రాజకీయ పార్టీలు ఏం చేసినా అందులో ఒక వ్యూహం ఉంటుంది. వ్యూహాలు లేకుండా రాజకీయ పార్టీలు ఏ పని చేయవు. ఇటీవల టీఆర్ఎస్ పార్టీకి చెందిన కొందరు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు దివంగత ఎన్టీఆర్ ఘాట్ దగ్గరికి వెళ్లి నివాళులు అర్పించడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేని విధంగా టీఆర్ఎస్ నేతలు ఈ విధంగా చేయడం వెనుక ఏదో కారణం ఉంటుందని.. బాహుశా వచ్చే ఎన్నికల్లో ఓ సామాజికవర్గం ఓట్లు, తెలంగాణలోని ఆ వర్గం సెటిలర్ల ఓట్లను ఆకర్షించేందుకే టీఆర్ఎస్(TRS) ఎన్టీఆర్‌కు(NTR) జై కొడుతోందనే ప్రచారం జోరుందుకుంది. గతంలోనే టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్టీఆర్‌ను పొడిగిన సందర్భాలు ఉన్నాయి. అయితే అప్పుడు కూడా కేసీఆర్ (KCR)అవన్నీ ఓట్లు, ఎన్నికల కోసమే చేశారనే ప్రచారం జరిగింది.
తాజాగా టీఆర్ఎస్ నేతలు ఎన్టీఆర్‌కు నివాళులు అర్పించడం.. ఆయనకు భారతరత్న ఇవ్వాలని కేంద్రంపై ఒత్తిడి చేస్తామని ప్రకటించడం కూడా ఈ రకమైన వ్యూహంలో భాగమే అనే చర్చ జరుగుతోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో టీడీపీ, జనసేన కూటమిగా బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ రెండు పార్టీలకు బీజేపీ జత కలుస్తుందా ? లేదా అన్నది క్లారిటీ రావడం లేదు. టీడీపీతో జతకట్టాలనే ఆలోచనకు బీజేపీ నాయకత్వం వ్యతిరేకంగా ఉందనే చర్చ జరుగుతోంది.
అయితే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో ఏపీలో టీడీపీతో బీజేపీ జత కలవకపోతే.. బీజేపీపై సెటిలర్ల ఓ సామాజికవర్గం ఓటర్లు వ్యతిరేక వైఖరితో ఉంటారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నారని.. అది తెలంగాణలో తమకు కలిసివస్తుందని కేసీఆర్ లెక్కలు వేసుకుంటున్నారని సమాచారం. ఒకవేళ ఏపీలో బీజేపీని టీడీపీకి అనకూలంగా ఉండే సామాజికవర్గం వ్యతిరేకిస్తే.. తెలంగాణలోనూ అదే రకమైన ప్రభావం ఉంటుందని.. తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా పోరు జరిగితే.. టీడీపీకి అనుకూలంగా ఉంటే ఓటు బ్యాంక్ మొత్తం తమ పార్టీకే వస్తుందని టీఆర్ఎస్ వర్గాలు లెక్కలు వేసుకుంటున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
Kodandaram: కోదండరామ్ అలాంటి పరిస్థితి తెచ్చుకున్నారా ?.. ఇక ఆ ఒక్కటే మార్గమా ?
CM KCR | Centre : తెలంగాణలో ఆర్థిక సంక్షోభం? -జీతాలు, పథకాలకు నిధులు కటకట -చేబదుళ్లు, ఓడీపై దృష్టి!
ఇందుకోసమే ఎన్టీఆర్‌కు జై కొడుతూ టీఆర్ఎస్ ఆ వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తోందని పలువురు భావిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లోనూ తెలంగాణలోని సెటిలర్లు టీఆర్ఎస్‌కు జై కొట్టారు. వారి ప్రభావం ఎక్కువగా ఉన్న నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ విజయం సాధించింది. వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి ఆ వర్గం ఓట్లను తమ సొంతం చేసుకునేందుకు టీఆర్ఎస్ ఇప్పటి నుంచే ప్రయత్నిస్తోందని.. అందుకే ఎన్టీఆర్ విషయంలో టీఆర్ఎస్ నేతలు కాస్త ఎక్కువగా భక్తిని ప్రదర్శిస్తున్నారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.