(P.Srinivas,New18,Karimnagar)
తెలంగాణ సంపన్న రాష్ట్రమని ..అభివృద్ధిలో మరే రాష్ట్రం పోటీ పడలేనంత వేగంగా ముందుకెళ్తున్న రాష్ట్రమని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేస్తున్నారు. గ్రామాల్లో పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. ఇందుకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి, టీఆర్ఎస్(TRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) సొంత ఇలాఖ నుంచే ఈ రియాక్షన్ (Reaction)కనబడటం ఒకింత ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. రాజన్న సిరిసిల్ల (Sircilla)జిల్లాలోని గ్రామ ప్రథమ పౌరులు(Sarpanches ) ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నారు. గతంలో మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు చెప్పిన పనులు చేయించి , అప్పులు ఊబిలో కూరుకుకుపోతే కనీసం తాము ఖర్చు చేసిన బిల్లులు కూడా మంజూరు చేయకపోవడంపై మండిపడుతున్నారు సర్పంచ్లు. అందుకే ఇకపై ప్రభుత్వ పెద్దలు చెప్పిన ప్రతి పని చేసే వరిస్థితుల్లో లేమని..అవసరమైతే సర్పంచ్ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు(Resigns) చేయడానికైనా సిద్ధమంటూ తేల్చి చెబుతున్నారు.
రాజీనామాలకు సైతం రెడీ ..
ఇల్లంతకుంట మండలంలోని కొందరు గ్రామ సర్పంచులు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం అయ్యారు. ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని మరోసారి ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్న సమయంలో తమ అసంతృప్తిని, అసహనాన్ని వెళ్లగక్కారు. ఈసారి చెపట్టబోయే పల్లె ప్రగతి కార్యక్రమంలో తాము పాల్గొనేందుకు ఆసక్తిగా లేమన్నారు. అధికారుల కింద పనిచేసే ఉద్యోగుల్లా మారిపోయిన తాము పంచాయతీల్లో సపాయిల్లా పనిచేశామని ఆవేదన వ్యక్తం చేశారు. అయినప్పటికి ప్రభుత్వం నుండి రావల్సిన పెండింగ్ బిల్లులు మంజూరు చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. గ్రామ పంచాయతీ విద్యుత్ బిల్లులు కూడా కట్టలేని స్థితిలో ఉన్నట్లు తెలిపారు.
సర్పంచ్ల ధిక్కారస్వరం..
2018 పంచాయితీ రాజ్ చట్టం అమల్లోకి వచ్చిన నాటి నుంచి సర్పంచ్ అధికారాలకు కోత పడినప్పటికి అన్నింటిని తట్టుకొని ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతున్నామని అంటున్నారు. పంచాయితీ నిధుల సంగతి పక్కన పెడితే గతంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో చేసిన ఖర్చుల తాలుక బిల్లులే ఇప్పటికి మంజూరు చేయకపోవడంపై తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నారు.
ప్రభుత్వానికి సర్పంచ్ల ఝలక్..
గత నెలలో కూడా జగిత్యాల జిల్లా కోరుట్ల మండలానికి చెందిన అధికార పార్టీ జడ్పీటీసీ ఇలాగే ఇచ్చిన మాటను ప్రభుత్వం నెలబెట్టుకోకపోవడంతో పార్టీకీ, జడ్పీటీసీ పదవికి రాజీనామా చేశారు. తర్వాత అదే బాటలో ఇంకొందరు టీఆర్ఎస్ నేతలు రాజీనామాలు చేశారు. ఇప్పుడు సాక్షాత్తు మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడే కాదు ప్రతి జిల్లాలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయని..సర్పంచ్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధిక్కారస్వరం వినిపించేందుకు సిద్ధం అవుతున్నట్టు కూడా సమాచారం అందుతోంది. ఎన్నికలకు మరో ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ సమయంలో టీఆర్ఎస్ అధినాయకత్వం వ్యతిరేకశక్తుల్ని పెంచుకుకోవడం మంచిది కాదనే సంకేతాలను గ్రామ సర్పంచ్లు పంపుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Karimangar, Politics, TRS leaders