తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్‌ను ఢీ కొట్టేందుకు బీజేపీ ఉరకులు వేస్తోంది. ఆ పార్టీలోని అన్ని స్థాయిల్లోని నాయకులు టీఆర్ఎస్‌తో పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఇక టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వచ్చి.. గులాబీ పార్టీకి ఎదురొడ్డి ఎమ్మెల్యేగా విజయం సాధించిన ఈటల రాజేందర్.. ఈ విషయంలో మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. టీఆర్ఎస్‌ను విమర్శించే విషయంలో ఏ మాత్రం తగ్గొద్దన్నట్టుగా వ్యవహరిస్తున్న మాజీమంత్రి ఈటల రాజేందర్(Etela Rajendar).. ఇటీవల తాను గజ్వేల్‌లో(Gajwel) సీఎం కేసీఆర్‌పై(CM KCR) నుంచి పోటీ చేసేందుకు సిద్ధమని ప్రకటించి పెద్ద సంచలనం సృష్టించారు. ఈటల రాజేందర్ ఈ రకమైన ప్రకటన చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. కేసీఆర్‌పై రాజకీయంగా ప్రతీకారం తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఈటల రాజేందర్.. ఇందుకోసం గజ్వేల్‌ను ఎంపిక చేసుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.
ఈటల రాజేందర్ ప్రకటనపై టీఆర్ఎస్ వర్గాల్లోనూ కలకలం మొదలైంది. నిజంగానే ఈటల రాజేందర్ గజ్వేల్ నుంచి బరిలోకి దిగితే పరిస్థితి ఏ విధంగా ఉంటుందనే అంశంపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే అసలు ఈటల రాజేందర్ ఈ స్థాయిలో దూకుడుగా ముందుకు సాగడం వెనుక అసలు కారణం వేరే ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ప్రస్తుతం హుజూరాబాద్ ఎమ్మెల్యేగా ఉన్న ఈటల రాజేందర్.. ఏ పరిస్థితుల్లో కూడా ఆ సీటును వదులుకునే అవకాశం లేదు. ఒకవేళ ఆయన గజ్వేల్ నుంచి పోటీ చేస్తే.. హుజురాబాద్ నుంచి ఆయన తన భార్య జమునను బరిలోకి దింపొచ్చని తెలుస్తోంది.
హుజూరాబాద్ నుంచి తన భార్య జమున పోటీ చేసినా గెలుస్తారని ఆయన ధీమాగా ఉన్నారు. ఇందుకు ప్రధాన కారణం.. హుజూరాబాద్ టీఆర్ఎస్‌లో నేతల మధ్య సఖ్యత లేకపోవడమే అని తెలుస్తోంది. హుజూరాబాద్‌లో ఈటలకు మంచి పట్టు ఉంది. ఈ విషయంలో ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదు. అయితే టీఆర్ఎస్‌లోని స్థానిక నేతల మధ్య ఇక్కడ ఏ మాత్రం సమన్వయం లేదని.. ముఖ్యంగా ఎమ్మెల్సీగా ఉన్న కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి ఈటలపై పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్ మధ్య కోల్డ్ వార్ సాగుతోందని రాజకీయవర్గాల్లో సాగుతోంది.
KCR| Margaret Alva: మార్గరెట్ అల్వాకు కేసీఆర్ జై కొడతారా ? ఆ లెక్కలు వేసుకుంటారా ?
టీఆర్ఎస్ తరపున హుజూరాబాద్‌లో ఎవరికి సీటు వచ్చినా.. మరొకరు ఆ పార్టీ కోసం పని చేసే అవకాశం ఉండదనే టాక్ ఉంది. హుజూరాబాద్‌లో తనకు కలిసొచ్చే అంశాలతో పాటు టీఆర్ఎస్‌కు కలిసిరాని అంశాలు ఎన్నో ఉన్నాయని.. అందుకే ఆయన హుజూరాబాద్ విషయంలో టెన్షన్ లేకుండా ఉన్నారని.. ఆ ధీమాతోనే ఆయన కేసీఆర్‌ను దెబ్బ కొట్టేందుకు గజ్వేల్‌పై ఫోకస్ చేశారని పలువురు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి కేసీఆర్ టార్గెట్‌గా రాజకీయాలు చేయాలని డిసైడయిన ఈటల రాజేందర్‌కు చెక్ చెప్పేందుకు టీఆర్ఎస్ ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CM KCR, Etela rajender, Gajwel, Huzurabad, Telangana