తెలంగాణలో ఇప్పుడు రాజకీయమంతా బీజేపీదే. రాష్ట్రంలో బలపడేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేస్తోంది కమలం పార్టీ. ప్రధాని మోదీతో సహా అంతా రంగంలోకి దిగి తెలంగాణలో బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం టీఆర్ఎస్దే అయినా.. రాజకీయ సందడి మాత్రం బీజేపీదే అని చెప్పాలి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంతో పాటు ప్రధాని సహా ఇతర కేంద్రమంత్రుల పర్యటనలతో కాషాయ హంగామా సందడి చేస్తోంది. తెలంగాణకు తరచూ వస్తున్న ఆ పార్టీ జాతీయ నేతలు టీఆర్ఎస్, కేసీఆర్ను(KCR) టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విషయంలో ఎప్పటికప్పుడు దూకుడును మరింతగా పెంచుతున్నారు.
బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగి టీఆర్ఎస్(TRS) ప్రభుత్వం, కేసీఆర్ను విమర్శిస్తున్నా.. గులాబీ బాస్ మాత్రం ఈ మౌనంగానే ఉంటున్నారు. కేటీఆర్, హరీశ్ రావు ఇతర మంత్రులు మాత్రమే బీజేపీ(BJP) నేతలు చేస్తున్న విమర్శలకు కౌంటర్ ఇస్తున్నారు. కేసీఆర్ ఈ స్థాయిలో మౌనంగా ఎందుకు ఉంటున్నారో ఆ పార్టీ నేతలకు కూడా అర్థంకావడం లేదు. అయితే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. సమయం వచ్చినప్పుడు రంగంలోకి దిగి ప్రత్యర్థులను తనదైశ శైలిలో టార్గెట్ చేస్తుంటారు.
ప్రస్తుతం కూడా ఆయన అదే రకమైన వ్యూహంతో ఉన్నట్టు చర్చ జరుగుతోంది. బీజేపీ నేతల విమర్శలకు తాను కౌంటర్ ఇస్తే.. తెలంగాణలో రాజకీయ వేడి మరింతగా పెరిగిపోతుందని కేసీఆర్ భావించి ఉండొచ్చని కొందరు భావిస్తున్నారు. అదే జరిగితే బీజేపీ నేతలు మరింతగా రెచ్చిపోతారని.. ప్రజలు కూడా ఎన్నికల మూడ్లోకి వెళితే పరిస్థితులు మారిపోతాయని కేసీఆర్ అనుకుని ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
అదే జరిగితే.. ఎన్నికలకు మరికొంతకాలం సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం నెలకొంటుందని.. అప్పుడు తాము చేయాలనుకున్న పనులు, చేస్తున్న పనులు ప్రజల్లోకి వెళ్లడం కష్టమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి లెక్కలు వేసుకుంటున్నట్టు సమాచారం. ఒకవేళ టీఆర్ఎస్ ముందస్తు ఎన్నికలకు సిద్ధపడినా.. ఎన్నికల సమయం దగ్గరపడినా.. కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి బీజేపీతో అమీతుమీకి సిద్ధమవుతారని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి తెలంగాణలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ తమను కవ్విస్తున్న బీజేపీ విషయంలో కేసీఆర్ వ్యూహాత్మకంగానే మౌనం పాటిస్తున్నట్టు కనిపిస్తోంది.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.