తెలంగాణలో అప్పుడే ఎన్నికల మూడ్ వచ్చేసింది. అన్ని పార్టీలు వచ్చే అసెంబ్లీలో గెలుపు ఎలా తమ సొంతం చేసుకోవాలనే దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టాయి. ఇందుకు అధికార టీఆర్ఎస్ (TRS) ఏ మాత్రం మినహాయింపు కాదు. ఇక ఈసారి గతంలో మాదిరిగా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇచ్చే ఆలోచనలో టీఆర్ఎస్ అధినేత లేరని.. పనితీరు సరిగ్గా లేని వారిని, ప్రజల్లో వ్యతిరేకత ఉన్నవారిని పక్కనపెట్టాలనే నిర్ణయానికి గులాబీ బాస్ దాదాపుగా వచ్చేశారని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంద. ఈ క్రమంలో కొన్ని నియోజకవర్గాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ.. ఆ సీటు తమదే అని కొందరు నేతలు ప్రచారం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ మాజీ మేయర్, టీఆర్ఎస్ నేత బొంతు రామ్మోహన్ (Bonthu Ram mohan) కూడా ఇదే రకమైన ప్రచారం చేసుకుంటున్నారనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతోంది.
బొంతు రామ్మోహన్ నగర మేయర్‌గా పని చేస్తున్న సమయంలోనే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని అనుకున్నారు. ఇందుకోసం తాను ప్రాతినిథ్యం వహించిన చర్లపల్లి డివిజన్ ఉన్న ఉప్పల్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. అయితే 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఆశలు ఫలించలేదు. ఆ సీటును భేతి సుభాష్ రెడ్డికి కేటాయించారు కేసీఆర్. ఆయన ఆ ఎన్నికల్లో గెలిచి ప్రస్తుతం ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో భేతి సుభాష్ రెడ్డికి టీఆర్ఎస్ మళ్లీ టికెట్ ఇచ్చే అవకాశం లేదని.. అక్కడ నుంచి వచ్చే ఎన్నికల్లో తానే పోటీ చేస్తానని బొంతు రామ్మోహన్ ప్రచారం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది.
ఇటీవల ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన అనుచరులు పెద్ద ఎత్తున సందడి చేశారు. హైదరాబాద్‌లోని ఈసీఐఎల్‌లో భారీ ర్యాలీ తీశారు. దీంతో అక్కడి వాహనదారులు కొంతమేర ఇబ్బంది కూడా పడ్డారనే వార్తలు వినిపిస్తున్నాయి. మరోవైపు నగరంలో సందడి చేసిన వారంతా కొద్దిసేపటి తరువాత యాదగిరిగుట్టకు చేరుకుని అక్కడ వేడుక చేసుకున్నారని తెలుస్తోంది. బొంతు రామ్మోహన్‌కు ఉప్పల్ సీటు ఖరారైందని.. అందుకే ఆయన సన్నిహితులు, అనుచరులంతా ఈ రకంగా హంగామా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.
TS Inter Supplementary Exams: తెలంగాణ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్.. ఆ తేదీ పొడిగించిన ఇంటర్ బోర్డు.. వివరాలివే
అయితే సీట్ల కేటాయింపు విషయంలో టీఆర్ఎస్ నాయకత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. బొంతు రామ్మోహన్ తనకు కచ్చితంగా ఉప్పల్ సీటు కావాలనే అంశంపై టీఆర్ఎస్ నాయకత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకే ఆ రకమైన వ్యూహంతో ముందుకు సాగుతున్నారా ? అనే చర్చ కూడా రాజకీయవర్గాల్లో జరుగుతోంది. మొత్తానికి టీఆర్ఎస్ రాజకీయాల్లో కొంతకాలం పాటు సైలెంట్‌గా ఉన్న బొంతు రామ్మోహన్.. ఉన్నట్టుండి యాక్టివ్ కావడం వెనుక అసలు కారణం ఏమిటన్నది ప్రస్తుతానికి సస్పెన్సే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.