Telangana: కొండా దంపతులు తమ పొలిటికల్ ఫ్యూచర్, తమ కూతురిని పొలిటికల్ ఎంట్రీ విషయంలో ప్లాన్ బిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారా ? అనే పుకార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో షికారు చేస్తున్నాయి.
ఒక్కోసారి బలమైన నేతలు సైతం రాజకీయాల్లో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తెలంగాణలోని ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన కొండా దంపతుల పరిస్థితి కూడా ఇలాంటిదే. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కొండా దంపతులకు అనుచరులు ఉన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ ఉన్న సమయంలో ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలో వీరి హవా నడిచింది. 2009 తరువాత కొండా సురేఖ(Konda Surekha) మంత్రి కూడా అయ్యారు. ఆ తరువాత టీఆర్ఎస్లో (TRS) చేరిన కొండా దంపతులు.. అక్కడ పదవులు వచ్చినప్పటికీ.. తమకు సరైన ప్రాధాన్యత లేదని బయటకు వచ్చేశారు. ఆ తరువాత మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం ఆ పార్టీలోనే కొనసాగుతున్నారు.
అయితే ఇటీవల కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో.. కొండా దంపతులు మరోసారి డైలమాలో పడిపోయారనే చర్చ ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగుతోంది. తమ కుటుంబానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలో మూడు సీట్లు కావాలన్నది కొండా దంపతుల ఆలోచన. వరంగల్ నగరంలో ఒకటి, భూపాల్ పల్లి, పరకాల సీట్లను కొండా దంపతులు కొండా సురేఖ, కొండా మురళి అశిస్తున్నారు. కనీసం రెండు సీట్లు అయినా ఇవ్వాలని కోరుతున్నారు.
ఒక చోటి నుంచి తమ కూతురు సుస్మిత పటేల్‌ను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. కానీ ప్రస్తుతం వారికి పరిస్థితులు అనుకూలంగా లేవనే చర్చ సాగుతోంది. రేవంత్ రెడ్డితో హుజూరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా తలెత్తిన గ్యాప్ కూడా వీరికి ప్రతికూలంగా మారిందని.. దీనికి తోడు కాంగ్రెస్ హైకమాండ్ ఒకే ఫ్యామిలీకి ఒకే టికెట్ అనే ప్రతిపాదన వీరిని టెన్షన్ పెడుతోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.
దీంతో పరిస్థితులు అనుకూలంగా లేకపోతే.. తమకు రెండు టికెట్లు ఆఫర్ చేసిన పార్టీలోకి ఈ దంపతులు వెళతారా ? అనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి. ఇటీవల వరంగల్‌లో జరిగిన కాంగ్రెస్ సభ విషయంలో కొండా దంపతులు అంటీముట్టనట్టుగానే వ్యవహరించారనే చర్చ జరుగుతోంది. దీంతో కొండా దంపతులు తమ పొలిటికల్ ఫ్యూచర్, తమ కూతురిని పొలిటికల్ ఎంట్రీ విషయంలో ప్లాన్ బిని కూడా సిద్ధం చేసి పెట్టుకున్నారా ? అనే పుకార్లు ఉమ్మడి వరంగల్ జిల్లాలో షికారు చేస్తున్నాయి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.