TS POLITICS PRASHANT KISHOR TO MEET TRS CM KCR ON MAY 18 AT HYDERABAD AMID CONG BJP EARLY POLL CHALLENGE AND PRESIDENT ELECTIONS MKS
CM KCR | Prashant Kishor : మరోసారి కేసీఆర్‌తో పీకే భేటీ.. బీజేపీకి దిమ్మతిరిగే వ్యూహం ఇదేనా?
కేసీఆర్, పీకే
ప్రత్యర్థుల్ని విమర్శించే పనిని కుటుంబీకులకు అప్పగించిన కేసీఆర్ తాను మాత్రం బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చేలా వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను మరోసారి హైదరాబాద్ పిలిపించారు..
తెలంగాణలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు ఉండబోవని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ (Telangana CM KCR) ఆమధ్య స్పష్టం చేశారు. కానీ ప్రగతి భవన్, ఫామ్ హౌజ్ వేదికలుగా ఆయన ముందస్తు వ్యూహాలనే రచిస్తున్నారని, కేసీఆర్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెట్టినా బీజేపీ రెడీగా ఉందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజా బహిరంగ సభలో అన్నారు. ఇటీవల రాహుల్ గాంధీ పాల్గొన్న వరంగల్ సభలోనూ తాము ముందస్తుకు సిద్ధమేనని తెలంగాణ కాంగ్రెస్ ప్రకటించింది. విపక్షాలు విసిరిన ముందస్తు సవాలుపై కేసీఆర్ ఇంకా స్పందించలేదు. అయితే, ప్రత్యర్థుల్ని విమర్శించే పనిని కుటుంబీకులకు అప్పగించిన కేసీఆర్ తాను మాత్రం బీజేపీకి దిమ్మతిరిగే షాకిచ్చేలా వ్యూహరచనలు చేస్తున్నట్లు తెలస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) ను కేసీఆర్ మరోసారి హైదరాబాద్ పిలిపించారు..
సీఎం కేసీఆర్ తో టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఈనెల 18న (బుధవారం) భేటీ కానున్నారు. కాంగ్రెస్ లో చేరిక ప్రయత్నాలు వదిలేసి, సొంత పార్టీ పెట్టే దిశగా ‘జన్ సురాజ్‘వేదిక ఏర్పాటు, పాదయాత్ర ప్రకటన తర్వాత పీకే తొలిసారి కేసీఆర్ ను కలవనున్నారు. తెలంగాణలో నెలకొన్న పలు రాజకీయ సమీకరణాలపై కేసీఆర్‌కు పీకే నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. టీఆర్ఎస్ బలహీనంగా ఉన్న నియోజకవర్గాలపైనా సీఎంకు రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలియవచ్చింది. అదే రోజు ప్రగతి భవన్లో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమంపై రివ్యూ నిర్వహించనున్న కేసీఆర్.. అధికారిక సమీక్ష ముగిసిన వెంటనే ప్రశాంత్ కిషోర్ తో ఏకాంతంగా, బృందాలతో కలిసి భేటీ కానున్నట్లు సమాచారం.
టీఆర్ఎస్ పార్టీ కోసం ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనులు మొదలుపెట్టిన పీకే.. ఎన్నికల ప్రచార టీమ్‌ను సిద్ధం చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే ఐ-ప్యాక్ సంస్థ కింద భారీగా నియామకాలు చేపట్టారు. వచ్చే నెలలో పెద్ద సంఖ్యలో సంస్థలో ఉద్యోగులుగా చేరనున్నారు. దీంతో వచ్చే నెల నుంచే పూర్తి స్థాయిలో టీఆర్ఎస్ అసలైన ప్రచార పర్వం మొదలు కానుంది. ఈ అంశాలతోపాటు తెలంగాణ పరిధిలో విపక్షాలుక కౌంటరిచ్చే వ్యూహాలు, జాతీయ స్థాయిలో బీజేపీకి దిమ్మతిరిగేలా భారీ దెబ్బ కొట్టే ఆలోచనలపైనా పీకేతో కేసీఆర్ మేధోమథనం చేయనున్నట్లు తెలుస్తోంది.
పీకేతో భేటీ తర్వాతే టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక, అమిత్ షా, రాహుల్ గాంధీ విమర్శలకు సమాధానాలు, ముందస్తు ఎన్నిలపై బీజేపీ కాంగ్రెస్ సవాళ్లకూ గులాబీ బాస్ విస్పష్ట ప్రకటన చేస్తారని సమాచారం. అన్నిటికంటే ప్రధానంగా బీజేపీని దెబ్బతీయగలిగే అవకాశం ఉన్న రాష్ట్రపతి ఎన్నికలపైనా కేసీఆర్ ఫోకస్ పెట్టనున్నారని, ఈ విషయంలో జాతీయ స్థాయిలో అన్ని పార్టీలకు బ్రీఫింగ్స్ ఇవ్వాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయా పార్టీల రియాక్షన్లను బట్టి కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీని దెబ్బకొట్టే వ్యూహం అమలు చేయడమా, లేక ప్రశాంత్ కిశోర్ ద్వారా ఆ పనిని సున్నితంగా హడావుడి లేకుండా నిర్వహించడమా అనేదీ ఈనెల 18న భేటీ తర్వాత క్లారిటీ వస్తుందని సమాచారం.
గడిచిన మూడేళ్లలో బీజేపీ నుంచి పాతమిత్రులు ఎందరో దూరం కావడం, యూపీలో సీట్లు భారీగా తగ్గడం, విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి రావడం లాంటి పరిణామాలు రాష్ట్రపతి ఎన్నికల్లో కమలదళాన్ని కలవరపెడుతున్నది. ప్రత్యర్థులు పెరిగిపోయిన రీత్యా రాష్ట్రపతి ఎన్నికల్లో ఆచితూచి అడుగు వేయకుంటే దెబ్బతినే పరిస్థితి నెలకొంది. రాష్ట్రపతి ఎన్నికను నిర్ణయించే ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 10,98,903 ఓట్లున్నాయి. అందులో బీజేపీకి సొంతగా 4,65,797 ఓట్లున్నాయి. బీజేపీకి పక్కా మిత్రపక్షాలైన పార్టీలకు 71,329 ఓట్లు ఉన్నాయి. అంటే మొత్తంగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థికి 5,37,126 ఓట్లు పడతాయి. కానీ
ఒకవేళ విపక్షాలన్నీ ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే బీజేపీ మెజారిటీ మార్కు(మ్యాజిక్ ఫిగర్) సాధించడానికి ఇంకా 9,194 ఓట్లు తక్కువవుతాయి. ఆ ఓట్లు ఎవరిద్వారా రాబట్టాలా? అని బీజేపీ ఇప్పటి నుంచే మల్లగుల్లాలు పడుతోంది. రాబోయే రాష్ట్రపతి ఎన్నికల్లో ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ కు సమాన దూరం పాటిస్తోన్న కేసీఆర్, కేజ్రీవాల్ లాంటి నేతలు కీలకం కానున్నారు. కాంగ్రెస్ పై వరుస విమర్శలు చేయడం, బీజేపీ ఐటీ సెల్ ప్రచారాలను నెత్తికెత్తుకోవడం ద్వారా ఏపీ సీఎం వైఎస్ జగన్ నాయకత్వంలోని వైఎస్సార్సీపీ ఇప్పటికే తన వైఖరిని పరోక్షంగా వెల్లడించింది. కాగా,
రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి విషయంలో చక్రం తిప్పడంతోపాటు కీలకమైన మద్దతు కూడా కేసీఆర్ ఆఫర్ చేస్తారని, టీఆర్ఎస్ పై అపనమ్మకంతో ఇన్నాళ్లూ కేసీఆర్ ను దూరం పెట్టిన విపక్షాలకు గులాబీ బాస్ ఆలోచనలను వివరించే బాధ్యతను ప్రశాంత్ కిషోర్ తీసుకుంటారని, మొత్తంగా అందరూ కలిసికట్లుగా ఉంటే గనుక రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం ద్వారా బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇవ్వొచ్చనే వ్యూహంతో కేసీఆర్ అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు ఎలా వ్యవహరిస్తున్నారో.. రేపు బీజేపీయేతర రాష్ట్రపతి గెలిస్తే కేంద్రానికీ అలాంటి చిక్కులే తప్పవనే వాదన ఉంది. ఈనెల 18న కేసీఆర్ తో పీకే భేటీ తర్వాత సంబంధిత అంశాలపై క్లారిటీ, కదలికలు ఉండొచ్చని సమాచారం.
Published by:Madhu Kota
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.