ముందస్తుకు వెళ్లడంలేదని చెప్పినప్పటికీ ఎన్నికల వ్యూహరచనను వేగవంతం చేశారు గులాబీ బాస్, సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ తోపాటు ఇతరులు చేసిన సర్వే రిపోర్టులు సీఎం టేబుబుల్ పైకి చేరుతున్నాయి. మొత్తం 103 మంది సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు జరిపిన సర్వేలో షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. చాలా చోట్ల సిట్టింగ్ లపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నట్లు వెల్లడైంది. ఏళ్లపాటు ఎమ్మెల్యేలుగా ఉండి కూడా ప్రజాదరణ పొందలేని సిట్టింగ్ లతో సీఎం కేసీఆర్ వన్ టు వన్ మాట్లాడనున్నారు. ఈసారి ఎవరెవరికి టికెట్లు దక్కే అవకాశం లేదో ఆ భేటీల్లోనే కుండబద్దలుకొట్టనున్నారు.
2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆయా నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ఎమ్మెల్యేల పనితీరుపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నియమించిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ బృందంతో సహా మూడు వేర్వేరు ఏజెన్సీల బహుళ సర్వేలు తుది దశకు చేరుకున్నాయి. మొత్తం 103 మంది సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేల పనితీరును అంచనా వేసేందుకు సర్వేలు జరుగుతున్నాయని, మిగిలిన ఆరు స్థానాల్లో కాంగ్రెస్, మూడు స్థానాల్లో టీఆర్‌ఎస్‌కు దక్కే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు తెలిపాయి. ఏఐఎంఐఎంకు ఉన్న ఏడు స్థానాలు మినహా మొత్తం 112 అసెంబ్లీ నియోజకవర్గాల తుది సర్వే నివేదికలను ఏప్రిల్ 15లోగా సీఎం చేతికి అందనుంది. ఇప్పటికే 30 స్థానాల రిపోర్టు ప్రగతి భవవన్ టేబుల్ పైకి వచ్చేసింది.
పీకే, ఇతర టీంలు చేపట్టిన సర్వేల్లో పనితీరు పేలవంగా ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య భారీగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అంతమందికీ టికెట్లు నిరాకరిస్తే ఏర్పడే పరిణామాలను అంచనా వేస్తూ, వారిలో కొందరికి పనితీరును మెరుగుపరచుకోవడానికి కేసీఆర్ ఆరు నెలల సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిసింది. ఆరు నెలల తర్వాత తిరిగి సర్వే చేయిస్తామని, ఆలోగా పని తీరు, ప్రజాదరణ మెరుగుపర్చుకోలేని ఎమ్మెల్యేలకు 2023 ఎన్నికల్లో టికెట్ ఇవ్వరాదని గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే సీఎం చెంతకు చేరిన 30 నియోజకవర్గాల సర్వే రిపోర్టులో టీఆర్‌ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లు సంతోషంగా ఉన్నారని, సీఎం కేసీఆర్ పట్ల ప్రజల్లో ఇష్టత కూడా వ్యక్తమైంది. కానీ సిట్టింగ్ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై మాత్రం ప్రజావ్యతిరేకత స్పష్టంగా కనిపించిందని, సిట్టింగ్ ఎమ్మెల్యేలకు బదులు ఈసారి కొత్త ముఖాలను జనం కోరుకుంటున్నట్లు సర్వేలో తేలింది. ప్రధానంగా ఒకటి కంటే ఎక్కువసార్లు ఎమ్మెల్యేలుగా గెలిచినవారి నియోజకవర్గాల్లో సిట్టింగ్ లపై వ్యతిరేక ధోరణి కనిపించింది.
తెలంగాణ అసెంబ్లీలో మొత్తం 119 మంది ఎమ్మెల్యేలలో 90 మంది ఎమ్మెల్యేలు ఒకటి కంటే ఎక్కువ సార్లు గెలిచినవారే కావడం గమనార్హం. వీరిలో 80 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారే. 119 మంది ఎమ్మెల్యేలలో 44 మంది ఎమ్మెల్యేలు రెండు దఫాలుగా ఎన్నికైనవారు కాగా, 22 మంది ఎమ్మెల్యేలు మూడు సార్లు, 14 మంది ఎమ్మెల్సీలు నాలుగుసార్లు, 5 మంది ఎమ్మెల్యేలు ఐదుసార్లు, 4 మంది ఎమ్మెల్యేలు ఆరుసార్లు గెలిచినవారున్నారు. అనేకసార్లు గెలిచిన ఎమ్మెల్యేల్లో అత్యధికులు టీఆర్‌ఎస్‌కు చెందినవారే.
టీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఓటర్లలో సాఫ్ట్ కార్నర్ ఉన్నప్పటికీ, పలుసార్లు గెలిచిన ఎమ్మెల్యేలపై 'యాంటీ ఇన్‌కంబెన్సీ' స్పష్టంగా వ్యక్తమవుతోందని పీకే, ఇతరుల సర్వేలు సూచించాయి. ఇతర పార్టీల నుంచి గెలిచి, టీఆర్ఎస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల స్థానాల్లోనూ వ్యతిరేకత ఉన్నట్లు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.