TS POLITICS REVANTH REDDY AND KOMATIREDDY VENKAT REDDY TRYING TO GET PERMISSION FOR PADAYATRA IN TELANGANA ALL EYES ON RAHUL GANDHI AK
Telangana Congress: రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి రెడీ..రాహుల్ గాంధీ ఎవరికి ఓకే చెబుతారన్నదే హాట్ టాపిక్
ప్రతీకాత్మక చిత్రం
Telangana: ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారని సమాచారం.
తెలంగాణ కాంగ్రెస్ నేతల ఫోకస్ అంతా ఇప్పుడు రాహుల్ గాంధీ హాజరుకాబోయే వరంగల్ సభ మీదే ఉంది. వచ్చే నెలలో జరగబోయే ఈ సభను విజయవంతం చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ సభ సక్సెస్ సాధిస్తే.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కోల్పోతున్న పట్టు తిరిగి వస్తుందనే భావనలో చాలామంది నేతలు ఉన్నట్టు సమాచారం. అందుకే తెలంగాణవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు వరంగల్ సభకు పెద్ద ఎత్తున తరలిరావాలని నేతలు చెబుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు ఈ సభ ద్వారా రాహుల్ గాంధీ(Rahul Gandhi) టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గట్టిగా టార్గెట్ చేయడం ద్వారా రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి తామే ప్రత్యామ్నాయనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వెళతాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అదే సమయంలో రాహుల్ గాంధీ ముందు తెలంగాణలోని పలువురు ముఖ్యనేతలు కీలక ప్రతిపాదనలు ఉంచబోతున్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం టీపీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ రెడ్డి(Revanth Reddy), రాష్ట్ర పార్టీ స్టార్ క్యాంపెయినర్‌గా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తెలంగాణలో పాదయాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. రేవంత్ రెడ్డి రాష్ట పార్టీ పగ్గాలు చేపట్టిన వెంటనే పాదయాత్రకు సంబంధించిన కసరత్తు కూడా చేపట్టారు. అయితే ఆ తరువాత పరిణామాలు మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఆ పార్టీ జాతీయ నాయకత్వం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై దృష్టి పెట్టి అంతా చక్కదిద్దడంతో.. మరోసారి తన పాదయాత్ర ఆలోచనను రాహుల్ గాంధీ ముందు ఉంచాలనే యోచనలో రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.
ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర చేస్తున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్లబోతున్నారని సమాచారం. పాదయాత్రకు సంబంధించి రేవంత్ రెడ్డి అండ్ టీమ్ ఇప్పటికే ఓ బ్లూ ప్రింట్‌ను కూడా సిద్ధం చేసుకుందని.. పార్టీ హైకమాండ్ ఓకే చెప్పిన వెంటనే ఆయన క్షేత్రస్థాయిలో పాదయాత్ర మొదలుపెట్టేందుకు సిద్ధమవుతున్నారని పలువురు చర్చించుకుంటున్నారు.
అదే సమయంలో పార్టీకి చెందిన మరో ముఖ్యనేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సైతం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలనే ఆలోచనలో ఉన్నారని.. ఆయన కూడా ఈ విషయాన్ని రాహుల్ గాంధీ ముందు ఉంచబోతున్నారని తెలుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తెలంగాణవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు సిద్ధమవుతుండటంతో.. కాంగ్రెస్ హైకమాండ్ వీరిలో ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నది కూడా ఆసక్తికరంగా మారింది. మొత్తానికి తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ.. ఈ నేతల పాదయాత్ర విషయంలో నిర్ణయం తీసుకుంటారా ? లేక మరికొద్ది రోజులు వీరి ఆలోచనకు బ్రేక్ వేస్తారా ? అన్నది చూడాలి.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.