గెలుపు -ఓటమి సంగతి పక్కన పెడితే కాంగ్రెస్(Congress)లో మునుగోడు (Munugode) పంచాయితీ మాత్రం పీక్స్‌లో ఉంది. హస్తం గుర్తు పార్టీ అభ్యర్ధిని ఎంపిక విషయంలో టీపీసీసీ చీఫ్ సైలెంట్ పాలిటిక్స్ ప్లే చేస్తున్నారనే సంకేతాలు వస్తున్నాయి. మరోవైపు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి(Komatireddy Venkat Reddy) సైతం ఈవిషయంలో తన పంథా నెగ్గించుకొని .. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సూచించిన వ్యక్తి కాకుండా మరో వ్యక్తిని బరిలోకి దింపాలని కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఇందుకు ఢిల్లీ వేదికగా ఇద్దరు నేతల ఇళ్లలో జరిగిన లంచ్ మీటింగ్(Lunch meeting)లే ఉదాహరణగా కాంగ్రెస్ పార్టీ నేతలు చెబుతున్నారు.
ఢిల్లీలోనూ గల్లీ రాజకీయాలు..
తెలంగాణ కాంగ్రెస్‌లో మునుగోడు ఉపఎన్నిక గెలుపు కంటే అభ్యర్ధి ఎంపికే అధిష్టానానికి శిరోభారంగా మారింది. నియోజకవర్గ పరిధిలో సోషల్ మీడియా సర్వేతో పాటు సీనియర్లు సైతం మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి పేరు ప్రతిపాధిస్తే ...టీపీసీసీ చీఫ్ రేవంత్,ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ మాత్రం చల్లమల్ల కృష్ణారెడ్డికి మొగ్గు చూపుతున్నారు. పరిస్థితులు ఇలా ఉంటే రెండ్రోజుల క్రితం ఢిల్లీలో రేవంత్‌రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో పాటు పలువురు సీనియర్లను లంచ్ పార్టీకి ఆహ్వానించారు. అయితే ఈవిందుకు వెంకట్‌రెడ్డి దూరంగా ఉన్నారు. వచ్చిన నేతలకు టీపీసీసీ చీఫ్ మునుగోడు ఎన్నిక, అభ్యర్ధి ఎంపిక అంశంపైనే చర్చించారు. అలాగే అభ్యర్ధిగా చల్లమల్లారెడ్డి అయితే బెటర్ ఆర్ధికంగా కూడా పార్టీకి కొంత కలిసొస్తుందనే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దాన్ని హస్తం నేతలు వ్యతిరేకించారట. హుజురాబాద్‌లో కూడా ఇదే విధంగా ఆలోచించి వెంకట్ బల్మూరిని నిలబెడితే ఏం జరిగిందో గుర్తు లేదా అని రేవంత్‌రెడ్డితో డైరెక్టర్‌గా చెప్పారని కాంగ్రెస్ వర్గీయులే చెబుతున్న మాట.
ఎవరూ తగ్గట్లే...
అయితే రేవంత్‌రెడ్డి ఇంట్లో లంచ్ మీటింగ్ తర్వాత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సైతం పార్టీ సీనియర్లను ఇంటికి ఆహ్వానించారు. వారితో పాల్వాయి స్రవంతి పేరునే ప్రతిపాధించారు. ఏఐసీసీ దృష్టికి, ప్రియాంకగాంధీ వరకు ఆమె పేరే తీసుకెళ్లినప్పటికి చివరి సర్వే కోసం ప్రకటన ఆగిపోయింది. అయితే ఈవిషయంలో కాంగ్రెస్ అభ్యర్ధి పేరు ప్రకటించే వరకు ఇష్యూని వదిలిపెట్టకూడదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి భావిస్తున్నారట. తాను సూచించిన అభ్యర్ధికి టికెట్ కన్ఫామ్ చేస్తే తప్ప పార్టీ మీటింగ్‌లు, నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొనాలని లేకపోతే దూరంగా ఉండాలని ఫిక్సైపోయినట్లుగా తెలుస్తోంది.
అభ్యర్ధి కన్ఫామ్ అయితేనే..
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్ధి ఎంపిక విషయంలో రెండు వర్గాలు తమ పంతం నెగ్గించుకోవడానికి సైలెంట్‌గా ఫైట్ చేస్తున్నాయి. సీఎల్పీ నేత భట్టితో పాటు సీనియర్లను కలుపుకొని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ట్రై చేస్తుంటే ...ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్‌తో తన మాట నెగ్గించుకోవాలని ప్లాన్‌లో రేవంత్‌రెడ్డి ఉన్నారని ఆదివారం ఢిల్లీలో జరిగిన ఈ ఇద్దరు నేతల విందు సమావేశాలను బట్టి చూస్తుంటే అర్ధమవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Komatireddy venkat reddy, Mp revanthreddy, Munugode Bypoll, Telangana Politics