TS POLITICS RAHUL GANDHI TO VISIT HYDERABAD OSMANIA UNIVERSITY ON MAY 7 DAY AFTER CONGRESS MEETING IN WARANGAL SAYS TPCC REVANTH MKS
Rahul Gandhi | OU: మే7న ఉస్మానియా యూనివర్సిటీకి రాహుల్ గాంధీ -6న వరంగల్‌లో కాంగ్రెస్ భారీ సభ
మే 7న ఓయూకు రాహుల్ గాంధీ
కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6న వరంగల్ వేదికగా నిర్వహించే ‘రైతు సంఘర్షణ సభ’కు హాజరుకానున్న రాహుల్.. మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీకి రానున్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ బలోపేతంపై దృష్టి సారించిన రాహుల్ గాంధీ.. వచ్చే నెల తొలివారంలో కీలక పర్యటనకు సిద్దమయ్యారు. కేసీఆర్ సర్కారుపై పోరులో భాగంగా తెలంగాణ కాంగ్రెస్ మే 6న వరంగల్ వేదికగా నిర్వహించే ‘రైతు సంఘర్షణ సభ’కు హాజరుకానున్న రాహుల్.. మరుసటి రోజు హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీని సందర్శించి, విద్యార్థులతో మమేకం కానున్నారు. ఈ విషయాన్ని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతు సమస్యలపైన మే 6న వరంగల్‌లో జరిగే బహిరంగ సభకు వస్తున్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ.. 7న ఉస్మానియా వర్సిటీకి వస్తారని రేవంత్ పేర్కొన్నారు.
తెలంగాణ సాధనలో విద్యార్థుల ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచిన ఉస్మానియా వర్సిటీలో రాహుల్ పర్యటన ద్వారా కేసీఆర్ పాలనలో ఉద్యమ ఫలాలు విద్యార్థులకు దక్కలేదనే అంశానికి ప్రచారం కల్పించాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా ఉంది. ఓయూలో రాహుల్ కార్యక్రమానికి ఇన్చార్జి బాధ్యతలను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డికి అప్పగించనున్నట్లు రేవంత్ తెలిపారు. రాహుల్ సభ ఏర్పాట్లపై సమీక్ష కోసం శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశంలోను, ఆ తర్వాత జరిగిన మీడియా సమావేశంలో నూ ఈ మేరకు రేవంత్‌రెడ్డి వెల్లడించారు.
ఉస్మానియా వర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్దకు రాహుల్‌గాంధీని తీసుకువెళ్లాలని తీర్మానం చేసినట్లు రేవంత్ చెప్పారు. వర్సిటీలో రాహుల్ విజిట్‌కు సంబంధించి వీసీకి వినతిపత్రం ఇచ్చి ఆయనే కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించేలా కృషి చేద్దామంటూ సమావేశంలో ప్రతిపాదించారు. కాగా.. పలువురు ఓయూ విద్యార్థి నేతలు రేవంత్‌రెడ్డిని కలిసి రాహుల్‌గాంధీ వర్సిటీని పర్యటించేలా చొరవ తీసుకోవాలని కోరారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంతో పాటు అనేక పోరాటాలకు పురుటిగడ్డ వరంగల్ నుంచే సీఎం కేసీఆర్ చీడ వదిలించాలని, ఇందుకు మే 6న ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ పాల్గొనే ‘రైతు సంఘర్షణ సభ’ నాంది కావాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో రాహుల్ రెండ్రోజుల పర్యటనను విజయవంతం చేసేందుకు అన్ని స్థాయిల్లోని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు.
వరంగల్ ఆర్ట్స్ కళాశాలలో రాహుల్ పాల్గొనే రైతు సంఘర్షణ సభను విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు. కాంగ్రెస్ పార్టీ 20 ఏళ్ల తర్వాత వరంగల్ వేదికగా భారీ సభ నిర్వహిస్తున్నదని, మరో 20 ఏళ్లు గుర్తుండిపోయేలా దానిని సక్సెస్ చేయాలని నేతలు నిర్ణయించుకున్నారు. రాహుల్ గాంధీ పాల్గొనే రైతు సంఘర్షణ సభకు 40 లక్షల మందిని సమీకరించాలని కాంగ్రెస్ ప్రణాళికలు సిద్ధం చేసింది.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.