డ్రగ్స్ పార్టీలో మత్తులో జుగుతూ పట్టుబడిన సెలబ్రిటీల వ్యవహారంపై రాజకీయ ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఓ మాజీ ఎంపీ కూతురికి చెందిన పబ్బుతోపాటు నగరంలో డ్రగ్స్ దందాకు అధికార పార్టీ ముఖ్యనేత అండగా ఉన్నారని విపక్షాలు ఆరోపించాయి.
హైదరాబాద్ లో పెను కలకలం సృష్టించిన తాజా డ్రగ్స్ కేసులో సంచలన విషయాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. బంజారాహిల్స్ ప్రాంతంలోని రాడిసన్ బ్లూ పబ్బుపై శనివారం అర్ధరాత్రి తర్వాత పోలీసులు దాడి చేయగా, డ్రగ్స్ పార్టీ గుట్టు రట్టయింది. సినీ, రాజకీయ ప్రముఖుల పిల్లలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పిల్లలు పలువురు ఈ కేసులో పట్టుబడ్డారు. అయితే, తొలుత 144 మందిని అరెస్టు చేసినట్లు వార్తలు వచ్చినా, అరెస్టయింది 45 మందే అని, మిగతా వారికి నోటీసులు ఇచ్చామని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. డ్రగ్స్ పార్టీ కేసు రాజకీయంగానూ ప్రకంపనలు సృష్టిస్తోంది. అధికార టీఆర్ఎస్ మంత్రి కేటీఆర్ అండతోనే హైదరాబాద్ లో డ్రగ్స్ దందా నడుస్తోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆరోపించారు.
హైదరాబాద్ లో కలకలం రేపిన డ్రగ్స్ పార్టీలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఈ డ్రగ్స్ కేసులో ఎవరినీ వదిలి పెట్టమని ఆయన స్పష్టం చేశారు. పోలీసలు దాడిలో దొరికిన 45 మంది బ్లడ్ శాంపిల్స్ సేకరిస్తున్నామని అన్నారు. వీళ్లంతా డ్రగ్స్ తీసుకున్నట్లు అనుమానం ఉందని కమిషనర్ చెప్పారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన కారణంగా బంజాహిల్స్ సీఐ శివచంద్ర సస్పెన్షన్ వేటు వేసినట్టు కమిషనర్ తెలిపారు. ఏసీపీ సుదర్శన్‌కు చార్జ్ మెమో జారీ చేశామని కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు. డ్రగ్స్ పార్టీ జరిగిన రాడిసన్ బ్లూ అనేది అంతర్జాతీయ హోటల్, క్లబ్ చైన్ కాగా, బంజారాహిల్స్ లోని ఫ్రాంచైజ్ పబ్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రేణుకా చౌదరి కూతురుదని తెలుస్తోంది. కేసులో రేణుక అల్లుణ్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
రాడిసన్ బ్లూ పబ్బులో డ్రగ్స్ పార్టీ ఉదంతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంపై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. 2014లో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక మద్యం ఏరులై పారుతోందని, గంజాయి, డ్రగ్స్ విచ్చిలవిడిగా అమ్ముతున్నారని, శాంతి భద్రతలు అదుపు తప్పాయన్నారు. నగరం నడిబొడ్డున ఎవరి ప్రమేయంతో అర్ధరాత్రి 3 గంటల వరకు పబ్‌లు తెరిచి ఉంచుతున్నారో బహిరంగ రహస్యమేనని, సీఎం కేసీఆర్ కొడుకు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కనుసన్నల్లోనే పబ్‌లు, డ్రగ్స్ దందా నడుస్తున్నాయని మహేశ్ గౌడ్ ఆరోపించారు. ఏసీపీకి మెమో, సిఐని సస్పెండ్ చేయడం సరికాదని, గతంలోనూ డ్రగ్స్ కేసును అట్టకెక్కించారని కాంగ్రెస్ నేత విమర్శించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం గవర్నర్ ద్వారా వెంటనే జోక్యం చేసుకోవాలనీ ఆయన డిమాండ్ చేశారు.
హైదరాబాద్ పబ్బులో డ్రగ్స్ పట్టుబడటం, పెద్ద సంఖ్యలో సెలబ్రిటీలు అడ్డంగా దొరికిన ఉదంతంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగా స్పందించారు. తెలంగాణను డ్రగ్స్ కు అడ్డాగా తయారు చేశారని. డ్రగ్స్ విచ్చలవిడిగా వినియోగం, అమ్మకాలు జరుగుతున్నా పోలీసులు వాటిని అరికట్టలేకపోతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. డ్రగ్స్ కేసులో వీఐపీలు, వాళ్ల పిల్లలు ఉంటే ఆ కేసులను నీరుగారుస్తున్నారని, కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని, పోలీసల దాడిలో దొరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. డ్రగ్స్ దందా మూల సూత్రదారులను ఎన్ కౌంటర్ చేస్తే అందుకు బీజేపీ అండగా ఉంటుందనీ రాజాసింగ్ వ్యాఖ్యానించారు.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.