TS POLITICS REASON BEHIND WHY KHAMMAM EX MP PONGULETI SRINIVAS REDDY NOT GET RAJYA SABHA SEAT BY TRS HIGH COMMAND OF TELANGANA AK
Ponguleti Srinivas Reddy: పొంగులేటికి రాజ్యసభ సీటు అందుకే రాలేదా? మాజీ ఎంపీ ఆ రకమైన ఆలోచనతో ఉన్నారా ?
టీఆర్ఎస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ఫైల్ ఫోటో)
Telangana Politics: ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కేబినెట్లో మంత్రి కావాలన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచన అని.. ఆయన కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుల ఎంపిక పూర్తయ్యింది. ఎందరో ఆశావాహులు ఈ పదవుల కోసం పోటీపడగా.. ఆ అవకాశం మాత్రం హెటిరో డ్రగ్స్ అధినేత బండి పార్థసారథిరెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, వద్దిరాజు రవిచంద్రకు కల్పించారు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్. దీంతో ఈ పదవులపై ఆశలు పెట్టుకున్న వారి పరిస్థితి ఏమిటన్న దానిపై టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. మిగతా వారి సంగతి ఎలా ఉన్నా.. రాజ్యసభ(Rajya Sabha) రేసులో ఉన్నారనే ప్రచారం జరిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి పొలిటికల్ ఫ్యూచర్‌పై అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నామా కోసం తన ఎంపీ పదవిని వదులుకున్న పొంగులేటికి రాజ్యసభ సీటు ఇస్తారని వార్తలు వచ్చాయి. కానీ అలా జరగలేదు. దీంతో ఆయన తన రాజకీయ భవిష్యత్తుపై ఏ రకమైన నిర్ణయం తీసుకుంటారో అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే రాజ్యసభకు వెళ్లే విషయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) పెద్దగా ఆసక్తి చూపలేదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఒకవేళ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కచ్చితంగా రాజ్యసభ సీటు కోసం ప్రయత్నించి ఉంటే.. ఆయనకు కచ్చితంగా టీఆర్ఎస్ నాయకత్వం అవకాశం కల్పించి ఉండేదని.. కానీ ఆయన పెద్దల సభకు వెళ్లేందుకు పెద్దగా ఆసక్తి చూపించలేదని కొందరు చర్చించుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ముందే చెప్పారని.. అందుకే రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక వ్యవహారంలో టీఆర్ఎస్ నాయకత్వం ఆయన పేరును పరిశీలనలోకి తీసుకొలేదని చర్చ జరుగుతోంది. మరోవైపు వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని టీఆర్ఎస్ (TRS) సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది.
ఎమ్మెల్యేగా గెలిచి రాష్ట్ర కేబినెట్లో మంత్రి కావాలన్నది పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆలోచన అని.. ఆయన కూడా ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయాలని పొంగులేటి శ్రీనివాసరెడ్డి చాలాకాలం నుంచి యోచిస్తున్నారు. ప్రస్తుతం ఆ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున గెలిచిన వనమా వెంకటేశ్వరరావు టీఆర్ఎస్లో చేరారు. అయితే ఆయన కుమారుడు రాఘవ కారణంగా వనమా ఇమేజ్ బాగా డ్యామేజ్ అయ్యింది.
దీంతో వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నాయకత్వం వనమాకు టికెట్ ఇచ్చే అవకాశం కూడా లేదని.. అదే జరిగితే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం తనకు వస్తుందని పొంగులేటి లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. అక్కడ నుంచి టీఆర్ఎస్ తరపున జలగం వెంకట్రావు కూడా టికెట్ కోసం పోటీ పడుతున్నా.. టీఆర్ఎస్ నాయకత్వం తనవైపు మొగ్గు చూపుతుందని పొంగులేటి భావిస్తున్నట్టు తెలుస్తోంది. అక్కడ నుంచి తాను గెలిచి.. వచ్చే ఎన్నికల తరువాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడితే.. తనకు మంత్రి పదవి దక్కుతుందనే ఆలోచనలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉన్నారని ఖమ్మం పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.