రేపు తెలంగాణకు రాబోతున్న రాహుల్ గాంధీ(Rahul Gandhi) వరంగల్‌లో జరగనున్న రైతు సంఘర్షణ సభలో పాల్గొనబోతున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ ఎంతగానో శ్రమిస్తోంది. ఈ సభకు పెద్ద ఎత్తున జనసమీకరణ చేయాలని.. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ నేతలను టీపీసీసీ ఆదేశించింది. ఈ విషయంలో ఏ మాత్రం అలసత్వం వహించవద్దని స్పష్టం చేసింది. మరోవైపు ఈ సభ ద్వారా తాము అంతా ఒక్కటేనని.. అంతా ఐక్యంగానే ఉన్నామనే సంకేతాలు ఇవ్వాలని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) భావిస్తోంది. రాహుల్ గాంధీ హాజరుకాబోతున్న సభ కావడంతో.. ఈ సభకు దాదాపు తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా హాజరవుతారనడంతో సందేహం లేదు.
అయితే ఈ సభకు కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) హాజరవుతారా ? లేదా ? అన్నది సస్పెన్స్‌గా మారింది. కొద్దిరోజుల క్రితం క్యారెక్టర్ లేని వాళ్ల దగ్గర పని చేయలేనంటూ నియోజకవర్గం నేతలతో వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. తాను ఏ నిర్ణయం తీసుకున్నా.. మీ అందరికీ చెప్పే తీసుకుంటానని అన్నారు. అయితే ఆ తరువాత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పెద్దగా పాల్గొనలేదు.
కాంగ్రెస్ ముఖ్యనేతలంతా ఢిల్లీ వెళ్లి రాహుల్ గాంధీని కలిసినప్పుడు కూడా రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ పరిణామాలను ఆయన పెద్దగా పట్టించుకోలేదు. నిజానికి 2018లో కాంగ్రెస్ ఓడిపోయినప్పటి నుంచే ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా వస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీలోకి వెళతారనే ప్రచారం చాలాకాలంగా సాగుతోంది. నేరుగా తాను బీజేపీలోకి వెళతానని చెప్పకున్నా.. అదే అర్థం వచ్చేలా వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
TS Politics: తెలంగాణ మాజీమంత్రి మళ్లీ డైలమాలో పడిపోయారా ? ఎటూ తేల్చుకోలేకపోతున్నారా ?
Telangana: బండి సంజయ్‌తో మాజీ ఎంపీ భేటీ ? కాషాయ కండువా కప్పుకుంటారా ?
మరోవైపు తన సోదరుడి నిర్ణయాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. రాజగోపాల్ రెడ్డి కచ్చితంగా కాంగ్రెస్‌లోనే కొనసాగుతారని ఎంపీ వెంకట్ రెడ్డి చెప్పడం లేదు. దీంతో ఆయన పార్టీలో కొనసాగుతారా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. మరోవైపు రేపు రాహుల్ గాంధీ రాబోయే వరంగల్ సభకు రాజగోపాల్ రెడ్డి వస్తారా ? లేదా ? అనేదాన్ని బట్టి ఆయన కాంగ్రెస్‌తోనే ఉంటారా ? లేదా ? అన్న విషయంలో పూర్తి క్లారిటీ వస్తుందని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.