రాహుల్ గాంధీతో సమావేశం తరువాత తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇప్పటివరకు కాంగ్రెస్ హైకమాండ్ రాష్ట్ర పార్టీని పెద్దగా పట్టించుకోవడం లేదనే భావనలో ఉన్న నాయకులు, శ్రేణులు.. ఇప్పుడు రాహుల్ గాంధీతో సమావేశం తరువాత సంతృప్తితో ఉన్నారు. ఒకేసారి 40 మంది నేతలతో రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమావేశం కావడం... నేతలందరూ చెప్పిన విషయాలను ఓపిగ్గా వినడం.. వారికి సూచనలు చేయడం కాంగ్రెస్ నేతలకు కొంతమేర బూస్టింగ్ ఇచ్చినట్టే అని పలువురు నేతలు చర్చించుకుంటున్నారు. అయితే రాహుల్ గాంధీతో నేతల భేటీ తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్ (Congress) నాయకుల తీరు మారుతుందా ? అన్నది ఇప్పుడు అందరిలోనూ చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ(Telangana) కాంగ్రెస్ నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకునే విషయంలో ఏ మాత్రం వెనక్కి తగ్గరు. కొంతకాలంగా తెలంగాణ కాంగ్రెస్‌లో ఈ రకమైన తీరు కొనసాగుతోంది. టీపీసీసీ చీఫ్‌పై ప్రత్యక్షంగా, పరోక్షంగా విమర్శలు చేసే నేతల సంఖ్య ఎక్కువగానే ఉంది. అయితే అలాంటి నేతలందరూ రాహుల్ గాంధీతో భేటీ తరువాత తీరు మార్చుకుంటారా ? అన్నది చూడాల్సి ఉంది. కాంగ్రెస్ నేతల్లో మార్పు వస్తుందా ? లేదా ? అని చెప్పడానికి ఎక్కువ సమయం అవసరం లేదని పలువురు చెబుతున్నారు. ఈ నెలాఖరు వరకు కాంగ్రెస్‌లో మళ్లీ ఎలాంటి అలజడి లేకుండా ఉంటే.. రాహుల్ గాంధీ నేతలకు ఇచ్చిన సూచనలను అంతా పాటించినట్టే భావించాలి.
అదే జరిగితే.. తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి చాలావరకు మెరుగవుతుందని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే తెలంగాణ కాంగ్రెస్ నేతలు హైకమాండ్ చెప్పిన మాటలు, సూచనలు పట్టించుకోవడం అంత ఈజీ కాదనే వాదన కూడా ఉంది. కేవలం ఒకే ఒక్క సమావేశంతో సరిపెట్టకుండా.. రాహుల్ గాంధీ పలుసార్లు రాష్ట్ర వ్యవహారాలపై సీరియస్‌గా ఫోకస్ చేస్తే పరిస్థితిలో కచ్చితంగా మార్పు ఉంటుందనే వారు కూడా ఉన్నారు. మరోవైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ మేరకు మెరుగుపడిందని చెప్పేందుకు ఇప్పుడప్పుడే రాష్ట్రంలో ఎన్నికలు కూడా లేవని కొందరు చర్చించుకుంటున్నారు.
KCR| Khammam: ఖమ్మం జిల్లాపై కేసీఆర్ లెక్కేంటి ? ఆ ఇద్దరినీ లైట్ తీసుకున్నారా ? మరో ఇద్దరిని నమ్ముకుంటున్నారా ?
ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ ఇచ్చిన సూచనలు, ఆదేశాలు పాటించేలా చేయడంతో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్ పాత్ర ఎంతో ఉంటుందని.. ఆయన కూడా గతంలో మాదిరి కాకుండా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలపై సీరియస్‌గా ఫోకస్ చేయాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ నేతల సమావేశం తరువాత రాష్ట్రంలో పార్టీ పరిస్థితి ఏ మేరకు మెరుగవుతుందన్నది తెలియాలంటే మరికొన్ని నెలలు ఆగాల్సిందే.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rahul Gandhi, Telangana