టీఆర్ఎస్ (TRS) పార్టీకీ ఓ ఊరి గ్రామస్తులు భారీ షాక్ ఇచ్చారు. సమస్యల పరిష్కారం కోసం ప్రగతి భవన్‌కు చేపట్టిన పాదయాత్రను అడ్డుకోవడమే కాక లాఠీచార్జ్ చేయడాన్ని నిరసిస్తూ గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్, ఐదుగురు వార్డు సభ్యులు సహా గ్రామంలోని 160 కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీకి మూకుమ్మడిగా రాజీనామా (Resign to TRS party) చేశారు. భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri kothagudem) జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెం సర్పంచ్ మడకం స్వరూప, గ్రామస్తులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే (MLA) మెచ్చా నాగేశ్వరరావు, ఎంపీపీ (MPP)తో పాటు మరికొందరు నాయకులు పోలీసులను ఉసిగొల్పి తమ పాదయాత్రను అడ్డుకున్నారని వివరించారు. మహిళలపైనా పోలీసులు లాఠీచార్జ్ చేస్తుంటే సొంత పార్టీ వారు అడ్డుకోకపోగా, తరువాత పరామర్శించేందుకు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధుల వైఖరికి నిరసనగా తాము పార్టీకి రాజీనామా (Resign) చేస్తున్నట్లు ప్రకటించారు.
బోడుప్పల్ కార్పొరేషన్లో..
మరోవైపు నల్గొండ (Nalgonda)జిల్లాలోని బోడుప్పల్ కార్పొరేషన్ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ మంద సంజీవరెడ్డి పార్టీ అధిష్టానానికి ఝలక్ ఇచ్చారు. మంగళవారం సంజీవరెడ్డి టీఆర్ఎస్ (TRS) పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. తమ రాజీనామా లేఖలను స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో పాటు జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజులకు అందజేసినట్లు తెలిసింది. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌లకు ఫ్యాక్స్ ద్వారా రాజీనామా లేఖను పంపినట్లు సమాచారం. రాజీనామా లేఖలో తన వ్యక్తిగత కారణాల వల్లనే పార్టీని వీడుతున్నట్లు పేర్కొనప్పటికీ, బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీలో వర్గపోరు తారస్థాయికి చేరినట్లు తెలుస్తోంది. బోడుప్పల్ కార్పొరేషన్ పాలక వర్గం, పార్టీ మధ్యన పోసగడంలేదన్న ప్రచారం జరుగుతోంది.
కొంతకాలం పాటు బాగానే ఉన్నా..
బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా బరిలో నిలిచిన మంద సంజీవరెడ్డి ఓటమి పాలయ్యారు. 18వ వార్డు నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసిన మంద సంజీవరెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయి, మేయర్ పీఠాన్ని చేజార్చుకున్నారు. ఈ క్రమంలోనే సామల బుచ్చిరెడ్డిని మేయర్ పదవి వరించింది. దీంతో మంత్రి మల్లారెడ్డి.. సంజీవరెడ్డిని కార్పొరేషన్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా నియమించారు. పార్టీ, పాలక వర్గం సమన్వయంతో పనిచేయాలని మంత్రి సూచించారు. కొంతకాలం పాటు బాగానే ఉన్నా.. పాలక వర్గం, పార్టీ మధ్యన సమన్వయం లోపించింది. పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మేయర్ బుచ్చిరెడ్డి, కార్పొరేటర్ల మధ్యన విభేదాలు తారాస్థాయికి చేరినట్లు సమాచారం. పార్టీ అధ్యక్షుడు పాలన పరమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నాడని పలువురు కార్పొరేటర్లు పేర్కొనగా, పార్టీ తరఫున కార్యక్రమాలు చేపడితే పాలక మండలి సభ్యులు రాకుండా డుమ్మా కొడుతున్నారని పార్టీ నేతలు వాపోతున్నారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.